Stock Market: మార్కెట్‌ సూచీల ‘చమురు’ వదిలింది!

గత కొన్ని రోజులుగా లాభాల్లో దూసుకెళ్తున్న సూచీల పరుగుకు నేడు బ్రేక్‌ పడింది. టెలికాం, ఆటో, స్థిరాస్తి, లోహ, ఐటీ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడం సూచీలను కిందకు దిగజార్చింది....

Updated : 18 Jan 2022 16:09 IST

ముంబయి: గత కొన్ని రోజులుగా లాభాల్లో దూసుకెళ్తున్న సూచీల పరుగుకు మంగళవారం బ్రేక్‌ పడింది. టెలికాం, ఆటో, స్థిరాస్తి, లోహ, ఐటీ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడం సూచీలను కిందకు దిగజార్చింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ కీలక 61,000 మార్క్‌ను కోల్పోయింది. 

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 61,430.77 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. తర్వాత ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. చివరకు 554.05 పాయింట్లు కోల్పోయి 60,754.86 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 61,475.15 - 60,662.57 మధ్య కదలాడింది. నిఫ్టీ 18,337.20 వద్ద ప్రారంభమైంది. రోజులో 18,350.95 - 18,105.00 మధ్య కదలాడింది. చివరకు 195.05 పాయింట్ల నష్టంతో 18,113.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌30 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు

సూచీలను ఆయిల్‌ ముంచేసింది..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు ఈరోజు సూచీలపై ప్రభావం చూపాయి. ఉదయం సానుకూలంగా కదలాడిన ఆసియా మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ నేలచూపులు చూశాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.  అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు అదే బాటలో పయనించాయి. మరోవైపు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు నిన్న బాగా రాణించాయి. దీంతో నేడు ఆయా రంగాల్లో మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు ఈ నెలలో ఇప్పటి వరకు సూచీలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. వీటికి ముడి చమురు ధరల పెరుగుదల తోడు కావడంతో చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర ఏడేళ్ల గరిష్ఠానికి చేరి 87 డాలర్లను తాకింది. ఈ పరిణామాలే సూచీలను నేడు కిందకు లాగాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* నిఫ్టీ ఆటో సూచీలోని అన్ని షేర్లు డీలా పడ్డాయి. మారుతీ సుజుకీ, ఐషర్‌ మోటార్స్‌ భారీగా నష్టపోయాయి.

* నిఫ్టీ ఐటీ సూచీలోనూ అన్ని షేర్లు నష్టపోయాయి. కోఫోర్జ్‌ లిమిటెడ్‌, మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా భారీగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. నిఫ్టీ మెటల్‌ సూచీలోనూ అన్ని షేర్లు డీలా పడడం గమనార్హం.

* వరుసగా గత 13 సెషన్లలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 45 శాతం లాభపడ్డాయి.

* రోబోటిక్స్‌ స్టార్టప్‌ యాడ్‌వర్బ్‌లో రిలయన్స్‌ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.980.2 కోట్లు.

* మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 9 శాతం మేర నష్టపోయాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ లాభాల్లో 4.7 శాతం క్షీణత కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని