GST: జీఎస్‌టీకి జీవం పోసిన వ్యక్తులు వీరే..!
జీఎస్‌టీ కార్యరూపం దాల్చడం వెనుక అనేక మంది ప్రముఖుల కృషి దాగి ఉంది. వారెవరు? జీఎస్‌టీ (GST) అమలుకు నోచుకోవడంలో వారి పాత్రేంటో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశ చరిత్రలోనే అతి పెద్ద పన్నుల సంస్కరణ అయిన వస్తు, సేవల పన్ను (GST) విధానం అమల్లోకి వచ్చి జూన్ 30, 2022తో ఐదేళ్లు పూర్తయింది. అనేక ఆందోళనలు, సందేహాలు, అనుమానాల మధ్య ప్రారంభమైన ఈ కొత్త పన్ను విధానం క్రమక్రమంగా అన్ని అడ్డంకులనూ అధిగమిస్తూ వస్తోంది. పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురావడంలో జీఎస్‌టీ (GST) విజయవంతమైందని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు మాత్రం ఇంకా అనేక మార్పులు చేయాల్సి ఉందని సూచిస్తున్నారు. ఈ కొత్త పన్ను పద్ధతి కార్యరూపం దాల్చడం వెనుక అనేక మంది ప్రముఖుల కృషి దాగి ఉంది. వారెవరు? జీఎస్‌టీ (GST) అమలుకు నోచుకోవడంలో వారి పాత్రేంటో చూద్దాం..
చిదంబరం: యూపీఏ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం 2006లో జీఎస్‌టీ (GST) అమలుకు తొలి డెడ్‌లైన్‌ను విధించారు. ఏప్రిల్ 2010కల్లా కొత్త పన్ను విధానం అమల్లోకి రావాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి వ్యాట్‌పై ఓ శ్వేతపత్రాన్నీ విడుదల చేశారు.
విజయ్ ఖేల్కర్: ఈయనను జీఎస్టీ రూపకర్తగా పేర్కొంటుంటారు. దేశవ్యాప్తంగా క్లిష్టంగా మారిన పరోక్ష పన్ను వ్యవస్థను సరళీకరించడానికి జీఎస్‌టీని అమల్లోకి తీసుకురావాలని 2009లో విజయ్ ఖేల్కర్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ తొలిసారి సూచించింది. 13వ ఆర్థిక సంఘం ద్వారా ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్ అన్ని వస్తు, సేవలపై 12 శాతం జీఎస్టీ విధించాలని సిఫార్సు చేసింది. దీన్ని 5 శాతం సీజీఎస్‌టీగా, 7 శాతం ఎస్‌జీఎస్‌టీగా విభజించాలని సూచించింది.
అసీం దాస్‌గుప్తా: వామపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో ఈయన పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జీఎస్‌టీ అమలు నిమిత్తం ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల తొలి కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. జీఎస్‌టీ అమలుకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను ఓ కొలిక్కి తీసుకురావడంలో అసీ దాస్‌గుప్తా కీలక పాత్ర పోషించారు.
ప్రణబ్ ముఖర్జీ: జీఎస్‌టీ అమలుకు తొలి డెడ్‌లైన్ సమీపించిన సమయంలో ప్రణబ్ ముఖర్జీయే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ సమయానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఏప్రిల్ 2011ను తదుపరి గడువుగా నిర్ణయించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీఎస్‌టీ బిల్లుపై ఈయన సంతకం చేయడంతో అది చట్టరూపం దాల్చింది.
అరుణ్ జైట్లీ: జీఎస్‌టీపై అన్ని రాష్ట్రాల సందేహాలు, అనుమానాలను కేంద్రం తరఫున నివృత్తి చేసి అందరి మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీదే కీలక పాత్ర అని చెబుతుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో సెప్టెంబరు 2016లో తొలి జీఎస్టీ మండలికి అధ్యక్షతన వహించిన ఆయన వివిధ వర్గాలు, రాష్ట్రాలు, ప్రాంతాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని జీఎస్‌టీని వాస్తవరూపంలోకి తీసుకొచ్చారు. అయితే, చాలా విషయాల్లో జైట్లీ రాజీపడ్డారని అంటుంటారు! అందుకే మూడు శ్లాబుల పన్ను విధానాన్ని ఐదు శ్లాబులకు తీసుకురావాల్సి వచ్చిందని చెబుతుంటారు.
హస్ముఖ్ అధియా: కేంద్ర ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేసిన హస్ముఖ్ జీఎస్‌టీకి సంబంధించిన అధికారిక కార్యకలాపాలను చూసుకున్నారు. అనేక రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయాలు, ఈ-వే బిల్స్, రిటర్నుల ఫైలింగ్ వ్యవస్థను చక్కబెట్టడం, నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీని ఏర్పాటు చేయడం వంటి వాటిలో ఈయన పాత్ర కీలకం.
అరవింద్ సుబ్రమణియన్: కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. మూడు శ్లాబుల పన్ను విధానాన్ని సిఫార్సు చేసిన కమిటీకి నేతృత్వం వహించారు.
నిర్మలా సీతారామన్: ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న సీతారామన్ జీఎస్‌టీ మండలి తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాలకు నేతృత్వం వహించారు. ముఖ్యంగా కొవిడ్-19 సంక్షోభం తర్వాత పన్ను విధానాన్ని సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రాలకు పరిహారం, పరిహారం సెస్సు కొనసాగింపు విషయంలో ఈమె ప్రస్తుతం కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
సుశీల్ మోదీ: బిహార్ ఆర్థికమంత్రిగా పనిచేసిన సుశీల్.. జీఎస్‌టీ అమల్లోకి రావడం కంటే ముందు నుంచీ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక మంత్రుల బృందాలకు నేతృత్వం వహించారు. కొత్త పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చడం కేంద్ర ప్రభుత్వ నైతిక బాధ్యత అని ప్రకటించి సొంతపార్టీ భాజపానే ఇరకాటంలోకి నెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 19,850 దిగువకు నిఫ్టీ
-
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం: బాలకృష్ణ
-
CPI: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో లోపాలు: సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
-
కృష్ణా తీరంలో అక్రమ కట్టడం?
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala: కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి