పాత కారు తుక్కుకు వేస్తే కొత్త కారుపై రిబేట్‌

పాత వాహనాలను తుక్కు కింద మార్చాలనుకునేవారికి శుభవార్త. నూతన తుక్కు విధానం కింద వాహనాలను ఇచ్చే వారికి కొత్త కారు కొనుగోలు సమయంలో...

Published : 07 Mar 2021 22:05 IST

దిల్లీ: పాత వాహనాలను తుక్కు కింద మార్చాలనుకునేవారికి శుభవార్త. నూతన తుక్కు విధానం కింద వాహనాలను ఇచ్చే వారికి కొత్త కారు కొనుగోలు సమయంలో ఐదు శాతం రిబేట్‌ లభిస్తుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. రిబేట్‌తో పాటు హరిత పన్ను, పాత కాలుష్య వాహనాలకు ఇతర సుంకాలు వంటి అంశాలు ఈ విధానంలో పొందుపరిచామన్నారు. ఫిట్‌నెస్‌ పరీక్షలకైనా, పొల్యూషన్‌ టెస్టులకైనా ఆటోమేటిక్‌ ఫిట్‌నెస్‌ కేంద్రాలు అవసరమని, దేశవ్యాప్తంగా వీటి ఏర్పాటు చేసే విషయమై పనిచేస్తున్నామని గడ్కరీ తెలిపారు. పీపీపీ విధానంలో ఈ కేంద్రాలు  ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. తుక్కు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రైవేటు వ్యక్తులకు, రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం సాయపడుతుందని చెప్పారు.

ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రాల్లో సదరు వాహనం ఫెయిలైతే భారీ జరిమానాలు ఉంటాయని గడ్కరీ చెప్పారు. ఈ కొత్త విధానం ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఓ వరం కానుందని తెలిపారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం 4.5 లక్షలుగా ఉన్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ టర్నోవర్‌ రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. అలాగే దేశం ఆటోమొబైల్‌ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. తుక్కువల్ల వచ్చే స్టీల్‌, ప్లాస్టిక్‌, రబ్బర్‌, అల్యూమినియం వల్ల ఆటోమొబైల్‌ కొత్త పార్టుల తయారీలో వాటి ధరలు 30 నుంచి 40 శాతం తగ్గుతాయయని చెప్పారు. సుమారు కోటి కాలుష్యకారక వాహనాలు తుక్కు కిందకు వెళ్తాయని అంచనా వేశారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని 20 ఏళ్లు నిండిన వ్యక్తిగత వాహనాలకు, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాల కోసం స్వచ్ఛంద తుక్కు విధానాన్ని కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని