Updated : 17 Apr 2022 22:31 IST

Financial Planning: మార్చి 31 సమీపిస్తోంది.. ఈ పనులన్నీ పూర్తి చేశారా?

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే మన ప్రణాళికలూ సిద్ధం కావాలి. చివరి నిమిషం వరకూ వేచి చూడటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడుల్లాంటి అంశాల్లో ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పూర్తి చేయాల్సిన కొన్ని పనులేమిటో చూద్దామా..

పన్ను మినహాయింపు కోసం..

ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? దానికి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది అనే లెక్కలు వేసుకోవాలి. సెక్షన్‌ 80సీ కింద వర్తించే మినహాయింపులన్నీ వాడుకున్నారా? చూసుకోండి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, జాతీయ పింఛను పథకం, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇలా అనేక పథకాల్లో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోండి. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎస్‌ఎస్‌వై పథకాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే.. మార్చి 31లోపు తప్పనసరిగా కనీస మొత్తమైనా పెట్టుబడి పెట్టాలి.

రిటర్నుల దాఖలు..

గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21కి సంబంధించిన రిటర్నులు రుసుముతో సమర్పించేందుకు మార్చి 31 చివరి తేదీ. ఆ తర్వాత రిటర్నులను సమర్పించడం సాధ్యం కాదు. ఆడిట్‌ పరిధిలోకి వచ్చేవారు మార్చి 15 లోగా రిటర్నులు దాఖలు చేయాలి.

ఆధార్‌-పాన్‌ అనుసంధానం..

ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువుంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి. గడువు దాటితే పాన్‌ చెల్లకుండా పోయే ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కష్టమవుతుంది.

బ్యాంకులో కేవైసీ..

మీ బ్యాంకు ఖాతాలో మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలను పూర్తి చేయండి. పాన్‌, ఆధార్‌, చిరునామా ధ్రువీకరణలాంటివాటితోపాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలనూ మార్చి 31 లోపు అందించాలి. బ్యాంకు నుంచి మాట్లాతున్నామని వచ్చే ఫోన్లను నమ్మొద్దు. బ్యాంకు శాఖకు వెళ్లి మాత్రమే వివరాలు ఇవ్వండి.

వివాదాలుంటే..

‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకంలో భాగంగా ఏదైనా పన్ను బాకీ ఉంటే.. దానిని చెల్లించేందుకు మార్చి 31 వరకూ వ్యవధినిచ్చింది ఆదాయపు పన్ను విభాగం. ఇలా చెల్లించినప్పుడు వడ్డీతోపాటు, అపరాధ రుసుములనూ రద్దు చేస్తామని పేర్కొంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని