అస్థిర‌త‌ల‌ను అధిగ‌మించి రాబ‌డి పొందండిలా

క‌నీస కాల‌ప‌రిమితి 7-10 సంవ‌త్స‌రాలకు ఈక్విటీలో పెట్టుబ‌డి చేస్తే మంచి రాబ‌డిని మ‌దుప‌ర్లు పొంద‌వ‌చ్చు....

Published : 18 Dec 2020 15:12 IST

క‌నీస కాల‌ప‌రిమితి 7-10 సంవ‌త్స‌రాలకు ఈక్విటీలో పెట్టుబ‌డి చేస్తే మంచి రాబ‌డిని మ‌దుప‌ర్లు పొంద‌వ‌చ్చు.​​​​​​​

ఈక్విటీ మార్కెట్లు గ‌త రెండేళ్లుగా మంచి రాబ‌డిని అందిస్తున్నాయ‌ని చెప్పాలి. ఈ సంవ‌త్స‌రం మార్కెట్లు దిద్దుబాటు తీసుకుని త‌రువాత గ‌రిష్ఠ‌ స్థాయిల‌కు చేరుకున్నాయి. కొన్ని షేర్ల విలువ‌లు భారీగా పెర‌గ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

రిటైల్ మ‌దుప‌ర్ల ప్ర‌భావం

రిటైల్ మ‌దుప‌ర్లు మార్కెట్ల‌కు వెన్నుద‌న్నులా నిలిచార‌ని చెప్పాలి. వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా ఈక్విటీ మార్కెట్ల‌లోకి పెట్టుబ‌డులు చేస్తున్నారు. సిప్ విధానంలో ప్ర‌తీ నెల పెరుగుద‌ల క‌నిపించ‌డమే దీనికి నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం ఒక నెల‌కు రూ.7300 కోట్లు సిప్ ద్వారా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో పాటు లంప్‌స‌మ్ గా పెట్టుబ‌డులు చేసే మ‌దుప‌ర్లు కూడా ఉంటారు. అవి వీటికి అద‌నంగా తోడ‌వుతాయి. నిజానికి విదేశీ పోర్టుఫోలియో మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకోవ‌డం ద్వారా ప్ర‌భావం మ‌న మార్కెట్ల పై ప‌డ‌కుండా దేశీయ‌ మ‌దుప‌ర్లు పెట్టుబ‌డులు చేశార‌ని చెప్ప‌వ‌చ్చు.

మ‌దుప‌ర్ల‌లో విశ్వాసం

గ‌త కొన్నేళ్లుగా ఈక్విటీ మ్యూచువ‌ల్ పండ్ల రాబ‌డి ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఇది మ‌దుప‌ర్ల‌లో ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై మ‌రింత విశ్వాసం పెంచుతుంద‌ని చెప్పాలి. కంపెనీ వ్యాల్యూయేష‌న్‌లు ఒక ప‌క్క భారీగా పెరిగినా ఈక్విటీలో పెట్టుబ‌డులు చేసేందుకుకు మ‌దుప‌ర్లు ఆస‌క్తిగా ఉండ‌టం చూడ‌వ‌చ్చు.అయితే ఈక్విటీలో ఎప్పుడు మార్క‌ట్లు తిరోగ‌మ‌నం చెందుతాయ‌నేది క‌చ్చితంగా ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేరు. అయితే గ‌త కొన్నేళ్లుగా నిఫ్టీ సూచీ అందించిన రాబ‌డిని విశ్లేషించ‌డం ద్వారా ఈ విష‌యాన్ని మ‌నం కొంత అర్థం చేసుకోవ‌చ్చు. గ‌త రాబ‌డులు భ‌విష్య‌త్తులో రాబ‌డుల‌కు గ్యారంటీ కాద‌ని మ‌న‌కి తెలుసు కానీ ఒక అవ‌గాహ‌న‌కు ఇది తోడ్ప‌డుతుంది.

nifty returs.png

పై ప‌ట్టిక‌లో ఉన్న అంశాల‌ను ప‌రిశీలించి చూస్తే

ఒక మ‌దుప‌రి ఏడాది కాలం పాటు ఈక్విటీ పెట్టుబ‌డులు చేసిన‌ట్ట‌యితే మూడింట ఒక సారి రుణాత్మ‌క రాబ‌డి వ‌చ్చింది. కాల‌ప‌రిమితిని మూడేళ్ల‌కు పెంచితే ఐదింట ఒక సారి రుణాత్మ‌క రాబ‌డి వ‌చ్చింది. పెట్టుబ‌డి కాల‌ప‌రిమితి పెంచిన కొల‌దీ ఈ శాతం త‌గ్గ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ప‌దేళ్ల పాటు పెట్టుబ‌డి చేసిన మ‌దుప‌ర్ల‌కు రుణాత్మ‌క రాబ‌డి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. గ‌త 20 ఏళ్ల కాలంలోఎప్పుడైనా పెట్టుబ‌డి చేసి క‌నీసం ఏడేళ్ల పాటు పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించిన‌ట్ట‌యితే ఒక్క‌సారి కూడా న‌ష్ట వ‌చ్చిన సంద‌ర్భాలు లేవు. అస్థిర‌త‌ అధికంగా ఉండే మిడ్ క్యాప్ సూచీలతో స‌హా.

మ‌ధ్య‌లో అడ్డంకులు వ‌చ్చినా

సెన్సెక్స్, నిఫ్టీలు మ‌న దేశంలో ప్ర‌ధాన స్టాక్ మార్కెట్ సూచీలు. గ‌త కొన్నేళ్లుగా గ‌మ‌నిస్తే మంచి రాబ‌డులు అందించాయి. అయితే మ‌ధ్య‌లో కొన్ని క‌రెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని గ‌మ‌నించాలి. హ‌ర్ష‌ద్ మెహ‌తా(1992) ఆర్థిక మాంద్యం(2008) స‌మ‌యంలో చేసిన మ‌దుపు ఒక ఏడాదిలోనే 40-50 శాతం వ‌ర‌కూ న‌ష్ట‌పోయారు. (1997-98) ఆసియా క్రెడిట్ క్రైసెస్, డాట్ కామ్ బ‌బుల్ బ్లాస్ట్ (2000-2001) వంటి ప‌రిణామాలు ఏర్ప‌డిన త‌రువాత కూడా త‌మ‌ పెట్టుబ‌డులు కొన‌సాగించిన వారికి దీర్ఘ‌కాలంలో స‌ర్దుబాటు అయి మ‌దుప‌ర్ల‌ను న‌ష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువ‌చ్చాయి. దీనికి చాలా ఓపిక కావాలి.

దేశీయ స్టాక్ మార్కెట్లు ప్ర‌స్తుతం స్థిరీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ని చెప్పాలి. రానున్న‌ది ఎన్నిక‌ల సంవ‌త్స‌రం, కార్పోరేట్ వృద్ధి , అమెరికా ఫెడ్ నిర్ణ‌యాలు, అంత‌ర్జాతీయ వాణిజ్య పోరు,భౌగోలిక అంశాలు త‌దిత‌ర విష‌యాలు మార్కెట్ల‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపుతాయ‌నే చెప్పాలి. ఈక్విటీలో పెట్టుబ‌డులు చేయాల‌నుకునే మ‌దుప‌ర్లు ఇది స‌రైనా స‌మ‌య‌మేనా? అనే సందేహం రావ‌డం స‌హ‌జం. మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయ‌నే విష‌యం అంచ‌నా వేయ‌డం క‌ష్టం. అయితే మార్కెట్లో మ‌దుపు చేయ‌డానికి ఈ స‌మ‌యం ఆ స‌మ‌యం లేకుండా సిప్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి. క‌నీస కాల‌ప‌రిమితి 7-10 సంవ‌త్స‌రాలుగా పెట్టుకుని ఈక్విటీలో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. ఈ స‌మ‌యంలో ఏర్పిడిన అస్థిత‌ర‌త‌లు త‌గ్గిపోయి దీర్ఘ‌కాలంలో మ‌దుప‌ర్ల‌కు మంచి రాబ‌డిని అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని