వొడా నుంచి 20 లక్షల మంది ఔట్‌.. జియో, ఎయిర్‌టెల్‌లోకి చెరి సగం!

VI loses 20 lakh customers: వొడాఫోన్‌ ఐడియా మరోసారి భారీగా కస్టమర్లను కోల్పోయింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ చందాదారులను చెరి సగం చేర్చుకున్నాయి.

Published : 12 May 2023 14:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (VI) నుంచి చందాదారుల వలస కొనసాగుతోంది. ఫిబ్రవరిలో ఆ కంపెనీ ఏకంగా 20 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. అదే సమయంలో జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel) చెరి సగం చందాదారులను కైవసం చేసుకున్నాయి. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) ఫిబ్రవరి నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.

ఫిబ్రవరి నెలలో వొడాఫోన్‌ ఐడియా నుంచే 20 లక్షల మంది వినియోగదారులు చేజారిపోయారని ట్రాయ్‌ తెలిపింది. అదే నెలలో జియోలోకి 10 లక్షల మంది, ఎయిర్‌టెల్‌లోకి 9,82,554 మంది చేరారని పేర్కొంది. అలాగే మొత్తం వైర్‌లెస్‌ వినియోగదారుల సంఖ్య 10 లక్షల మేరకు తగ్గారని తెలిపింది. ఇక సబ్‌స్క్రైబర్ల పరంగా జియో 37.41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్‌ 32.39 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికీ వీఐకు 20 శాతం మార్కెట్‌ వాటా ఉందని ట్రాయ్‌ వెల్లడించింది. మొత్తం టెలికాం మార్కెట్‌లో ప్రైవేటు సంస్థల వాటా 90 శాతం కాగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు కేవలం 9.37 శాతం మాత్రమే ఉంది.

వొడాఫోన్‌ ఐడియా చర్యలు ఫలించేనా..?

వొడాఫోన్‌ ఐడియా అప్పులు ఆ సంస్థను వేధిస్తున్నాయి. ఓ వైపు జియో, ఎయిర్‌టెల్‌ పోటాపోటీగా 5జీ సేవలు ప్రారంభిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వీఐ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఓ విధంగా చందాదారులు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోవడానికి ఇది ప్రధాన కారణమవుతోంది. అయితే, వొడాఫోన్‌ ఓ కొత్త పునరుద్ధరణ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా మళ్లీ వొడాఫోన్‌ ఐడియా బోర్డులోకి రావడం ఓ సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌ నాటికి ఆ కంపెనీకి రూ.2.2 లక్షల కోట్ల మేర అప్పులు ఉండగా.. ఏజీఆర్‌ బకాయిల కింద రూ.16,133 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని