Layoffs: కొనసాగుతున్న తొలగింపుల పర్వం.. ఈసారి ఐబీఎం, ఎస్‌ఏపీ

Layoffs: ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో టెక్‌ కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Published : 26 Jan 2023 17:40 IST

న్యూయార్క్‌: ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రఖ్యాత టెక్‌ కంపెనీలు ఐబీఎం (IBM), జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఎస్‌ఏపీ (SAP) సైతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఐబీఎం 3,900 మందిని ఇంటికి పంపనుండగా.. ఎస్‌ఏపీ 3,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది.

అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లక్ష్యాలను అందుకోలేకపోయామని ఐబీఎం (IBM) తెలిపింది. ఆదాయాలు పడిపోయినట్లు పేర్కొంది. మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణలు కూడా కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వ్యయాలను నియంత్రించడం కోసం తొలగింపులు తప్పడం లేదని వెల్లడించింది. అయినప్పటికీ.. కొన్ని ముఖ్యమైన విభాగాల్లో నియామకాలు కూడా కొనసాగుతాయని తెలిపింది. 2022లో కంపెనీ 10 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ, అది 9.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. నిర్వహణ మూలధన వ్యయాలు అంచనాలను మించడమే ఆదాయం తగ్గడానికి కారణమని ఐబీఎం తెలిపింది.

మరోవైపు తమ కీలక వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులను పునర్‌వ్యవస్థీకరిస్తున్నామని ఎస్‌ఏపీ (SAP) తెలిపింది. ఈ క్రమంలోనే కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని వెల్లడించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.5 శాతానికి సమానమైన సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 1,20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని