Jupiter Life Line IPO: ఐపీఓకి జుపిటర్‌ హాస్పిటల్‌ దరఖాస్తు

Jupiter Life Line IPO: ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను రుణ భారాన్ని తగ్గించుకోవడానికి జుపిటర్‌ లైఫ్‌లైన్‌ వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడుకోనుంది.

Published : 12 May 2023 16:58 IST

దిల్లీ: మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ చైన్‌ జుపిటర్‌ లైఫ్‌ లైన్‌ హాస్పిటల్స్‌ ఐపీఓ (Jupiter Life Line IPO)కి సిద్ధమవుతోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ శుక్రవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. కొత్తగా రూ.615 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే రూ.44.5 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనుంది.

ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను రుణ భారాన్ని తగ్గించుకోవడానికి జుపిటర్‌ లైఫ్‌లైన్‌ వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడుకోనుంది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ఆప్షన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. అదే జరిగితే ఐపీఓ పరిమాణం రూ.123 కోట్ల మేర తగ్గనుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎడెల్‌విస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

జుపిటర్‌ లైఫ్‌లైన్‌ ‘జుపిటర్‌’ పేరిట ఠాణె, పుణె, ఇండోర్‌లో హాస్పిటల్‌లు నిర్వహిస్తోంది. 2022 డిసెంబరు నాటికి 1,194 పడకల సామర్థ్యం ఉంది. తాజాగా 500 పడకల సామర్థ్యంతో మహారాష్ట్రలోని డొంబివిలీలో మరో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించాలని యోచిస్తోంది. 2020- 21లో ఈ సంస్థ నష్టాలు నమోదు చేసింది. 2021- 22 నాటికి రూ.51.13 కోట్ల లాభాల్లోకి ఎగబాకింది. ఆదాయం 51 శాతం పెరిగి రూ.733.12 కోట్లకు చేరింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో సంస్థ పన్నేతర లాభం రూ.57.15 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.650.24 కోట్లకు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని