Year ender 2022: బీమా రంగంలో ఈ ఏడాది వచ్చిన మార్పులివే..

ఈ ఏడాది బీమా రంగంలో వచ్చిన కీలక పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 31 Dec 2022 10:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్‌ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఊహించని సంఘటనల వల్ల జరిగే నష్టాలకు ఆర్థిక భద్రత కల్పించుకునేందుకు బీమా తీసుకోవడం అవసరం. కొవిడ్‌-19 కారణంగా గత రెండేళ్లలో చాలా మంది జీవిత, ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. దీంతో  ఈ ఏడాది కొనుగోళ్లు పెరిగాయి. బీమా సంస్థలు ఆర్జించే ప్రీమియంలూ పెరిగాయి. అలాగే బీమా సంస్థలు కూడా పాలసీ కొనుగోలు నుంచి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ వరకు చాలా సేవలను వర్చువల్‌గా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. 2022 ముగింపు సందర్భంగా.. ఈ ఏడాది బీమా రంగంలో వచ్చిన కీలక పరిణామాలను ఇప్పుడు చూద్దాం..

ఎల్‌ఐసీ ఐపీఓ..

దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) ఈ ఏడాదిలోనే తొలిసారిగా పబ్లిక్‌ ఆఫర్‌ (IPO)కు వచ్చింది. దాదాపు రూ.21వేల కోట్ల సమీకరణతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా వచ్చిన ఎల్‌ఐసీ.. మదుపర్లను నిరాశపరిచింది.

అధిక ఆరోగ్య బీమా ప్రీమియంలు..

గత రెండేళ్లలో దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యయంతో పాటు క్లెయింల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది ఆరోగ్య బీమా ప్రీమియంలు 8-15% మేర పెరిగాయి. 

కొత్త కొత్త పాలసీలు, ఓపీడీ సేవలు..

ఈ ఏడాది చాలా వరకు బీమా సంస్థలు.. డాక్టర్‌ సంప్రదింపులు, ఫార్మసీ బిల్లులు వంటి ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) ఖర్చులను కవర్‌ చేసే పాలసీలను తీసుకొచ్చాయి. అంతేకాకుండా రూ.5 కోట్ల కవరేజీ, విదేశాల్లో ప్రణాళికాబద్ధమైన చికిత్స, వృద్ధులకు మద్దతు, మధుమేహం వంటి ముందస్తు వ్యాధులకు కవరేజీని అందించే వాల్యు-యాడెడ్‌ సేవలతో కొత్త పాలసీలను తీసుకొచ్చాయి.

సరికొత్త మోటర్‌ ఇన్సురెన్స్‌ రైడర్లు.. 

ఈ ఏడాది మోటారు బీమాలో ‘పే-యాజ్‌-యూ-యూజ్‌’, ‘పే-యాజ్‌-యూ-డ్రైవ్‌’ వంటి వినూత్నమైన రైడర్లను అందించేందుకు ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలను అనుమతించింది.  కారు ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా ప్రీమియం చెల్లించే అవకాశం లభించడంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఐసీఐసీఐ లాంబార్డ్‌, కోటక్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియాన్జ్, డిజిట్ ఇన్సూరెన్స్‌ సహా అనేక బీమా సంస్థలు ఈ ఏడాది ఈ రైడర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 

జీరో-కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌..

జీవిత బీమాలో టర్మ్‌ బీమా ప్రాధాన్యం ఎక్కువ ఉన్నప్పటికీ, పాలసీ కాలవ్యవధి వరకు జీవించి ఉంటే ఎలాంటి హామీ రాదాని చాలా మంది టర్మ్‌ ప్లాన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బీమా సంస్థలు జీరో-కాస్ట్‌ టర్మ్‌ ప్లాన్‌ను పరిచయం చేశాయి. ఈ ప్లాన్‌తో పాలసీదారుడు కాలపరిమితి ముగిసే ముందే నిష్క్రమించే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా అంతవరకు చెల్లించిన ప్రీమియంలను కూడా నియమ నిబంధనలకు లోబడి వెనక్కి ఇచ్చేస్తారు. అయితే, ఈ పాలసీలు 45 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి, దీర్ఘకాలపరిమితితో పాలసీ తీసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

యూజ్‌-అండ్‌-ఫైల్‌..

బీమా సంస్థలు ఒక పాలసీని మార్కెట్‌లోకి విడుదల చేయాలంటే.. ముందుగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి పొందాలి. ఆ తర్వాత మాత్రమే పాలసీలను విక్రయించాలి. దీన్నే ‘ఫైల్‌ అండ్‌ యూజ్‌’ అంటారు. ఈ సంవత్సరం దీని స్థానంలో ‘యూజ్‌ అండ్‌ ఫైల్‌’ విధానాన్ని ప్రారంభించారు. దీంతో బీమా సంస్థలు పాలసీని విడుదల చేసిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

బీమా సుగమ్‌ పోర్టల్‌..

జీవిత, జీవితేతర బీమా పాలసీలను అందించే అన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు..‘బీమా సుగమ్‌’ పేరుతో ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించనున్నట్లు ఐఆర్‌డీఐ ఈ ఏడాది తెలిపింది. ఈ పోర్టల్‌ 2023, జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ వేదిక ద్వారా జీవిత, ఆరోగ్య, మోటారు బీమా పాలసీలను వివిధ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. అలాగే వెబ్‌ అగ్రిగేటర్లు, బ్రోకర్లు, బ్యాంకులు, బీమా ఏజెంట్లు మధ్యవర్తులుగా ఉంటూ అందించే సేవలను బీమా సుగమ్‌ వేదికగా ఇ-ఇన్సురెన్స్‌ ఖాతాతో పాలసీదారులు పొందవచ్చు. ఈ వేదిక ద్వారా పాలసీలను పోల్చి చూడడంతో పాటు, పోర్టబిలిటీ, ఆన్‌లైన్‌ యాక్సెస్‌, పునురుద్ధరణ వంటివి చేయవచ్చు. కమీషన్‌ చెల్లించనవసరం లేదు. 

కేవైసీ..

2023, జనవరి 1 నుంచి కొనుగోలు, పునరుద్ధరణ చేసే అన్ని రకాల పాలసీల (జీవిత, ఆరోగ్య, మోటారు, ప్రయాణం, గృహ బీమా) కు కేవైసీ తప్పనిసరి అని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్య బీమాలో రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ క్లెయిం విలువ ఉన్న వినియోగదారులు మాత్రమే కేవైసీ పత్రాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి కేవైసీ పత్రాలు తప్పనిసరి కాదు. అయితే, ఇప్పుడు అన్ని రకాల పాలసీలకు కేవైసీ ఇవ్వాలి. అదికూడా పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని