Stock Market: సెన్సెక్స్ 4 రోజుల్లో 2270 పాయింట్లు పతనం‌

శీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన శుక్రవారమూ భారీ నష్టాల్లో ముగిశాయి.....

Updated : 22 Jan 2022 08:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన శుక్రవారమూ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు సూచీలను కిందకు లాగాయి.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 59,039.37 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఓ దశలో 840 పాయింట్లకు పైగా పతనమై 58,620.93 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 427.44 పాయింట్లు కోల్పోయి 59,037.18 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 59,329.63 - 58,620.93 మధ్య కదలాడింది. నిఫ్టీ 17,613.70 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. రోజులో 17,707.60 - 17,485.85 మధ్య కదలాడింది. చివరకు 139.85 పాయింట్ల నష్టంతో 17,617.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌30 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు

పతనానికి ఐదు ప్రధాన కారణాలు..

గత 4 రోజుల్లో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8 లక్షలకు పైగా కుంగడం గమనార్హం. ఈ పతనానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి.

* అంతర్జాతీయ మార్కెట్లు..: అంతర్జాతీయ మార్కెట్లు గతకొన్ని రోజులుగా దిద్దుబాటులో ఉన్నాయి. మరోవైపు వడ్డీరేట్లు పెంచుతామన్న ఫెడ్‌ ప్రకటనతో పదేళ్ల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో మదుపర్లు బంగారం, కరెన్సీ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లారు. ఆసియా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. 

* దేశీయంగా వడ్డీరేట్ల పెంపు: అమెరికాలోనే కాదు దేశీయంగానూ వడ్డీరేట్ల పెంపు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బ్యాంకులు రాత్రికి రాత్రి రుణాలు తెచ్చుకునే కాల్‌ మనీ వడ్డీరేటు 4.55 శాతానికి చేరుకుంది. గత నెల ఇది సగటున 3.25-3.55 శాతం మధ్య ఉంది. కాల్‌ మనీ రేటుతో పాటు ‘ట్రై పార్టీ రెపో డీలింగ్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌’ రేటు సైతం 3.5 నుంచి 4.24 శాతానికి చేరింది. మరోవైపు ఇటీవల ఐసీఐసీఐ, ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను స్వల్పంగా పెంచాయి. ఇవన్నీ దేశీయంగా రేట్ల పెంపునకు సంకేతాలని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

* ఎఫ్‌ఐఐల అమ్మకాలు: పోర్ట్‌ఫోలియో సవరణలో భాగంగా విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) ఇంకా అమ్మకాలకు దిగుతున్నారు. అధిక విలువ వద్ద ట్రేడవుతున్న భారత మార్కెట్ల నుంచి డబ్బును ఇతర మార్కెట్లకు తరలిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌ఐఐలు రూ.1 లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిపారు. 

* డిమాండ్‌లో మందగమనం: వాస్తవానికి ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన చాలా కంపెనీలు అంచనాలను అందుకున్నాయి. అయితే, మార్జిన్లపై ఒత్తిడి ఉన్నట్లు మాత్రం స్పష్టంగా కనిపించింది. దీంతో కంపెనీల లాభాలు కొంత మేర దెబ్బతిన్నట్లు అర్థమైంది. ఇక అద్భుతమైన ఫలితాలు ప్రకటించిన ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్‌.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వినిమయం పుంజుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం గల కుటుంబాలు సైతం మహమ్మారి వల్ల ప్రభావితమయ్యాయని బజాజ్ ఫైనాన్స్‌ పేర్కొంది. దీంతో డిమాండ్‌ ఇంకా పుంజుకోవాల్సి ఉందన్న సంకేతాలు మూడో త్రైమాసిక ఫలితాల నుంచి వెలువడింది.

* రష్యా-ఉక్రెయిన్‌ వివాదం: రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. అమెరికాలో తయారైన ఆయుధాలను ఉక్రెయిన్‌ సరిహద్దులకు తరలించేందుకు బాల్టిక్‌ దేశాలకు అగ్రరాజ్యం అనుమతినిచ్చింది. మరోవైపు రష్యా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరులో రూ.2,300 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఫలితాలు మెప్పించడంతో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 2.5 శాతం వరకు లాభపడ్డాయి.

* మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో ప్రముఖ బయోటెక్‌ సంస్థ బయోకాన్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 3.5 శాతం వరకు లాభపడ్డాయి. 

* షాపర్స్‌ స్టాప్‌ కంపెనీ షేర్లు ఈరోజు ఓ దశలో 17 శాతం వరకు లాభపడి 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మూడో త్రైమాసిక ఫలితాలు బలంగా నమోదు కావడమే ఇందుకు కారణం. అమ్మకాల ఒత్తిడితో చివరకు 4 శాతం లాభాల వద్ద స్థిరపడింది.  

* ఇక హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పాలీక్యాబ్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడమే ఇందుకు కారణం. 

* ఈరోజు వెలువడిన ఎస్‌బీఐ లైఫ్‌ ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. దీంతో ఉదయం నుంచి నష్టాల్లో చలించిన షేరు చివరి అరగంటలో లాభాల్లోకి ఎగబాకింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో 10 షేర్లు లాభపడగా.. 20 షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని