Stock Market: పరిమిత శ్రేణిలో సూచీల పయనం.. మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు..

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల పయనం సోమవారం పరిమిత శ్రేణిలో సాగింది....

Updated : 17 Jan 2022 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల పయనం సోమవారం పరిమిత శ్రేణిలో సాగింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌  కీలక 61,000 మార్క్‌ను, నిఫ్టీ 18,300 మార్క్‌ను నిలబెట్టుకున్నాయి. 

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 61,219.64 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తొలి గంటలో సూచీలకు తీవ్ర ఊగిసలాట ఎదురైంది. తర్వాత కాస్త పుంజుకున్నా బుల్‌ ఆధిపత్యం మాత్రం స్పష్టంగా కనిపించలేదు. చివరకు 85.88 పాయింట్ల లాభంతో 61,308.91 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 61,385.48 - 61,107.60 మధ్య కదలాడింది. నిఫ్టీ 18,235.65 వద్ద ప్రారంభమైంది. రోజులో 18,321.55 - 18,228.75 మధ్య కదలాడింది. చివరకు 52.35 పాయింట్ల స్వల్ప లాభంతో 18,308.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌30 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు

అంచనాలు నిజమయ్యాయి...

ఈ నెలలో ఇప్పటికే సూచీలు 5 శాతం వరకు పెరిగాయి. దీంతో ఈ వారం సూచీలు పరిమిత స్థాయిలోనే కదలాడొచ్చన్న విశ్లేషకుల అంచనాలు ఈరోజు నిజమయ్యాయి. సానుకూల పరిణామాలున్నా గరిష్ఠాల వద్ద సూచీలకు నిరోధం ఎదురైంది. కొన్ని దిగ్గజ కంపెనీల అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాల ఇప్పటికే వెలువడ్డాయి. మరికొన్నింటి ఫలితాలు ఈ వారంలో వెల్లడి కానున్నాయి. వీటి నుంచి అందిన సానుకూల సంకేతాలు సూచీలను లాభాల్లో నిలిపాయి. మరోవైపు ప్రీ-బడ్జెట్‌ ర్యాలీ కూడా సూచీలు ఇంకా సానుకూలంగా కదలడానికి దోహదం చేశాయి. చైనాలో వడ్డీరేట్లలో కోత కూడా సూచీలకు కొంత మేర కలిసొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు కొంత వరకు సానుకూలంగా కదలాడాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* హెచ్‌సీఎల్‌ టెక్‌ మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో కంపెనీ షేర్లు 22 నెలల కనిష్ఠానికి చేరాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎబిట్‌ (EBIT) మార్జిన్‌ 19.1 శాతం వద్ద ఫ్లాట్‌గా నమోదు కావడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. దీంతో ఈరోజు కంపెనీ షేరు విలువ 5.87 శాతం నష్టంతో రూ.1258.75 వద్ద స్థిరపడింది.

* గత నెల స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన మెట్రో బ్రాండ్స్‌ షేర్లు ఈరోజు 20 శాతం లాభాల వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. నిన్న వెలువడిన మూడో త్రైమాసిక ఫలితాలు అద్భుతంగా ఉండడమే ఇందుకు కారణం. కంపెనీ లాభాల్లో 54.63 శాతం వృద్ధి నమోదైంది.  

* టాటా మోటార్స్‌ షేర్లు ఈరోజు రెండు వారాల గరిష్ఠానికి చేరాయి. విద్యుత్తు వాహనాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయనుందన్న వార్తలు షేరు పెరుగుదలకు కారణమైంది. 

* అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి. మూడో త్రైమాసిక ఫలితాలు మదుపర్లు మెప్పించడమే ఇందుకు కారణం. చివరకు 2.07 శాతం పెరిగి రూ.7,870 వద్ద స్థిరపడింది.     

* చక్కెర ఉత్పత్తి అక్టోబర్‌-జనవరి మధ్య వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగింది. దీంతో ఈరోజు షుగర్‌ కంపెనీ స్టాక్స్‌ రాణించాయి.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఈరోజు 2 శాతం మేర కుంగాయి. శనివారం వెలువడిన త్రైమాసిక ఫలితాల్లో మార్జిన్ల వృద్ధి నెమ్మదిగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని