JFS: ఐదో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా ‘జియో ఫైనాన్స్‌’.. మెక్వారీ అంచనా!

రిలయన్స్‌ నుంచి వేరై.. లిస్ట్‌ అయిన తర్వాత జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరించే అవకాశం ఉందని మెక్వారీ నివేదిక అంచనా వేసింది. 

Published : 22 Nov 2022 17:45 IST

దిల్లీ: లిస్టింగ్‌ తర్వాత ‘జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (JFS)’ ఐదో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరించనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. జేఎఫ్‌ఎస్‌ను వేరు చేసి నమోదిత సంస్థగా మారుస్తామని ఇటీవల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 

ఆర్‌ఐఎల్‌ నుంచి జేఎఫ్‌ఎస్‌కు 6.1 శాతం వాటా లభించే అవకాశం ఉందని మెక్వారీ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ లెక్కన కంపెనీ రూ.లక్ష కోట్ల విలువతో దేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా నిలుస్తుందని పేర్కొంది. మిగిలిన ఫిన్‌టెక్‌ కంపెనీలకు జేఎఫ్‌ఎస్‌ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని చెప్పింది. నిబంధనల ప్రకారం రుణాలిచ్చేందుకు కావాల్సిన మూలధనాన్ని రిలయన్స్‌ చరాస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా జేఎఫ్‌ఎస్‌ సమకూర్చుకుంటుందని అంచనా వేసింది. బీమా, చెల్లింపులు, డిజిటల్‌ బ్రోకింగ్‌, ఆస్తుల నిర్వహణ సంస్థ.. వంటి విభాగాలను మూడేళ్ల పాటు క్రమంగా ఏర్పాటు చేసుకుంటుందని తెలిపింది. అందుకు కావాల్సిన అనుమతులను పొందడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టిందని పేర్కొంది.

క్రెడిట్‌ బ్యూరో ఆధారిత రుణాలతో పాటు ప్రొప్రైటరీ డేటా అనలిటిక్స్‌ నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగానూ వ్యక్తిగత, వ్యాపార రుణాలను జేఎఫ్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు అందించనున్నట్లు మెక్వారీ నివేదిక తెలిపింది. కార్పొరేట్‌ కంపెనీలు బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించడానికి అనుమతిలేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎఫ్‌ఎస్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ పొందే అవకాశం లేదని నివేదిక గుర్తుచేసింది. అయితే, ఇప్పటికే బ్యాంకింగేత ఆర్థిక సంస్థగా లైసెన్సు పొందిన నేపథ్యంలో రుణాలిచ్చేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని