Budget 2023: మేడమ్‌..! ఇల్లు కట్టుకుంటాం కాస్త కరుణిస్తారా?

Budget 2023: కొత్త బడ్జెట్‌పై సామాన్యులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వడ్డీరేట్లు పెరిగిన నేపథ్యంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారి కోసం ఎలాంటి ప్రకటనలు ఉండనున్నాయో చూడాల్సి ఉంది. 

Updated : 23 Jan 2023 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు బలపడుతున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టబోతోంది. పైగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023). ఈ నేపథ్యంలో వివిధ రంగాలు కొత్త పద్దుపై ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న అనేక మంది స్థిరాస్తి పరిశ్రమకిచ్చే ప్రోత్సాహకాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2022లో ఇళ్ల విక్రయాలు 50 శాతం పుంజుకున్నాయి. అందుబాటు ధరలో ఇళ్లు, ఆరంభంలో తక్కువ వడ్డీరేటు వద్ద రుణాలు, కొవిడ్‌ ప్రభావం నుంచి తేరుకున్న వర్గాల నుంచి గిరాకీ వంటి మిశ్రమ వాతావరణం నేపథ్యంలో రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ గతేడాది గణనీయంగా పుంజుకుంది. ఈ జోరును ఇలాగే కొనసాగించి.. సామాన్యుల సొంతింటి కలను నిజం చేయాలంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌ (Budget 2023)లో పలు ప్రోత్సాహకాలు ప్రకటించాలని నిపుణులు కోరుతున్నారు.

గృహరుణ అర్హతల సులభతరం..

ద్రవ్యోల్బణం మంటను తగ్గించడానికి ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతోంది. కానీ, అది గృహ రుణ (Home Loan) గ్రహీతలకు మాత్రం భారంగా మారింది. నెలవారీ కిస్తీలు పెరిగి సామాన్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొత్తగా రుణం తీసుకొని ఇల్లు కొనాలనుకునేవారు (Homebuyers) తమ ప్రణాళికల్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రుణ అర్హతల్లో కొన్ని సడలింపులు చేయాల్సిన అవసరం ఉందని స్థిరాస్తి నిపుణులు కోరుతున్నారు. బ్యాంకులు ప్రస్తుతం మార్కెట్‌ విలువపై 80 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. దీనికితోడు అర్హత ప్రక్రియను సులభతరం చేయడం వంటి ఇతర నిర్ణయాలు బడ్జెట్‌లో ప్రతిపాదించాలని సామాన్యులు కోరుతున్నారు.

వడ్డీపై రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు..

ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదారు (Homebuyers)లు గృహరుణం (Home Loan)పై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల పై పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 24(బి) కింద ఈ వెసులుబాటును పొందుతున్నారు. 2016- 17 నుంచి ఈ పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గృహరుణానికి ప్రత్యేక ‘80సీ’..

వడ్డీతో పాటు గృహరుణ (Home Loan) అసలుపై కూడా సెక్షన్‌ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే, సెక్షన్‌ 80సీ ఇతర పెట్టుబడులుకు కూడా ఇది వర్తిస్తుంది. గృహరుణ అసలు మొత్తంతో పాటు వాటిని కూడా కలిపి రూ.1.5 లక్షలపై వరకు మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో 80సీ మినహాయింపును ఇతర పెట్టుబడులను నుంచి వేరుచేసి గృహరుణ (Home Loan) అసలుపై ప్రత్యేక మినహాయింపునివ్వాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ఆ మొత్తం రూ.75 లక్షల వరకు..

ప్రస్తుతం రూ.45 లక్షలు అంతకంటే తక్కువ విలువ చేసే ఇళ్లను అందుబాటు ధరలో ఇళ్ల (అఫర్డబుల్‌ హౌసింగ్‌) కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా కొన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని రూ.45 లక్షల పరిమితిని రూ.75 లక్షల వరకు పెంచడం ద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి.

దీర్ఘకాల మూలధన లాభాలపై ఉపశమనం..

ప్రస్తుతం ఉన్న ఇంటిని విక్రయించడం వల్ల వచ్చిన దీర్ఘకాల మూలధన లాభాలను ఆదాయ పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్‌ 54 ప్రకారం కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి వినియోగించొచ్చు. ఆ డబ్బుతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కొనుగోలు చేయొచ్చు. అయితే, దాని నిర్మాణం మూడేళ్లలోగా పూర్తయితేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలో వివిధ కారణాల వల్ల జాప్యం చోటు చేసుకొంటున్న నేపథ్యంలో ఈ కాలపరిమితిని ఐదేళ్లకు పొడిగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

జీఎస్‌టీ మినహాయింపులు..

ప్రస్తుతం స్టీల్‌పై 18 శాతం, సిమెంట్‌పై 28 శాతం జీఎస్‌టీ (GST) కొనసాగుతోంది. దీంతో నిర్మాణ వ్యయాలు పెరిగి ఆ భారాన్ని కొనుగోలుదారుల (Homebuyers)పై మోపాల్సి వస్తోందని స్థిరాస్తి వర్గాలు తెలిపాయి. ఫలితంగా ధరలు పెరిగి కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉపయోగించే వస్తువులపై జీఎస్‌టీ తగ్గించాలని కోరుతున్నారు. మరోవైపు వీటిపై చెల్లించిన పన్నును రీయింబర్స్‌ చేసుకోవడానికి ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ITC)’ను తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ కూడా డెవలపర్ల నుంచి వినిపిస్తోంది.

పీఎంఏవైకి అధిక కేటాయింపులు..

భారత్‌లో సామాన్యుల సొంతింటి కలను నిజం చేయడంలో ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY)’ వంటి పథకాలు కీలక పోషిస్తున్నాయని ‘ఇక్రా’ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 4.6 లక్షల ఇళ్లకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందించాల్సి ఉందని ఇక్రా తెలిపింది.

ల్యాండ్‌ బ్యాంక్‌ మానిటైజ్‌..

ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వద్ద పెద్దఎత్తున ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని ఇక్రా తెలిపింది. దీన్ని మానిటైజ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫలితంగా స్థిరాస్తి ప్రాజెక్టుల అభివృద్ధికి మరింత స్థలం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఫలితంగా గిరాకీ అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయని తెలిపింది. ధరల నియంత్రణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని