JP Morgan: భారత బాండ్లలోకి రానున్న రూ.లక్షల కోట్లు.. కీలక సూచీలో చోటుతో మార్గం సుగమం!

Emerging Markets Bond Index: భారత బాండ్లపై అంతర్జాతీయంగా ఆదరణ పెరగనుంది. జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్ మార్కెట్స్‌ బాండ్‌ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లకు చోటు దక్కనుంది. దీంతో బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కు రానున్నాయి.

Published : 22 Sep 2023 11:34 IST

Emerging Markets Bond Index | దిల్లీ: జేపీ మోర్గాన్‌ కీలక సూచీల్లో ఒకటైన ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ (Emerging Markets Bond Index)లో భారత ప్రభుత్వ బాండ్లు చేరనున్నాయి. ఫలితంగా భారత బాండ్ మార్కెట్‌లోకి బిలియన్ డాలర్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. 2024 జూన్‌ 28 నుంచి ఈ ఇండెక్స్‌లో భారత్‌ కనిపించనుంది. దాదాపు 10 శాతం వెయిటేజీ ఉండొచ్చని సమాచారం.

ఆర్థిక వృద్ధికి నిదర్శనం..

భారత ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో విదేశీ మదుపర్లు, కంపెనీలు మన దేశంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తాజా జేపీ మోర్గాన్‌ నిర్ణయమే ఒక నిదర్శనం. భౌగోళిక రాజకీయాల్లో, వివిధ కీలక అంతర్జాతీయ వేదికలపైనా భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు భారత్‌ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలన్నీ భారత్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు భారత బాండ్‌ మార్కెట్‌లో విదేశీ మదుపర్ల వాటా చాలా పరిమితంగా ఉంటూ వచ్చింది. గత కొన్నేళ్లుగా మాత్రం క్రమంగా పుంజుకుంటోంది. కరోనా, ఆ తర్వాత పరిణామాల నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడమే దీనికి ఓ కారణం. పైగా ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది.

బిలియన్ల డాలర్ల పెట్టుబడులు..

జేపీ మోర్గాన్‌ తాజా నిర్ణయం వల్ల 2025 మార్చి నాటికి 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది భారత బాండ్లలోకి విదేశీ మదుపర్లు 3.5 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఈక్విటీ మార్కెట్లలో ఇప్పటికే విదేశీయులు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే భారత్‌ ఆర్థికంగా పటిష్ఠంగా ఉండడమే ఇందుకు కారణం. ద్రవ్యోల్బణం కూడా క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత బాండ్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మెరుగుపడుతున్న అవకాశాలు..

అంతర్జాతీయ సూచీల్లో భారత్‌ చేరికకు ఇటీవల అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇండెక్స్‌ జారీ సంస్థలు తమ సూచీలను విస్తరించాలనుకోవడం దీనికి ఒక కారణం. అలాగే ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను అనేక సూచీల నుంచి పక్కన పెట్టారు. మరోవైపు కఠిన ఆంక్షలు, వివిధ దేశాలతో వివాదాలు, ఆర్థిక ఒడుదొడుకుల నేపథ్యంలో చైనా ఆకర్షణ కోల్పోయింది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందున్న భారత్‌కు అవకాశాలు మెరుగుపడ్డాయి. తాజా జేపీ మోర్గాన్‌ నిర్ణయంతో దాదాపు 330 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 23 బాండ్లు ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ (Emerging Markets Bond Index)లో చోటు దక్కించుకోనున్నాయి. ఈ చర్యను ముందుగానే పసిగట్టిన విదేశీ మదుపర్లు ఆయా బాండ్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు. 2022 చివరి నాటికి 7.4 బిలియన్ డాలర్లుగా ఉన్న వారి పెట్టుబడుల విలువ ప్రస్తుతం 12 బిలియన్‌ డాలర్లకు చేరడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని