Google Layoffs: దారుణ పరిస్థితులను నివారించడానికే ఆ నిర్ణయం: పిచాయ్‌

Google Layoffs: గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఇటీవల 12000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. అక్కడికి దారితీసిన పరిస్థితులను తాజాగా సీఈఓ పిచాయ్‌ ఉద్యోగులతో పంచుకున్నారు.

Published : 24 Jan 2023 13:42 IST

వాషింగ్టన్‌: కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు (Layoffs) విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని గూగుల్‌ (Google) సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) అన్నారు. ఈ విషయంలో ‘‘స్పష్టమైన, కచ్చితమైన, ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారి ఉండేది’’ అని ఆయన అన్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఉద్యోగులతో సోమవారం నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది.

కేవలం ఉద్యోగుల తొలగింపుల (Layoffs)తో ఈ ప్రక్రియ ఆగిపోదని కూడా పిచాయ్‌ (Sundar Pichai) తాజా సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. బోనస్‌లు కంపెనీ వృద్ధికి అనుసంధానించిన విషయాన్ని ఆయన (Sundar Pichai) గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతాయుత నాయకత్వ హోదాల్లో ఉన్న అందరికీ ఈ ఏడాది బోనస్‌లు తగ్గుతాయని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేసి తాజాగా ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు మరో ఉన్నతోద్యోగి పేర్కొన్నారు.

ప్రాధాన్య అంశాల్లో పెట్టుబడులను కొనసాగించి.. కంపెనీ భవిష్యత్‌ను పరిరక్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్‌ (Google) మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రుత్‌ పోరట్‌ అన్నారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా, స్పష్టంగా వ్యవహరిస్తేనే దీర్ఘకాల పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఏర్పడుతుందని తాము భావించినట్లు అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం గూగుల్‌ (Google) వెల్లడించింది. కొవిడ్‌-19 పరిణామాల సమయంలో, అప్పటి అవసరాలకు తగ్గట్లుగా అధిక నియామకాలు చేపట్టామని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చెప్పింది. ‘కఠిన సమీక్ష అనంతరమే ఉద్యోగుల తొలగింపు (Layoffs)ను ప్రకటిస్తున్నాం. ఆల్ఫాబెట్‌, ఉత్పత్తులు విభాగాలు, కార్యకలాపాలు, స్థాయిలు, ప్రాంతాల వ్యాప్తంగా ఈ ఉద్యోగాల కోత ఉంటుంది. అసాధారణ నైపుణ్యమున్న ఉద్యోగులకూ వీడ్కోలు చెప్పాల్సి వస్తోంది. దీనిపై నేను క్షమాపణలు చెబుతున్నాను. ఈ నిర్ణయం వారి జీవితాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందనే విషయం నాకు ఆందోళన కలిగిస్తోంద’ని సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు