JSW Infra IPO: 25న జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా ఐపీఓ.. ధరల శ్రేణి రూ.113- 119

JSW Infra IPO: జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా ఐపీఓలో పూర్తిగా తాజా షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను ఉంచడం లేదు.

Published : 19 Sep 2023 01:41 IST

దిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (JSW Infra IPO) సెప్టెంబర్‌ 25న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 27 వరకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.113- 119గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.2,800 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మదుపర్లు కనీసం 126 ఈక్విటీ షేర్ల (ఒక లాట్‌)కు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం రూ.14,994 పెట్టుబడిగా పెట్టాలి. ఈ షేర్లు 2023 అక్టోబర్‌ 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచీల్లో లిస్టవుతాయి.

ఈ ఐపీఓ (JSW Infra IPO)లో పూర్తిగా తాజా షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను ఉంచడం లేదు. ఈ ఇష్యూ (JSW Infra IPO) ద్వారా సమీకరించిన నిధుల్లో నుంచి రూ.880 కోట్లను రుణాలు చెల్లించేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరో రూ.865 కోట్లు ఎల్‌పీజీ టెర్మినల్‌ ప్రాజెక్ట్‌కు కావాల్సిన మూలధన వ్యయానికి వాడుకోనున్నట్లు వెల్లడించింది. రూ.59.4 కోట్లు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు, రూ.103.88 కోట్లు ‘డ్రెడ్జర్‌’ కొనుగోలు, దాని స్థాపనకు, రూ.151 కోట్లు మంగళూరు కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణకు ఉపయోగించనున్నట్లు తెలిపింది.

జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా (JSW Infra IPO).. నౌకాశ్రయ ఆధారిత మౌలిక వసతుల కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. కార్గో, స్టోరేజ్‌, లాజిస్టిక్స్‌ వంటి సేవలను అందిస్తుంది. 2023 జూన్‌ 30 నాటికి కంపెనీకి 158.43 మిలియన్‌ టన్నుల కార్గోను నిర్వహించే వార్షిక సామర్థ్యం ఉంది. 2023 మార్చి 31 నాటికి కంపెనీ ఆస్తుల విలువ రూ.9,450 కోట్లు. ఆదాయం రూ.3,372 కోట్లు, పన్నేతర లాభం రూ.749.51 కోట్లుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని