Jio Airfiber: త్వరలో దేశవ్యాప్తంగా జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు!

రిలయన్స్ జియో (Reliance Jio) మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio Airfiber) సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీని ద్వారా సాధారణ బ్రాడ్‌బ్యాండ్‌ తరహాలోనే వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను యూజర్లు పొందవచ్చు. 

Updated : 25 Apr 2023 19:42 IST

ముంబయి: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో (Reliance Jio) త్వరలో కొత్త సర్వీస్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio Airfiber) పేరుతో సరికొత్త వైఫై సర్వీస్‌ను రిలయన్స్‌ జియో తీసుకొస్తుంది. గత ఏడాది జరిగిన రిలయన్స్ ఏజీఎమ్‌ (AGM) సమావేశంలో ఈ సర్వీస్‌ గురించి చెప్పినప్పటికీ, ఎప్పుడు విడుదల చేస్తారనేది చెప్పలేదు. తాజాగా ఆర్‌ఐఎల్‌ ప్రెసిండెంట్ కిరణ్‌ థామస్‌ మాట్లాడుతూ.. మరికొద్ది నెలల్లో  జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 

ఎలా పనిచేస్తుంది..?

సాధారణంగా బ్రాండ్‌బ్యాండ్‌ సేవలు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జియో గిగా ఫైబర్‌ ఈ తరహాలోనే పనిచేస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్‌ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్‌ డివైజ్‌. దగ్గర్లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి. దీని ద్వారా సాధారణ బ్రాడ్‌బ్యాండ్‌ తరహాలోనే వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను యూజర్లు పొందవచ్చని జియో చెబుతోంది. వెయ్యి చదరపు అడుగుల దూరం వరకు యూజర్లు వైఫై సేవలు పొందవచ్చు. ఈ డివైజ్‌ను ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్‌ను యాప్‌ సాయంతో యూజర్లు నియంత్రించవచ్చు. యాప్‌ ద్వారా కొన్ని వెబ్‌సైట్‌లను కూడా యూజర్లు బ్లాక్‌ చేయొచ్చు. సాధారణ రౌటర్‌ ఏర్పాటుకు అవసరమైనట్లుగా ఎయిర్‌ఫైబర్‌ ఇన్‌స్టాలేషన్‌ కోసం సాంకేతిక నిపుణుల అవసరం ఉండదు. ప్లగ్‌ అండ్ ప్లే తరహాలో ఇది పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని