Published : 20 Jul 2022 14:06 IST

kerala govt: కేరళ సర్కారు కీలక నిర్ణయం.. ఆ వస్తువులపై నో జీఎస్టీ

 

తిరువనంతపురం: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ (GST) విధించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేరళ సర్కారు (Kerala govt) కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుటుంబ శ్రీ’ లేదా చిన్న చిన్న దుకాణాల్లో 1, 2 కేజీల ప్యాకెట్ల రూపంలో విక్రయించే వస్తువులపై జీఎస్టీ విధించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ అసెంబ్లీ వేదికగా బుధవారం ఈ ప్రకటన చేశారు. ఈ విషయంలో కేంద్రంతో పేచీ వచ్చినా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. ‘కుటుంబ శ్రీ’ అనేది కేరళలో స్వయం సహాయక సంఘం. మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇదే. వీటి ఆధ్వర్యంలో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు నడుస్తుంటాయి.

‘‘కుటుంబ శ్రీ, చిన్న చిన్న స్టోర్లలో విక్రయించే 1 లేదా 2 కేజీల ప్యాకెట్లకు గానీ, లూజుగా విక్రయించే నిత్యావసర సరకులకు గానీ ఎలాంటి జీఎస్టీ విధించబోం. ఈ విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పినా వెనకడుగు వేయం. ఇదే విషయమై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సీఎం విజయన్‌ సైతం నిన్ననే కేంద్రానికి ఓ లేఖ రాశారు. చిన్న తరహా వ్యాపారులు, చిరు వ్యాపారులపై పన్నులు వేయాలని మేం అనుకోవడం లేదు’’ అని బాల గోపాల్‌ పేర్కొన్నారు.

నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ సీఎం విజయన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జీఎస్టీ వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా కేరళలో మిల్లర్లు, చిన్న చిన్న దుకాణాలు నడిపేవారు సైతం వస్తువులను ముందుగానే ప్యాకేజీ చేసి విక్రయిస్తుంటారని తన లేఖలో విజయన్‌ పేర్కొన్నారు. ప్యాక్‌ చేసి విక్రయించడమనేది సర్వసాధారణమైన విషయమని తెలిపారు. ప్యాక్‌ చేసి విక్రయించే వస్తువులను తాజాగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల చిన్న చిన్న దుకణాల్లో కొనుగోలు చేసే వినియోగదారులపై భారం పడుతుందని లేఖలో పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts