Reliance Jio: జియో చేతికి అమెరికా కమ్యూనికేషన్ల తయారీ సంస్థ!

Jio- Mimosa deal: టెలికాం రంగంపై రిలయన్స్‌ జియో తన పెట్టుబడులను కొనసాగిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన టెలికాం ఉపకరణాల తయారీ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 09 Mar 2023 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ సేవలు, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్‌ జియో (Jio) అమెరికాకు చెందిన కమ్యూనికేషన్‌ పరికరాల తయారీ సంస్థ మిమోసా నెట్‌వర్క్‌ను (Mimosa) కొనుగోలు చేయనుంది. జియోకు చెందిన అనుబంధ సంస్థ ర్యాడీసీస్‌ కార్పొరేషన్‌, మిమోసా నెట్‌వర్క్‌ మాతృ సంస్థ ఎయిర్‌స్పాన్‌ నెట్‌వర్క్స్‌ హోల్డింగ్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

వైఫై 5, వైఫై 6E టెక్నాలజీకి సంబంధించిన పాయింట్-టు-పాయింట్, పాయింట్-టు-మల్టీ-పాయింట్ నెట్‌వర్కింగ్‌ పరికరాలను మిమోస్‌ తయారు చేస్తుంది. మరోవైపు గతేడాది భారీ మొత్తంతో 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన జియో సంస్థ.. 5జీ సేవలు, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనాకు చెందిన టెలికాం ఉపకరణాలు తయారు చేసే హువావే సంస్థను భారత్‌ సహా వివిధ దేశాలు నిషేధించిన సమయంలో ఈ డీల్‌ కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎయిర్‌స్పాన్‌ కంపెనీలో ఇప్పటికే జియోకు చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ యూఎస్‌ఏకు వాటాలు ఉన్నాయి. బోర్డులో సభ్యత్వం సైతం ఉంది. కాగా, 2023 మూడో త్రైమాసికంలో తాజా డీల్‌ పూర్తయ్యే అవకాశం ఉందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. మరోవైపు 5జీ నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా ఉపకరణాలను అందించేందుకు ఇప్పటికే నోకియాతో జియో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని