Budget 2023: మోదీ సర్కారు ‘స్థిర’ నిర్ణయాలేమిటో..?

దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలను అత్యధికంగా ప్రభావితం చేసే రంగాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రంగం కోరుతున్న డిమాండ్లు ఈ సారి పూర్తవుతాయని భావిస్తున్నారు. 

Updated : 24 Jan 2023 10:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సమయంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో స్థిరాస్తి ఒకటి. లాక్‌డౌన కారణంగా కొన్ని నెలలపాటు నిర్మాణాలు నిలిచిపోయాయి. దశల వారీగా లాక్‌డౌన్‌ తొలగించే నాటికి చాలా మంది కూలీలు స్వగ్రామాలకు వలసపోయారు. దీంతో వెంటనే నిర్మాణాలు పునః ప్రారంభం కాలేదు. నెలలకొద్దీ కూలీల కొరత నెలకొంది. మెల్లగా 2022 నాటికి గృహ నిర్మాణాల విక్రయాలు అంతకు మందు ఏడాదితో పోలిస్తే 50 శాతం పుంజుకొన్నాయి. ఇప్పుడు 2023లో కూడా ఆ డిమాండ్‌ను కొనసాగించడం రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుట నిలిచిన ముఖ్యమైన సవాల్‌. బడ్జెట్ 2023 ‌(Budget 2023)లో కేంద్రం తీసుకొనే నిర్ణయాలపై  స్థిరాస్తి రంగం అభివృద్ధి ఆధారపడి ఉంది.

బ్రోకరేజీ సేవలకు జీఎస్‌టీ రేటు క్రమబద్ధీకరణ..

కొన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ(GST), రెరాలు సానుకూల ప్రభావం చూపించాయి. కానీ, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజి వ్యవస్థకు సంబంధించి ఓ చిక్కుముడిని అపరిష్కృతంగా వదిలేశాయి. బ్రోకరేజీ రేట్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు, చట్టాలు లేవు. అందుకే ప్రతి లావాదేవీకి సంబంధించి కమిషన్‌ చెల్లించాల్సిన బాధ్యత కొనుగోలుదారు, డెవలపర్‌పై  లేదు. ఈ నేపథ్యంలో బ్రోకరేజీపై విధించే 18 శాతం జీఎస్‌టీ వసూలు బాధ్యత రియల్టర్లపై పడుతోంది. చాలా మంది సొంత జేబు నుంచి ఈ మొత్తం చెల్లిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సేవలను కూడా సాధారణ సర్వీసు ప్రొవైడర్ల వలే 5శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలి. దేశంలో దాదాపు 10 లక్ష మంది వరకు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు వల్ల చాలా మంది పన్ను చెల్లించేందుకు ఇష్టపడతారు. రియల్టర్లపై భారం తగ్గడంతోపాటు.. ప్రభుత్వానికి కూడా పన్ను ఆదాయం పెరుగుతుంది.

కొనుగోలుదారుల సెంటిమెంట్‌ దెబ్బతినకుండా..

కొవిడ్‌ సమయంలో ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం కోసం వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బాగా ఊతమిచ్చింది. గృహ రుణ వడ్డీరేట్లు బాగా తగ్గిపోయాయి. కానీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ధరలను కట్టడి చేయడానికి వడ్డీరేట్లను గణనీయంగా పెంచాల్సి వచ్చింది. ఇది కొనుగోలుదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను స్థిరీకరించాలని రియల్‌ ఎస్టేట్‌ రంగం కోరుకుంటోంది. దీనివల్ల గృహరుణాలపై ఇళ్లు కొన్న వారికి పెద్దగా మార్పులు లేని ఈఎంఐలు ఉంటాయి. ఈ పరిస్థితి చాలా మంది మధ్యతరగతి వారు గృహాలు కొనుగోలు చేసేట్లు ప్రోత్సహిస్తుంది. తరచూ మారిపోయే వడ్డీ రేట్ల వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్పెక్యూలేషన్‌ చేసేవారికే ప్రయోజనం లభిస్తుంది గానీ.. నిజంగా ఇళ్ల కొనుగోలుదార్లకు కాదు.

రియల్‌ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదా..

దేశ జీడీపీకి అత్యధిక ఆదాయం చేకూర్చే రెండో రంగం రియల్‌ఎస్టేట్‌. కానీ, ఇప్పటికీ ఇది అసంఘటిత రంగ హోదాలోనే ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం దీని నియంత్రణకు చాలా మార్పులు చేసింది. కానీ, పరిశ్రమ హోదా మాత్రం ఇవ్వలేదు. ఈ హోదా లభిస్తే పనులను మరింత వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా చేసే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు బడ్జెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ విద్యను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు నైపుణ్యం పెంచే కార్యక్రమాలు, మార్కెటింగ్‌ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ వంటివి నిర్వహించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఈ రంగం మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు.. చాలా మంది యువత ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదం చేస్తుంది.

ప్రాజెక్టు ఫైనాన్సింగ్‌కు ప్రభుత్వ సాయం..

ప్రస్తుతం ప్రాజెక్టు డెవలపర్లు కూడా దాదాపు 6-8శాతం మధ్య వడ్డీరేట్లకు రుణాలను తీసుకొంటున్నారు. ఇది గృహ రుణాల రేటుతో దాదాపు సమానంగా ఉంటోంది. ప్రభుత్వం ప్రాజెక్టు ఫైనాన్సింగ్‌ రంగంలో జోక్యం చేసుకోవాలి. ప్రాజెక్టులకు అవసరమైన రుణాలను తక్కువ వడ్డీకే ఇవ్వాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచించాలి. దీంతో ప్రాజెక్టు ఖర్చులు తగ్గించి అందుబాటు ధరల్లోనే ఇళ్లు వినియోగదారులకు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నీడలు కమ్ముకొన్న సమయంలో భారత్‌లో అతిపెద్ద రంగాల్లో ఒకటైన రియల్‌ ఎస్టేట్‌కు ఊతమివ్వాల్సి ఉంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు