Ethanol blended petrol: ఈ బంకుల్లో ఇకపై 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌

e20 blended petrol: 20 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను తమ చమురు పంపుల వద్ద విక్రయించనున్నట్లు జియో-బీపీ వెల్లడించింది.

Published : 09 Feb 2023 15:02 IST

దిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపిన చమురు ఇకపై తమ పెట్రోల్‌ పంపుల వద్ద లభ్యమవుతుందని జియో-బీపీ (Jio-bp) వెల్లడించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యూకేకి చెందిన బీపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 20 శాతం ఇథనాల్‌ కలిపిన ఈ20 (E20 petrol) పెట్రోల్‌ను విక్రయిస్తున్న తొలి రిటైలర్‌ తామేనని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముడి చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడంలో భాగంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

80 శాతం పెట్రోల్‌, 20 శాతం ఇథనాలు కలిపిన చమురును ఈ20గా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన జియో-బీపీ పెట్రోల్‌ పంపుల వద్ద ఈ20 పెట్రోల్‌ అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. వాహనదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. త్వరలో మరిన్ని పంపుల్లో ఈ20 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. రిలయన్స్‌, బీపీ సంస్థలు ఏర్పాటు చేసిన ఈ జాయింట్‌ వెంచర్‌కు దేశవ్యాప్తంగా 1510 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి.

చెరకు, బియ్యం నూకలు, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్‌ను తీస్తారు. చమురు దిగుమతుల వ్యయాన్ని తగ్గించడంతో పాటు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇథనాల్‌ను కలిపే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల రైతుల ఆదాయం సైతం పెరుగుతుందని చెబుతోంది. దశలవారీగా ఇథనాల్‌ను కలిపే శాతాన్ని పెంచుతూ వస్తున్న భారత్‌.. తాజాగా 20 శాతానికి తీసుకొచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు