ప‌న్ను ఆదా కొర‌కు కొన్ని కీల‌క పెట్టుబ‌డులు

సెక్ష‌న్ 80సీ (ఆర్ధిక సంవ‌త్స‌రంలో గ‌రిష్ట మొత్తం ఆదా రూ. 1.5 ల‌క్ష‌లు) కింద మీకు అందుబాటులో ఉన్న కొన్ని పెట్టుబ‌డి ఎంపిక‌లు ఇక్క‌డ ఉన్నాయి.

Updated : 26 Mar 2022 12:24 IST

సీనియ‌ర్ సిటిజ‌న్లు, పెన్ష‌న‌ర్లు, ఇత‌రులు ఈ మార్చి 31 వ‌ర‌కు ప‌న్ను ఆదా చేయాల‌ని చూస్తున్న ప‌న్ను చెల్లింపుదారులకు చివ‌రి నిమిషంలో కొన్ని ప‌న్ను ఆదా చిట్కాలు ఇక్క‌డ ఉన్నాయి. ప‌న్ను ఆదా కోసం వెతుకుతున్న‌ట్ల‌యితే సెక్ష‌న్ 80సీ (ఆర్ధిక సంవ‌త్స‌రంలో గ‌రిష్ట మొత్తం ఆదా రూ. 1.50 ల‌క్ష‌లు) కింద మీకు అందుబాటులో ఉన్న కొన్ని పెట్టుబ‌డి ఎంపిక‌లు ఇక్క‌డ ఉన్నాయి. వాటిలో కొన్ని ఒకేసారి పెట్టుబ‌డి పెట్టేవి కాగా మ‌రికొన్ని రెగ్యుల‌ర్‌గా పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌):

ఇది చాలా ప్ర‌జాద‌ర‌ణ పొందిన పెట్టుబ‌డి ప‌థ‌కం. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి 60 ఏళ్లు పైబ‌డిన వారు మాత్ర‌మే అర్హులు. ఇది ప్ర‌స్తుతం సంవ‌త్స‌రానికి 7.40% వ‌డ్డీ అంద‌చేస్తూ ప్ర‌తి 3 నెల‌ల‌కు సాధార‌ణ త్రైమాసిక ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని అందిస్తుంది. ఒక‌రు గ‌రిష్టంగా రూ. 15 ల‌క్ష‌లు వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వచ్చు. ఈ ప‌థ‌కంలో డిపాజిట్ కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు, మ‌రో 3 సంవ‌త్స‌రాలు పొడిగించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం అందించే అన్ని ఇత‌ర స్థిరాదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ప‌థ‌కాల‌తో పోలిస్తే `ఎస్‌సీఎస్ఎస్‌` అత్య‌ధిక రాబ‌డిని అందిస్తుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌మ్ స్కీమ్ (పీఓఎంఐఎస్‌):

ప‌్ర‌స్తుతం ఈ ప‌థ‌కం వ‌డ్డీ రేటు 6.60%. దీని రాబ‌డిపై ప‌న్ను విధించ‌బ‌డుతుంది. గ‌రిష్ట పెట్టుబ‌డి ఒకే ఖాతాలో రూ. 4.50 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో అయితే రూ. 9 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ప్ర‌తి నెలా వ‌డ్డీ అంద‌చేయ‌బ‌డుతుంది.

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్లు (ఎన్ఎస్‌సీ):

పోస్టాఫీస్ నుండి ఈ స‌ర్టిఫికెట్లు కొనుగోలు చేయాలి.  ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 6.80%, కాల‌వ్య‌వ‌ధి 5 సంవ‌త్స‌రాలు. పెట్టుబ‌డిపై గ‌రిష్ట ప‌రిమితి లేదు. క‌నీస పెట్టుబ‌డి రూ. 1000. మెచ్యూరిటీపై పూర్తిగా ప‌న్ను విధించ‌ద‌గిన వ‌డ్డీ చెల్లించ‌బ‌డుతుంది.

ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న (పీఎంవీవీవై):

ఇది `ఎల్ఐసీ`చే నిర్వ‌హించ‌బ‌డే 10 సంవ‌త్స‌రాల ప్ర‌భుత్వ ప‌థ‌కం. ఇది నెల‌వారీ పెన్ష‌న్‌కు హామీ ఇస్తుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ 7.40%. క‌నిష్ట పెట్టుబ‌డి రూ. 1.5 ల‌క్ష‌లు, గ‌రిష్ట పెట్టుబ‌డి రూ. 15 ల‌క్ష‌లు. పెన్ష‌న్‌పై ప‌న్ను విధించ‌బ‌డుతుంది.

5 సంవ‌త్స‌రాల ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు):

అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు కూడా 5 ఏళ్ల లాక్‌-ఇన్‌తో ప‌న్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను అందిస్తున్నాయి. బ్యాంక్‌లో వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతం 5.75-7% ఉండ‌గా, పోస్టాఫీసులో దీని వ‌డ్డీ రేటు 6.70%. స్వీక‌రించిన వ‌డ్డీపై ప‌న్ను విధించ‌బ‌డుతుంది. అయితే, ముంద‌స్తు న‌గ‌దు చెల్లింపు అనుమ‌తించ‌బ‌డ‌దు.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌):

ఇది దీర్ఘ‌కాలిక పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కం. ఈ ప‌థ‌క పూర్తి కాల‌వ్య‌వ‌ధి 15 సంవ‌త్స‌రాలు. సంవ‌త్స‌రానికి క‌నిష్ట పెట్టుబ‌డి రూ. 500, గ‌రిష్ట పెట్టుబ‌డి రూ. 1.50 ల‌క్ష‌లు. మెచ్యూరిటీ త‌ర్వాతే దీని పెట్టుబ‌డి, వ‌డ్డీ మొత్తం పొంద‌గ‌ల‌రు. అయితే 6వ సంవ‌త్స‌రం నుండి నిబంధ‌న‌ల ప్ర‌కారం పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌డానికి అనుమ‌తి ఉంటుంది. ఈ ప‌థ‌కంలో మెచ్యూరిటీ రాబ‌డి మొత్తంపై ప‌న్ను ఉండ‌దు.

నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌):

ఇది `పీఎఫ్ఆర్‌డీఏ` నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏడుగురు ఫండ్ మేనేజ‌ర్‌ల‌చే నిర్వ‌హించ‌బ‌డే పెన్ష‌న్ ప‌థ‌కం. ప‌న్ను ఆదా రూ. 2 ల‌క్ష‌లు (సెక్ష‌న్స్ 80సీ, 80సీసీడీ (1బీ) కింద‌). ప్ర‌వేశ వ‌య‌స్సు గ‌రిష్టంగా 70 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. అయితే, 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌ర్వాత స్కీమ్‌లోకి ప్ర‌వేశం చేసిన‌ట్ల‌యితే 3 సంవ‌త్స‌రాల ముందుగానే ఉప‌సంహ‌ర‌ణ చేయ‌వ‌చ్చు. రిస్క్‌, భ‌ద్ర‌త మొత్తం ఖాతాదారుడిపై ఆధార‌ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి ఇది ప్రాథ‌మికంగా సాధార‌ణ పెన్ష‌న్ పొంద‌డానికి, అధిక ప‌న్ను ఆదా ప‌రిమితుల‌తో కూడిన పెట్టుబ‌డి ప‌థ‌కం.

మ్యూచువ‌ల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్:

ఈఎల్ఎస్ఎస్ (ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌) అని పిలుస్తారు. ఇది 100% ఈక్విటీ ప‌థ‌కం. పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బుకు 3 సంవ‌త్స‌రాల వ్య‌క్తిగ‌త లాక్‌-ఇన్ ఉంటుంది. 3 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ త‌ర్వాత‌, ఎవ‌రైనా పెట్టుబ‌డి ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు లేదా కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే, ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుందని గమనించండి. కాబట్టి, ఇక మొత్తం లో ఇందులో పెట్టుబడి చేయడం మంచిది. ఈక్విటీ లో దీర్ఘకాలం పాటు మదుపు చేసే వాళ్ళు మాత్రమే ఈ పధకం ఎంచుకోవడం మేలు. పైగా, వీటి పని తీరు గత కొద్దేళ్లుగా అంతగా బాలేదని చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలనుకునే వారు ఇండెక్స్ ఫండ్స్, మిడ్ కాప్ ఫండ్స్ పరిశీలించవచ్చు.

మ‌రిన్ని ప‌న్ను ఆదా మార్గాలు:

ఆరోగ్య బీమా సెక్ష‌న్ 80డీ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ. 50 వేల వ‌ర‌కు అద‌న‌పు ప‌న్ను ఆదాను అందిస్తుంది. మీ ఆదాయం రూ. 2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ర‌హితం. 80 ఏళ్లు పైబ‌డిన వారికి ఈ ప‌రిమితి రూ. 5 ల‌క్ష‌లు. ప్రామాణిక తగ్గింపు కింద రూ. 50 వేల మినహాయింపు అందరికీ ఉంటుంది. ప‌న్ను కోసం ఎంత ఎక్కువ ఆదా చేసుకోవాలో లెక్కించేట‌ప్పుడు, మీ జీవిత బీమా ప్రీమియంలు, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు చెల్లించే ట్యూష‌న్ ఫీజు, ఇంటి కోసం తీసుకున్న గృహ రుణం లాంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని