Mobile subscribers: జియోకు తగ్గారు.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు పెరిగారు..!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో భారీగా చందాదారులను కోల్పోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో కోటికి పైగా చందాదారులు కోల్పోగా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వల్పంగా తన చందాదారుల సంఖ్యను పెంచుకుంది.

Updated : 17 Feb 2022 19:30 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో భారీగా చందాదారులను కోల్పోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో కోటికి పైగా చందాదారులు కోల్పోగా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వల్పంగా తన చందాదారుల సంఖ్యను పెంచుకుంది. మరోవైపు దేశంలో కూడా మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గింది. 2021 డిసెంబర్‌ నెలలో అంతకుముందు నెలతో పోల్చినప్పుడు 1.28 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు తగ్గినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ వెల్లడించింది. ఈ మేరకు డిసెంబర్‌ నెలకు సంబంధించిన డేటాను గురువారం విడుదల చేసింది.

జియో ఒక్క డిసెంబర్‌ నెలలోనే 1.29 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయినట్లు ట్రాయ్‌ తన నివేదికలో పేర్కొంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 41.57 కోట్లకు చేరింది. వొడాఫోన్‌ సైతం 16.14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకుందని ట్రాయ్‌ తెలిపింది. కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 26.55 కోట్లకు చేరిందని వెల్లడించింది. అదే సమయంలో ఎయిర్‌టెల్‌కు 4.75 లక్షల మంది యూజర్లు పెరగడంతో కంపెనీ చందాదారుల సంఖ్య 35.57 కోట్లకు చేరింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను కొత్తగా 11 లక్షల మంది చందాదారులు ఎంపిక చేసుకున్నారని ట్రాయ్‌ పేర్కొంది.

జియో తీసుకొచ్చిన తొలి జియో ఫోన్‌తో పోలిస్తే ఇటీవల తీసుకొచ్చిన జియో నెక్ట్, గూగుల్‌తో కలిసి తీసుకొచ్చిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ ఆశించిన మేర ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో నెట్‌వర్క్‌లో చేరికలు కొత్తగా పెరగలేదు. దీనికి తోడు జియో ఫోన్‌తో గ్రామీణ ప్రాంతాలకు చేరువైన ఈ కంపెనీ.. టారిఫ్‌ల పెంపుతో కొంతమేర మార్కెట్‌ కోల్పోయినట్లు విశ్లేషణలు వినవస్తున్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయానికొస్తే.. ప్రైవేటు టెలికాం సంస్థలు టారిఫ్‌లు సవరించినా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎలాంటి ఛార్జీలూ పెంచకపోవడంతో చందాదారులను చేర్చుకోగలిగింది. ఛార్జీలు పెంచినప్పటికీ మిగిలిన కంపెనీలూ అదే బాటలో పయనించడం ఎయిర్‌టెల్‌కు కలిసొచ్చిందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని