JSW Group: విద్యుత్తు వాహన తయారీలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌!

విద్యుత్తు వాహన రంగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంలోకి ప్రవేశించాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ యోచిస్తోంది.

Published : 01 Jan 2023 15:51 IST

దిల్లీ: సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ విద్యుత్తు వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతోందా? అంటే కంపెనీ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోంది. గతంలోనూ దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు సంస్థకు చెందిన ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. అయితే, ప్రస్తుతం అవకాశాలు ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో తిరిగి వాటికి పదునుపెడుతున్నట్లు తెలిపారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను ఇతర రంగాల్లోకీ విస్తరించాలని కంపెనీ యాజమాన్యం ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తోంది. విద్యుత్తు వాహన రంగానికి భవిష్యత్తులో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కంపెనీ సీఎఫ్‌ఓ శేషగిరి రావు తెలిపారు. దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత ‘ఫోర్‌వీలర్‌’ తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా తయారీ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పాలనే అంశాన్ని నిర్ణయించలేదని తెలిపారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తమిళనాడులోని సాలెంలో ఏటా 10 లక్షల టన్నుల స్టీల్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ వాహనాల్లో ఉపయోగించే స్టీల్‌ గ్రేడ్‌ను ఉత్పత్తి చేస్తోంది. విద్యుత్తు సహా ఇతర వాహన తయారీ సంస్థలకు దీన్ని సరఫరా చేస్తోంది. మరోవైపు ఇంధనం, మౌలిక, సిమెంట్‌, పెయింట్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌, క్రీడా రంగాల్లోనూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని