Credit Card: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? అయితే, దీనిపై ఓ కన్నేసి ఉంచండి!

క్రెడిట్‌కార్డు వినియోగిస్తున్నవారు నిత్యం క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియోపై ఓ కన్నేసి ఉంచాలి...

Published : 06 Jun 2022 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటలైజేషన్‌ పెరుగుతున్న కొద్దీ క్రెడిట్‌ కార్డు (Credit Card)ల వినియోగం పెరుగుతోంది. బ్యాంకులు సైతం అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌లు, రాయితీ కూపన్‌లు, రివార్డు పాయింట్లు.. ఇలా అనేక మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరోవైపు చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ (Credit Card)కార్డులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా విమాన టికెట్లు, రైలు టికెట్లు, ఇంధన సర్‌ఛార్జి తగ్గింపునకు ప్రత్యేకంగా కార్డులు అందుబాటులో ఉన్నాయి..

కార్డు యుటిలైజేషన్‌పై కన్నేసి ఉంచాలి..

క్రెడిట్‌ కార్డు వినియోగిస్తున్న ప్రతిఒక్కరూ కార్డు యుటిలైజేషన్‌ రేషియో (Card utilisation ratio)పై దృష్టి పెట్టాలి. మీ ఖర్చు చేసిన మొత్తం, మీ క్రెడిట్‌ కార్డు (Credit Card) పరిమితిల నిష్పత్తే కార్డు యుటిలైజేషన్‌ రేషియో (CUR). ఉదాహరణకు మీ కార్డు పరిమితి రూ.2లక్షలు అనుకుందాం. ఈఎంఐ (EMI)లతో కలిపి నెలలో మీరు కార్డుపై రూ.50 వేలు ఖర్చు చేశారనుకుందాం. అప్పుడు మీ కార్డు యుటిలైజేషన్‌ రేషియో (CUR) 25%. సీయూఆర్‌ తరచూ 40 శాతం దాటితే అది మీ క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)పై ప్రభావం చూపుతుంది. పైగా చెల్లింపులు భారంగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి కనీస మొత్తం చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని బాకీ ఉంచితే.. దీర్ఘకాలంలో అది పెద్ద అప్పుల కుప్పగా మారే ప్రమాదం ఉంది. మీ ఖర్చులను వివిధ కార్డుల మధ్య విభజించుకుంటే.. యుటిలైజేషన్‌ రేషియో (CUR)ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి మీ సీయూఆర్‌ 40 శాతం మించకుండా ఖర్చు చేస్తే ఉత్తమం. 

బాధ్యతగా ఉపయోగించాలి..

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డు (Credit Card)ల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, వాటిని బాధ్యతగా ఉపయోగిస్తేనే లాభదాయకం. ఒక బేసిక్‌ కార్డు ద్వారా మీ క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)ను నియంత్రణలో ఉంచుకుంటూనే.. వివిధ రకాల ఖర్చులకు ప్రత్యేకంగా కో-బ్రాండెడ్‌ కార్డు (Co-brabded Credit cards)లు ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకేరకమైన ప్రయోజనాలు ఉన్న రెండు కార్డులను ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఒకవేళ మీరు తరచూ విదేశాలకు ప్రయాణం చేయాల్సి ఉంటే.. విమాన టికెట్లు, ఎయిర్‌పోర్టు లాంజ్‌, భోజనాల్లో రాయితీ ఇచ్చే కార్డులను తీసుకోవాలి. లేదా తరచూ ఒకే షాపింగ్‌ మాల్‌లో కొనుగోళ్లు చేస్తే వారందించే ప్రత్యేక కార్డును తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుంది.

సకాలంలో చెల్లింపులు చేయాలి..

మనం ఏదైనా వస్తువును కొన్న దగ్గరి నుంచి బిల్లింగ్‌ సైకిల్‌ (Billing Cycle) పూర్తయ్యే వరకు దాదాపు ఐదు వారాల గడువు ఉంటుంది. ఆ సమయంలోపే చెల్లింపు చేయాలి. అప్పటి వరకు మాత్రమే మీకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఒకవేళ డబ్బు సర్దుబాటు కాకపోతే.. కనీస మొత్తమైనా చెల్లించాలి. లేదంటే పెద్దమొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా క్రెడిట్‌ కార్డు (Credit Card)పై వడ్డీరేటు 20-40% వరకు వసూలు చేస్తారు. దీనికి ఆలస్య రుసుములు అదనం.

స్తోమతకు మించి ఖర్చు చేయడం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి క్రెడిట్‌ కార్డు (Credit Card)ని ఎంత బాధ్యతగా వాడుకుంటే అంత ప్రయోజనం. సకాలంలో చెల్లింపులు చేస్తూ.. సీయూఆర్‌పై కన్నేసి ఉంచితే క్రెడిట్‌ కార్డు ఓ వరమనే చెప్పొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే.. క్రెడిట్‌ కార్డు కంటే కూడా పర్సనల్‌ లోన్‌, టాప్-అప్‌ లోన్‌ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. క్రెడిట్‌ కార్డుతో పోలిస్తే.. వడ్డీరేటు వీటిలో చాలా తక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని