సెప్టెంబరులో కీలక మార్పులు.. వారికిదే చివరి అవకాశం

సెప్టెంబరులో రానున్న కీలక ఆర్థికపరమైన మార్పులు గురించి తెలుసుకుందాం. ఎన్‌పీఎస్‌ కమీషన్‌ పెంపు, డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు వంటివి ఈ నెలలో పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని కీలక మార్పులు... 

Updated : 01 Sep 2022 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన రోజువారీ ఆర్థిక విషయాలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా రుసుముల పెంపు, కొత్త ఛార్జీలు, ఏవైనా సేవలకు గడువు తీరిపోనుండడం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మరి సెప్టెంబరులో వస్తున్న కీలక ఆర్థికపరమైన మార్పులేంటో చూద్దాం..

ఐటీఆర్‌ వెరిఫికేషన్‌కు 30 రోజులే..

ఆగస్టు 1 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారు వెంటనే ఇ-వెరిఫై (ITR e-verification) పూర్తిచేయాలి. ఎందుకంటే గడువును 30 రోజులకు తగ్గించారు. ఇప్పటివరకు ఈ గడువు 120 రోజులుగా ఉండేది. ఉదాహరణకు మీరు ఆగస్టు 8న రిటర్న్సు దాఖలు చేసి ఉంటే.. సెప్టెంబరు 7లోపు వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. లేదంటే మీ ఐటీఆర్‌ను అధికారులు పక్కనపెట్టే అవకాశం ఉంది. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీ రీఫండ్‌లో అంత జాప్యం జరుగుతుంది. మరీ ఆలస్యమైతే ఐటీఆర్‌ను తిరస్కరించనూ వచ్చు. అయితే, 2022 జులై 31కి ముందు ఐటీఆర్‌ను సమర్పించినవారికి మాత్రం వెరిఫికేషన్‌కు 120 రోజుల సమయం ఉంటుంది.

ఎన్‌పీఎస్‌ కమీషన్‌ పెంపు..

జాతీయ పింఛను పథకం (NPS) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమకు డైరెక్ట్‌ రెమిట్‌ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే పీఓపీలకు లభించే కమీషన్‌ను 0.10 శాతం నుంచి 0.20కు పెంచారు. ఈ మార్పు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానుంది. 

ఎన్‌పీఎస్‌ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఫీజుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పీఓపీలు కోల్పోతాయి. అలాంటి సంస్థలకు పరిహారం ఇవ్వడమే కమీషన్‌ పెంపు ప్రధాన ఉద్దేశమని పీఎఫ్‌ఆర్‌డీఏ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన మదుపర్లు ఎన్‌పీఎస్‌ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్‌పీఎస్‌కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తగా పీఓపీలు ఉంటాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌ కంపెనీలు పీఓపీల కిందకు వస్తాయి. ఎన్‌పీఎస్‌ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న వీటికి తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ పేర్కొంది.

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు..

ఈ నెల నుంచి డెబిట్‌ కార్డు జారీ ఛార్జీలు, వార్షిక రుసుములను పెంచుతున్నట్లు పలు బ్యాంకులు ప్రకటించాయి. కార్డుల్లో ఉపయోగించే సెమీకండక్టర్‌ చిప్‌ల ధరలు పెరగడమే దీనికి కారణం. ఉదాహరణకు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు రూపే క్లాసిక్‌ డెబిట్‌ కార్డు జారీకి రూ.50 వసూలు చేయనుంది. రెండో సంవత్సరం నుంచి వార్షిక రుసుము కింద రూ.150 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. యెస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సైతం ఇదే తరహాలో ఛార్జీలను పెంచాయి.

అటల్‌ పెన్షన్‌ యోజనలో మదుపునకు చివరి అవకాశం..

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. అంతకంటే ముందు చేరినవారు మాత్రం ఈ స్కీంలో కొనసాగుతారు. అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించే దిశగా 2015 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హత గల (అసంఘటిత రంగంలో పనిచేసే) పౌరులు ఈ పథకంలో చేరొచ్చు. నెలకు రూ.100 నుంచి చందా కట్టొచ్చు. ఈ చందాకు బ్యాంకు సేవింగ్స్‌ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. చందాదారుల వయసు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు కట్టిన మొత్తాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పింఛను హామీ ఉంటుంది.

వచ్చే నెల నుంచి కార్డు టోకనైజేషన్‌.. 

పీఓఎస్‌, యాప్‌లలో నిక్షిప్తమై ఉన్న క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను ఈ నెలలోనే టోకెన్స్‌ రూపంలోకి మార్చుకోండి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. అక్టోబరు 1 నుంచి కార్డు టోకనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీ వంటి కార్డు వివరాలను మర్చంట్‌ వెబ్‌సైట్లు నిక్షిప్తం చేసుకోవడానికి వీలుండదు. కాబట్టి మీ వివరాలను టోకెన్లతో రీప్లేస్‌ చేసుకోవడానికి ఆయా యాప్‌లలో మీ అనుమతి తెలియజేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని