JioCinema: జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ షురూ..!

JioCinema subscription: జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌ను రిలయన్స్‌ ప్రారంభించింది. ఇకపై హాలీవుడ్‌ కంటెంట్‌ చూడాలంటే రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. 

Updated : 13 May 2023 20:19 IST

దిల్లీ: రిలయన్స్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా (JioCinema) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ ఉచితంగా కంటెంట్‌ను అందించిన ఆ సంస్థ ఇకపై యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది. ఇందుకోసం కొత్తగా ఏడాది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.999గా నిర్ణయించింది. హెచ్‌బీఓ, వార్నర్‌ బ్రదర్స్‌ కంటెంట్‌ను ఇకపై జియో సినిమాలో వీక్షించొచ్చు.

12 నెలల పాటు ఉండే ఈ ప్లాన్‌ కింద ఒకేసారి నాలుగు డివైజుల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చని జియో సినిమా చెబుతోంది. ప్రస్తుతానికి వార్షిక ప్లాన్‌ను మాత్రమే జియో తీసుకొచ్చింది. జియో సినిమా వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో సబ్‌స్క్రైబ్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయడం ద్వారా ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. హెచ్‌బీఓ అందించే ‘ద లాస్ట్‌ ఆఫ్‌ అజ్‌’, ‘హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’, ‘వైట్‌ లోటస్‌’ వంటి కంటెంట్‌ను వీక్షించొచ్చు. బాలీవుడ్‌ కంటెంట్‌తో పాటు ఐపీఎల్‌ ప్రసారాలను మాత్రం ఎప్పటిలానే ఉచితంగా వీక్షించొచ్చు.

జియో సినిమా వేదికగా తొలుత ఫిఫా వరల్డ్‌ కప్‌ను ఉచితంగా ప్రసారం చేసిన రిలయన్స్‌.. తర్వాత ఐపీఎల్‌ ప్రసారాలను సైతం అందరికీ ఉచితంగా అందించింది. అదే సమయంలో కొత్తగా కంటెంట్‌ను యాడ్‌ చేసి రుసుములు వసూలు చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా హెచ్‌బీఓ, మ్యాక్స్‌ ఒరిజినల్‌, వార్నర్‌ బ్రదర్స్‌ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేసుకునేందుకు వార్నర్‌ బ్రదర్స్‌తో ఒప్పందం చేసుకుంది. తాజాగా అందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలవారీ ప్లాన్లు కూడా తీసుకొస్తారా? అనేది తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు