Published : 27 Jul 2022 20:38 IST

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విష‌యాలు గుర్తుంచుకోండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం అనేది మ‌న దేశంలో భావోద్వేగాల‌తో ముడిప‌డిన విశ్వ‌స‌నీయ‌మైన పెట్టుబ‌డి సాధనం. పసిడిలో పెట్టుబ‌డులు ఆర్థిక భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తాయ‌ని ప్ర‌జ‌లు నమ్ముతారు. అందుకే పండుగ సంద‌ర్భాల‌లో ఎక్కువ‌గా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. వివాహం, పుట్టిన రోజు వేడుకలు వంటి సందర్భాల్లో ఆత్మీయుల‌కు బంగారాన్ని బ‌హుమ‌తిగా ఇస్తుంటారు. ఆర్థిక అవ‌స‌రాల‌కు బంగారంపై రుణాల‌నూ తీసుకుంటుంటారు. పిల్ల‌ల చ‌దువులు, ఇంటి పున‌రుద్ధ‌ర‌ణ‌, అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితులు, వ్యాపారంలో నిధుల కొర‌త‌.. ఇలా స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాలు అనేకం ఉంటాయి. ఇలాంటి వాటికి బంగారు ఆభ‌రణాల‌ను బ్యాంకులో ఉంచి రుణం పొందొచ్చు. పైగా త‌క్కువ పేప‌ర్ వ‌ర్క్‌తో, త‌క్కువ స‌మ‌యంలోనే రుణాల‌ను పొందే అవ‌కాశం ఉండ‌డం, అసుర‌క్షిత రుణాలైన వ్య‌క్తిగ‌త రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల కంటే త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణం ల‌భిస్తుండ‌డం, చెల్లింపుల్లో వెసులుబాటు ఉండ‌డంతో చాలా మంది బంగారంపై రుణాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ రుణాలు తీసుకునేముందు రుణ గ్ర‌హీత‌లు ఏ అంశాలు ప‌రిశీలించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బంగారం విలువ‌: మీరు బ్యాంకు వ‌ద్ద హామీ ఉంచే బంగారం విలువ ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. బ్యాంకుల వ‌ద్ద బంగారం నాణ్య‌త‌ను తెలుసుకునేందుకు నిపుణుడైన వ్య‌క్తి ఉంటారు. అత‌డు మీ బంగారం నాణ్య‌త‌ను అంచ‌నావేసి బంగారానికి విలువ క‌డ‌తారు. 18 నుంచి 24 క్యారెట్ల బంగారు ఆభ‌ర‌ణాలను బ్యాంకులు హామీ కోసం అనుమ‌తిస్తాయి. ఆభ‌ర‌ణాల్లో ఉప‌యోగించే రాళ్ల‌ను గానీ, డిజైన్ల‌ను గానీ, న‌గ‌ల త‌యారీలో వినియోగించిన ఇత‌ర లోహాల‌ను గానీ లెక్క‌లోకి తీసుకోరు. కేవ‌లం బంగారు ఆభ‌రణంలో ఉన్న‌ స్వ‌చ్ఛ‌మైన‌ బంగారాన్ని అంచ‌నావేసి విలువ‌ను లెక్క‌క‌ట్టి, అందుకు త‌గిన‌ట్లుగా రుణం ఇస్తుంటారు. సాధారణంగా ఏ బ్యాంకూ లేదా బ్యాంకింగేత‌ర సంస్థ అయినా బంగారం విలువ‌పై 100 శాతం రుణం ఇవ్వ‌వు. లోన్ టు వాల్యు (LTV) నిష్ప‌త్తి ఆధారంగా రుణం ఇస్తాయి. ఇది బంగారం విలువ‌లో 60 నుంచి 90 శాతం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకు ఎల్‌టీవీ 75 శాతం ఉంటే.. మీరు బ్యాంకు వ‌ద్ద రూ. 1 ల‌క్ష విలువ గ‌ల బంగారం డిపాజిట్ చేస్తే.. రూ. 75 వేలు మాత్ర‌మే రుణం ఇస్తారు. 

ఎక్క‌డ నుంచి లోన్ తీసుకోవచ్చు?: ఇప్పుడు బంగారంపై సుల‌భంగా, త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణాలు ఇస్తామంటూ అనేక సంస్థ‌లు వ‌స్తున్నాయి. సుల‌భంగా రుణం ల‌భిస్తుంద‌ని.. ఆర్‌బీఐ అనుమితి లేని సంస్థ‌ల నుంచి రుణం తీసుకోవ‌డం ఏ మాత్రం మంచిదికాదు. గోల్డ్ లోన్‌లో బంగారాన్ని ముందుగానే డిపాజిట్ చేయాలి. అందువ‌ల్ల భ‌ద్ర‌త చాలా ముఖ్యం. అలాగే వ‌డ్డీ రేట్లను దృష్టిలో పెట్టుకోవాలి. బంగారంపై రుణాల విష‌యంలో గుర్తింపులేని సంస్థ‌ల కంటే, బ్యాంకులను గానీ, బ్యాకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ (ఎన్‌బీఎఫ్‌సీ)ల‌ను గానీ ఆశ్ర‌యించ‌డం మంచిది.

వ‌డ్డీ రేట్లు: బంగారంపై రుణాల‌కు అందించే వ‌డ్డీ రేట్లు బ్యాంకును బ‌ట్టి, రుణ గ్ర‌హీత రిస్క్ ప్రొఫైల్‌ని బ‌ట్టి మారుతుంటాయి. ఇవి సాధార‌ణంగా 7 నుంచి 25 శాతం మ‌ధ్య‌లో ఉంటాయి. మీరు తీసుకునే రుణ మొత్తం, చెల్లింపుల కాల‌వ్య‌వ‌ధి, ఎల్‌టీవీ ఆధారంగా కూడా వ‌డ్డీ రేటులో మార్పు ఉండొచ్చు. అందువల్ల వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్ల‌ను పోల్చిచూడాలి. దీంతో పాటు ఇత‌ర ఛార్జీలు, రుణ ప్రాసెసింగ్ ఫీజుల‌ను తెలుసుకోవాలి.

చెల్లింపులు: గోల్డ్ లోన్ తీసుకునేవారు తెలుసుకోవాల్సిన మ‌రో ముఖ్య‌మైన అంశం చెల్లింపుల విధానం. గోల్డ్ లోన్ విష‌యంలో బ్యాంకులు వివిధ చెల్లింపుల ఆప్ష‌న్ల‌ను ఇస్తుంటాయి. ఈఎంఐ (నెల‌వారీ స‌మాన వాయిదాలు), ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌డ్డీ చెల్లించ‌డం, రుణ మొత్తాన్ని (వ‌డ్డీతో స‌హా) ఒకేసారి చెల్లించ‌డం.. ఇలా వివిధ‌ ఆప్ష‌న్లు ఉంటాయి. రుణం తీసుకునే ముందు బ్యాంకు ఇస్తున్న ఆప్ష‌న్లు తెలుసుకుంటే అందులో మీకు అనుకూలంగా ఉన్న విధానాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చు. 

కాల‌ప‌రిమితి: బంగారం రుణాల చెల్లింపుల‌కు త‌క్కువ స‌మ‌య‌మే ఉంటుంది. సాధార‌ణంగా ఒక‌వారం నుంచి రెండు లేదా మూడేళ్ల‌ గ‌డువు ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఏడాది గ‌డువు మాత్ర‌మే ఇస్తాయి. రుణం తీసుకునే ముందే ఇవ‌న్నీ చూసుకోవాలి. మీ సాధార‌ణ ఖ‌ర్చులు, ఇత‌ర అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌తి నెలా చెల్లించ‌గ‌లిగే మొత్తాన్ని అంచ‌నా వేసి కాల‌ప‌రిమితిని ఎంచుకోవాలి.

చెల్లింపులు చేయ‌డంలో విఫ‌లం అయితే: గోల్డ్ లోన్ చెల్లించ‌డంలో విఫ‌లం అయితే బ్యాంకులు మీ బంగారాన్ని వేలం వేస్తాయి. ఒక‌వేళ రుణ కాల‌వ్య‌వ‌ధిలో బంగారం ధ‌ర త‌గ్గితే ఎల్‌టీవీ నిష్ప‌త్తికి స‌రిపోయే అద‌న‌పు బంగారాన్ని ఉంచ‌మ‌ని గానీ, ప్ర‌స్తుతం ఉన్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని చెల్లించ‌మ‌ని గానీ బ్యాంకులు మిమ్మ‌ల్ని అడ‌గొచ్చు. 

చివ‌రిగా: వ్య‌క్తిగ‌తంగా గానీ, వ్యాపారాలు చేస్తున్న‌ప్పుడు గానీ ఒక్కోసారి కొద్ది రోజుల కోసం డ‌బ్బు అవ‌స‌రం కావొచ్చు. అలాంట‌ప్పుడు బంగారంపై రుణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇల్లు, కారు, లేదా ఇత‌ర ఆస్తుల కొనుగోలుకు అధిక మొత్తంలో బంగారంపై రుణాలు తీసుకోవ‌డం మాత్రం సూచ‌నీయం కాదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని