Pension: పెన్ష‌న్ కోసం జాయింట్ బ్యాంక్ ఖాతా త‌ప్ప‌నిసరికాదు

జీవిత భాగస్వామి పింఛను (స్పౌస్‌ పెన్షన్‌)కి సంయుక్త ఖాతా తప్పనిసరి కాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

Updated : 22 Nov 2021 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  జీవిత భాగస్వామి పింఛను (స్పౌస్‌ పెన్షన్‌)కి సంయుక్త ఖాతా తప్పనిసరి కాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ప్రధాని మోదీ అన్ని వర్గాల జీవనాన్ని సులభతరం చేయాలని సంకల్పించారని, అందులో భాగంగానే సంయుక్త ఖాతా తప్పనిసరి కాదన్న నిబంధన తెచ్చారని పేర్కొన్నారు. వీలు కాని పరిస్థితుల్లో వారు తమ జీవిత భాగస్వాములతో సంయుక్త ఖాతా తెరవడం సాధ్యం కాదని హెడ్‌ ఆఫీస్‌ అధికారులు సంతృప్తి చెందితే ఈ సంయుక్త ఖాతా నిబంధనను సడలించవచ్చని తెలిపారు. ఇప్పటికే మనుగడలో ఉన్న జాయింట్‌ అకౌంట్‌లో కుటుంబ పింఛను క్రెడిట్‌ చేయాలని పింఛనుదారు కోరితే అందులోనే జమ చేయాలని కేంద్రం ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసిందని.. కొత్త జాయింట్‌ అకౌంట్‌ తెరవాలని వారిపై ఒత్తిడి చేయొద్దని నిర్దేశించిందని కేంద్రమంత్రి చెప్పారు. అయితే పింఛనుదారులు జీవితభాగస్వామితో కలిసి సంయుక్త ఖాతా తెరవడం వాంఛనీయమని, ఎవరి పేరుతో ఆథరైజేషన్‌ ఇచ్చారో వారితో కలిసి కుటుంబ పింఛను కోసం ఖాతా తెరవడం మంచిదని సూచించారు. ఏదిఏమైనా జీవిత భాగస్వామితో జాయింట్ బ్యాంక్ ఖాతా ఉండడం మంచిది, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ)లో తెలిపిన ఫామిలీ పెన్షనర్‌తో దీన్ని తెరవాలి. ఖాతాను పెన్ష‌న‌ర్ కోరుకున్న‌ట్లు ‘ఫార్మర్ లేదా సర్వైవర్’ లేదా ‘సాధార‌ణ లేదా స‌ర్వైవ‌ర్‌’ ప్రాతిప‌దిక‌న నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఫార్మర్ లేదా సర్వైవర్ (Former or Survivor): ఇందులో మొదటి ఖాతాదారుడు మాత్రమే ఖాతాను నిర్వ‌హించ‌గ‌ల‌డు. రెండో ఖాతాదారుడు.. మొదటి ఖాతాదారుడి మరణంపై మాత్రమే హక్కును పొందుతారు. అందుకోసం అతడు లేదా ఆమె మరణించిన వారి డెత్ సర్టిఫికెట్ (మ‌ర‌ణ ధ్రువీకరణ పత్రాన్ని) స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

సాధారణ లేదా సర్వైవర్ (Either or Survivor): సాధార‌ణ ఉమ్మడి ఖతా మాదిరిగా ఇద్దరు ఖాతాదారుల‌లో ఎవ‌రైనా ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు. ఒక‌వేళ ఒక ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే, జీవించి ఉన్న వ్య‌క్తి ఖాతాను ఆప‌రేట్ చేయవచ్చు.

జాయింట్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండడం వెనుక ఉద్దేశం.. కుటుంబ పింఛను ఎటువంటి ఆలస్యం లేకుండా పొందడంతో పాటు కుటుంబ  పింఛనుదారు కొత్త ఖాతా తెరిచేందుకు ఇబ్బందులు ప‌డ‌కుండా చూసుకోవడం.. కుటుంబ పింఛను ప్రారంభానికి దరఖాస్తు చేసేటప్పుడు కుటుంబ పెన్షనర్‌కు కనీస పత్రాలు ఉండాలని ప్ర‌భుత్వం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని