Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌

Jaguar Land Rover: జాగ్వార్‌, రేంజ్‌ రోవర్‌, డిస్కవరీ, డిఫెండర్‌ బ్రాండ్లకు భారత్‌లో ప్రత్యేక విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ ప్రతినిధి వెల్లడించారు.

Published : 01 Oct 2023 15:07 IST

దిల్లీ: టాటా మోటార్స్‌ యాజమాన్యంలోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (Jaguar Land Rover- JLR) 2030 నాటికి ఎనిమిది బ్యాటరీ ఆధారిత విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తామని ప్రకటించింది. ప్రస్తుతం జేఎల్‌ఆర్‌ (Jaguar Land Rover).. జాగ్వార్‌ ఐ-పేస్‌ అనే ఈవీని మాత్రమే భారత్‌లో విక్రయిస్తోంది. అలాగే రేంజ్‌రోవర్‌ విద్యుత్‌ వాహనానికి వచ్చే ఏడాది నుంచి ఆర్డర్లు తీసుకుంటామని తెలిపింది. 2025లో వినియోగదారులకు అందిస్తామని కంపెనీ ‘చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌’ లెన్నార్డ్‌ హూర్నిక్‌ తెలిపారు.

తమకు భారత్‌ వ్యూహాత్మకంగా అతిపెద్ద మార్కెట్‌ అని హూర్నిక్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఈవీల దిశగా సాగుతున్న పరివర్తనం సరై దిశలో పయనిస్తోందన్నారు. తొలి దశలో రాయితీలు, ఛార్జింగ్‌ వసతులపై సరిపడా పెట్టుబడులతో పాటు గొప్ప ఈవీల వల్లే దేశంలో విద్యుత్‌ వాహనాల కొనుగోలు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎలక్ట్రిక్‌ కార్లపై రాయితీలు ఇస్తున్నాయని తెలిపారు. విద్యుత్‌ వాహనాల్లో బ్యాటరీల ఖరీదు ఎక్కువని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విక్రయాలు ఓ దశకు చేరే వరకు వాహనాల ధరలు పై స్థాయిలోనే ఉంటాయని వివరించారు.

భారత్‌లో బలంగా ఉన్న రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌, డిఫెండర్‌ బ్రాండ్లను మరింత విస్తరించాలనుకుంటున్నట్లు హూర్నిక్‌ తెలిపారు. వీటిలోనే కొన్ని కొత్త మోడళ్లను తీసుకొస్తామని వెల్లడించారు. మరికొన్నింటిలో ప్రత్యేక ఎడిషన్లను తీసుకొస్తామన్నారు. అలాగే వీటిలోనూ విద్యుత్‌ వెర్షన్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తమ జాగ్వార్‌, రేంజ్‌ రోవర్‌, డిస్కవరీ, డిఫెండర్‌ బ్రాండ్లకు ప్రత్యేక విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లాంటి విస్తృత వైవిధ్యం ఉన్న మార్కెట్‌లో అది చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో కంపెనీ విక్రయాల్లో 100 శాతం వృద్ధి నమోదైనట్లు హూర్నిక్‌ వెల్లడించారు. మిగిలిన త్రైమాసికాల్లోనూ అదే జోరు కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డర్‌ బుక్‌లో సైతం 50 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని