IPL Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. జియో సినిమా సరికొత్త రికార్డు..!

JioCinema: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వ్యూస్‌ పరంగా జియో సినిమా కొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఉన్న రికార్డును తిరగరాసింది.

Published : 30 May 2023 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా (Jio cinema) ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. సోమవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ (IPL Final) మ్యాచ్‌లో రికార్డు వ్యూస్‌ను నమోదు చేసుకుంది. గుజరాత్‌, చెన్నై మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను ఒకేసారి 3.2 కోట్ల మంది వీక్షించడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. జియో సినిమా పేరిట ఇప్పటి వరకు 2.57 కోట్లుగా ఉన్న తన రికార్డును తానే తిరగరాసింది.

ఫిఫా వరల్డ్‌ కప్‌ను ఉచితంగా ప్రసారం చేసిన జియో సినిమా.. ఈ సారి ఐపీఎల్‌ సీజన్‌ ప్రసారాలను కూడా ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. అన్ని టెలికాం నెట్‌వర్కుల వారికీ ఉచితంగా క్రికెట్‌ మజాను అందించడం జియో సినిమాకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సీజన్‌ ఆరంభం నుంచీ కొత్త రికార్డులను నమోదు చేస్తూ వచ్చింది. 2019 ఐపీఎల్‌ సీజన్‌లో 2.5 కోట్ల మంది ఒకేసారి మ్యాచ్‌ను వీక్షించారు. హాట్‌స్టార్‌ పేరిట చాలా కాలం పాటు ఆ రికార్డు కొనసాగింది. ఆ రికార్డును జియో సినిమా తిరగరాసింది.

తొలుత ఏప్రిల్‌ 12న రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 2.2 కోట్ల మంది వీక్షించారు. తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- చెన్నై మధ్య ఏప్రిల్‌ 17న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను 2.4 కోట్ల మంది తిలకించారు. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌- ముంబయి మధ్య జరిగిన క్వాలిఫైయర్‌- 2 మ్యాచ్‌ను గరిష్ఠంగా 2.57 కోట్ల మంది వీక్షించడంతో హాట్‌ స్టార్‌ రికార్డును జియో బ్రేక్‌ చేసింది. తాజాగా సోమవారం ఉత్కంఠగా సాగిన గుజరాత్‌- చెన్నై మ్యాచ్‌ను ఓ దశలో 3.25 కోట్ల మంది వీక్షించారు. ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడినప్పటికీ.. ఈ స్థాయిలో వ్యూస్‌ దక్కాయి. ఇతర మ్యాచ్‌లతో పోలిస్తే చెన్నై ఆడిన మ్యాచ్‌ల పట్ల ఎక్కువ ఆసక్తి కనబరచడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని