Jupiter Hospital Listing: జుపిటర్‌ హాస్పిటల్స్‌ లాభాల లిస్టింగ్‌.. ఒక్కో లాట్‌పై రూ.4,500 లాభం

Jupiter Hospital Listing: జుపిటర్‌ హాస్పిటల్స్‌ షేరు ఈరోజు బీఎస్‌ఈలో 30.61 శాతం లాభంతో రూ.960 దగ్గర, నిఫ్టీలో 32.38 శాతం ప్రీమియంతో రూ.973 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది.

Updated : 18 Sep 2023 12:08 IST

ముంబయి: మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్వహణ సంస్థ జుపిటర్‌ లైఫ్‌లైన్‌ హాస్పిటల్స్ షేర్లు ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి (Jupiter Hospital Listing). ఒక్కో షేరు దాదాపు 32 శాతం లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించడం విశేషం. రూ.735 గరిష్ఠ ధర వద్ద ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు బీఎస్‌ఈలో ఈ షేరు 30.61 శాతం లాభంతో రూ.960 దగ్గర, నిఫ్టీలో 32.38 శాతం ప్రీమియంతో రూ.973 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6,714.62 కోట్లుగా నమోదైంది.

జుపిటర్‌ లైఫ్‌లైన్‌ హాస్పిటల్స్ ఐపీఓ ఈ నెల 6-8 తేదీల మధ్య జరిగింది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.695- 735గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.869 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓలో కనీసం 20 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలని నిబంధన విధించారు. దీంతో ఐపీఓలో పాల్గొన్నవారు కనీసం రూ.14,700 పెట్టుబడిగా పెట్టారు. పబ్లిక్‌ ఇష్యూలో షేర్లు పొందినవారి పెట్టుబడి లిస్టింగ్‌లో రూ.19,200కు చేరింది. ఈ లెక్కన ఒక్కో లాట్‌పై మదుపర్లు కనీసం రూ.4,500 లాభం పొందారు. తర్వాత ట్రేడింగ్‌లో ఈ షేరు విలువ మరింత పెరిగింది. ఉదయం 11:34 గంటల సమయంలో షేరు విలువ 45 శాతం పెరిగి రూ.1,066కు చేరింది. ఇంట్రాడేలో రూ.1,108 దగ్గర గరిష్ఠాన్ని నమోదు చేసింది.

ఈ ఐపీఓ (Jupiter Hospital IPO)లో జుపిటర్‌ హాస్పిటల్స్‌ రూ.542 కోట్ల విలువ చేసే తాజా షేర్లను జారీ చేసింది. మరో 44.5 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ గ్రూప్‌ సంస్థలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఐపీఓ (Jupiter Hospital IPO)లో ఉంచాయి. ఈ పబ్లిక్‌ ఇష్యూ (Jupiter Hospital IPO) ద్వారా సమీకరించిన నిధులను రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని జుపిటర్‌ లైఫ్‌లైన్‌ హాస్పిటల్స్ తెలిపింది. జుపిటర్‌ లైఫ్‌లైన్‌ ‘జుపిటర్‌’ పేరిట ఠాణె, పుణె, ఇందౌర్‌లో హాస్పిటల్‌లు నిర్వహిస్తోంది. 2022 డిసెంబరు నాటికి 1,194 పడకల సామర్థ్యం ఉంది. తాజాగా 500 పడకల సామర్థ్యంతో మహారాష్ట్రలోని డొంబివిలీలో మరో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తోంది. ఏప్రిల్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 2020- 21లో ఈ సంస్థ నష్టాలు నమోదు చేసింది. 2021- 22 నాటికి రూ.51.13 కోట్ల లాభాల్లోకి ఎగబాకింది. ఆదాయం 51 శాతం పెరిగి రూ.733.12 కోట్లకు చేరింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో పన్నుల తర్వాత లాభం రూ.57.15 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.650.24 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని