Published : 08 Dec 2021 01:52 IST

Bitcoin: అందరినీ ఉత్కంఠ పెట్టిన ఉదంతమిది!

బిట్‌కాయిన్‌ సృష్టికర్త మిస్టరీపై ఏం తేలిందంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ఒకటి ఒమిక్రాన్‌ అయితే.. మరొకటి క్రిప్టోకరెన్సీ. ఈ డిజిటల్‌ కరెన్సీపై గత కొంత కాలంగా విస్తృత చర్చ జరుగుతోంది. నిషేధం.. నియంత్రణ.. పెట్టుబడులు.. ఇలా రోజూ ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో గత 10 రోజులుగా సాగుతున్న ఓ కేసు విచారణ అందరిలో ఆసక్తి రేకెత్తించింది. దీంట్లో వెలువడే తీర్పుతో బిట్‌కాయిన్‌ సృష్టికర్త సతోషి నకమోటో ఎవరో తేలిపోతుందని అంతా భావించారు. కానీ, అది ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది..!

ఇంతకీ ఆ కేసేంటి?

ఆస్ట్రేలియాకు చెందిన క్రేగ్‌ రైట్‌ అనే కంప్యూటర్‌ శాస్త్రవేత్త బిట్‌కాయిన్‌ సృష్టికర్తను తానే అని 2016లో ప్రకటించుకున్నారు. అంటే తానే సతోషి నకమోటోనని తెలిపారు. క్రేగ్‌ తన మిత్రుడు డెవిడ్‌ క్లేమన్‌తో కలిసి డబ్ల్యూఅండ్‌కే అనే సంస్థను నిర్వహిస్తుండేవారు. 2013లో అనుకోకుండా క్లేమన్‌ మరణించారు. అయితే, క్రేగ్ వద్ద ఉన్న బిట్‌కాయిన్లలో తమకు కూడా సగం వాటా ఇవ్వాలని క్లేమన్‌ కుటుంబ సభ్యులు ఇటీవల మియామీ కోర్టును ఆశ్రయించారు. 2007-08 మధ్య కాలంలో క్రేగ్‌, క్లేమన్‌ కలిసే బిట్‌కాయిన్‌ను సృష్టించారన్నది వారి వాదన. ప్రస్తుతం తన వద్ద 1.1 మిలియన్ల బిట్‌కాయిన్లు ఉన్నాయని క్రేగ్‌ వాదిస్తున్నారు. వీటి విలువ ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. భారత కరెన్సీలో దాదాపు రూ.3.75 లక్షల కోట్లు. దీంట్లో సగం వాటాతో పాటు బిట్‌కాయిన్‌ వెనుక ఉన్న బ్లాక్‌చైన్‌ సాంకేతికతపై మేధోహక్కులు కూడా కల్పించాలని క్లేమన్‌ కుటుంబం కోరింది.

భారీ మొత్తం, పైగా అంత సులువుగా అంతుబట్టని బిట్‌కాయిన్‌ వ్యవహారం కావడంతో న్యాయమూర్తులకు ఇది ఒక సవాల్‌గా నిలిచింది. దాదాపు 10 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్నారు. అసలు బిట్‌కాయిన్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు. క్రేగ్‌, క్లేమన్‌ మధ్య ఉన్న బంధం గురించి క్షుణ్నంగా పరిశీలించారు. చివరకు 1.1 మిలియన్ల బిట్‌కాయిన్లలో క్లేమన్‌కు వాటా లేదని తీర్పిచ్చారు. అయితే, మేధో హక్కుల ఉల్లంఘనలకుగానూ ఇరువురు కలిసి నెలకొల్పిన డబ్ల్యూఅండ్‌కే సంస్థకు 100 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాలని క్రేగ్‌ను ఆదేశించారు. తీర్పుపై క్రేగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు డబ్ల్యూఅండ్‌కే వర్గాలు సైతం తీర్పుని స్వాగతించాయి. బిట్‌కాయిన్‌ సృష్టికి కారణమైన తొలితరం బ్లాక్‌చైన్‌ సాంకేతికతకు సంబంధించిన మేధోహక్కులను క్రేగ్‌ ఉల్లంఘించినట్లు ఈ తీర్పుతో నిరూపితమైనట్లు వ్యాఖ్యానించారు.

సృష్టికర్తపై వీడని మిస్టరీ...

బిట్‌కాయిన్‌ మూలాలు ఎప్పుడూ ఒక మిస్టరీనే. అందుకే ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమైంది. 2008లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల సమూహం సతోషి నకమోటో పేరిట డిజిట్‌ కరెన్సీకి సంబంధించి ఓ పేపర్‌ను పబ్లిష్‌ చేశారు. అది ఎలా పనిచేయనుందో అందులో వివరించారు. ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం ఉండని మారకద్రవ్యంగా పేర్కొన్నారు. కొన్ని నెలల తర్వాతే ఈ కరెన్సీ మైనింగ్‌ కోసం అధికారికంగా సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేశారు. కొన్ని క్లిష్టమైన గణిత సమీకరణాలను పరిష్కరించడం ద్వారా కాయిన్లను పోగు చేసుకోవడం ప్రారంభమైంది. అయితే, 1.1 మిలియన్ బిట్‌కాయిన్లు తనేవనన్న క్రేగ్‌ వాదనను కొంతమంది కొట్టిపారేస్తున్నారు. చాలా కాలంగా వీటిని ఎవరూ కదపడం లేదని చెప్పుకొస్తున్నారు. అవి క్రేగ్‌వే అయితే, వాటిని ట్రేడింగ్‌లో ఎందుకు ఉంచడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అంత భారీ మొత్తంలో కాయిన్లను ఇప్పుడు మైన్‌ చేయడం కష్టమైన పని అని.. బహుశా, దాన్ని సృష్టించిన వారే తొలినాళ్లలో వాటిని మైన్‌ చేసి ఉంటారని మరికొంత మంది వాదిస్తున్నారు.

క్రేగ్‌ మాత్రం ఈ కేసులో తాను గెలిస్తే అవి తనేవనని నిరూపించుకుంటానని వాదిస్తూ వచ్చారు. పైగా ఆ సంపదను తాను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తానని ప్రకటించారు. అయితే, వాటిలో కొన్ని కాయిన్లను ఇతర ఖాతాలోకి బదిలీ చేసి అవి తనవేనని నిరూపించుకోవాలని క్రేగ్‌కు కొంతమంది సవాల్‌ విసురుతున్నారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది కానీ, బిట్‌కాయిన్‌ సృష్టికర్తపై నెలకొన్న మిస్టరీ మాత్రం వీడలేదు. చూడాలి మరి క్రేగ్‌ ఎలా నిరూపించుకుంటారో!

 

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని