Jio Fiber: కొత్త పోస్ట్‌పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు జియో ఫైబర్‌ బంపరాఫర్‌!

జియోఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో వినియోగదారులను ఆకర్షించే దిశగా జియో కీలక నిర్ణయం తీసుకుంది...

Updated : 20 Apr 2022 14:16 IST

దిల్లీ: జియోఫైబర్‌ (Jio Fiber) పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో వినియోగదారులను ఆకర్షించే దిశగా జియో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవేశ రుసుము (entry fee)తో పాటు ఇన్‌స్టలేషన్‌ ఛార్జీల (installation charges)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ విభాగంలో కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టింది. 

కొత్తగా జియోఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ (Postpaid) సేవల్ని ఎంపిక చేసుకునేవారికి రూ.10వేలు విలువ చేసే ఇంటర్నెట్‌ బాక్స్‌ (Gateway Router), సెటాప్‌ బాక్స్‌.. వీటి ఇన్‌స్టలేషన్‌ను ఉచితంగా అందించనున్నామని జియో మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. 

చందాదారుల (Subscribers)కు నెలకు రూ.399, రూ.699 ప్రత్యేక ఇంటర్నెట్‌ పథకాలను ప్రవేశపెట్టింది. వీటితో పాటు రూ.100 అదనంగా చెల్లించి ఆరు ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌లు, రూ.200 చెల్లించి 14 అదనపు ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌లకు అనుమతి పొందవచ్చని పేర్కొంది. అలాగే మూడు నెలలకొకసారి కాకుండా ప్రతినెలా పోస్ట్‌పెయిడ్‌ బిల్లు చెల్లించే అవకాశాన్నీ కల్పించింది.

ట్రాయ్‌ గణాంకాల ప్రకారం.. ఫిక్స్‌డ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల విభాగంలో కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో జియో ముందుంది. వినియోగదారుల సంఖ్యాపరంగా దాదాపు 20 ఏళ్లుగా ఈ రంగంలో అగ్రస్థానంలో కొనసాగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)ను వెనక్కి నెట్టి గత నవంబరులో జియో తొలిస్థానానికి చేరింది. సేవలు ప్రారంభించిన రెండేళ్లలోనే ఈ ఘనతను సాధించింది.


జియోకు తగ్గిన మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు

ఫిబ్రవరిలో టెలికాం సేవల చందాదారుల సంఖ్య 116.6 కోట్లకు తగ్గింది. రిలయన్స్ జియో (Reliance Jio), వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) సబ్‌స్క్రైబర్లు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. ఒక్క భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) మాత్రమే కొత్త వినియోగదారులను ఆకర్షించగలిగినట్లు మంగళవారం సాయంత్రం విడుదలైన ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయి.

జనవరిలో 116.94 కోట్లుగా ఉన్న మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి ముగిసే నాటికి 116.60 కోట్లకు తగ్గింది. ఒక్క నెలలో 0.29 శాతం క్షీణత నమోదైంది. జియో ఫిబ్రవరిలో 36.6 లక్షల చందాదారులను కోల్పోయింది. జియోకు ఇలా కస్టమర్లు తగ్గడం వరుసగా ఇది మూడో నెల. ప్రస్తుతం ఈ కంపెనీకి 40.27 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

వొడాఫోన్‌ ఐడియా సైతం ఫిబ్రవరిలో తన కస్టమర్లను కోల్పోయింది. 15.32 లక్షల సబ్‌స్క్రైబర్లు తగ్గారు. బీఎస్‌ఎన్‌ఎల్ 1.11 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌ 5,097 మంది కస్టమర్లను కోల్పోయింది. ఒక్క భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రమే కొత్తగా 15.91 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను ఆకర్షించగలిగింది.

ఫిక్స్‌డ్‌లైన్‌ విభాగంలో మొత్తం చందాదారుల సంఖ్య ఫిబ్రవరిలో 2.45 కోట్లకు పెరిగింది. ఇందులో కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవడంలో జియో తొలిస్థానంలో నిలవగా.. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, క్వాడ్రంట్‌, టాటా టెలీసర్వీసెస్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని