JSPL: రూ.7,930 కోట్లతో 8 రకాల స్టీల్‌ తయారీ: జిందాల్‌ స్టీల్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు స్టీల్‌ కంపెనీలను పీఎల్‌ఐ పథకం కింద ఎంపిక చేసింది. జిందాల్‌ స్టీల్‌ సైతం అందులో ఉంది.

Published : 18 Dec 2022 14:18 IST

దిల్లీ: అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఎనిమిది రకాల ఉక్కు తయారీకి రూ.7,930 కోట్లు వెచ్చించనున్నట్లు ‘జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (JSPL)’ డైరెక్టర్‌ విమలేంద్ర ఝా వెల్లడించారు. ఈ కంపెనీని కేంద్ర ప్రభుత్వం ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (PLI)’ కింద ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రూ.42,500 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఉన్న 67 కంపెనీలను సర్కార్‌ ఇటీవల పీఎల్‌ఐ (PLI) కింద ఎంపిక చేసింది. ఇది 70,000 ఉద్యోగాల కల్పనకు దోహదం చేయనుంది. అలాగే 26 మిలియన్‌ టన్నుల ప్రత్యేక స్టీల్‌ (specialty steel) తయారీ సామర్థ్యాన్ని కంపెనీలు జత చేసుకోనున్నాయి.

హెచ్‌ఆర్‌ కాయిల్‌, షీట్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పరిశ్రమలో ఉపయోగించే ఏపీఐ జీఆర్‌ ప్లేట్లను పీఎల్‌ఐ (PLI) కింద ఉత్పత్తి చేయనున్నట్లు విమలేంద్ర తెలిపారు. నిర్మాణాలు, వాహన పరిశ్రమలో వినియోగించే పటిష్ఠ షీట్లను కూడా తయారు చేస్తామన్నారు. దేశీయంగా ప్రత్యేక స్టీల్‌ (specialty steel) తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్‌ గత ఏడాది జులైలో రూ.6,322 కోట్లతో కూడిన పీఎల్‌ఐ (PLI) పథకానికి ఆమోదం తెలిపింది.

ఈ పథకం కింద తాజాగా ఎంపికైన టాటా స్టీల్‌ (TATA Steel) సైతం ఏడు రకాలు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఆరు రకాలు, ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ నాలుగు రకాలు, ప్రభుత్వ రంగ ‘స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (SAIL) రెండు రకాల ప్రత్యేక ఉక్కు (specialty steel)ను తయారు చేస్తామని దరఖాస్తు చేసుకున్నాయి. ఇవన్నీ తమ తమ ప్రణాళికల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని