IPO: కీస్టోన్‌ రియల్టర్స్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.514- 541

త్వరలో ఐపీఓకి రానున్న కీస్టోన్‌ రియల్టర్స్‌ ధరల శ్రేణిని రూ.514- 541 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ నవంబరు 14న ప్రారంభమై నవంబరు 16న ముగియనుంది.

Published : 09 Nov 2022 16:42 IST

దిల్లీ: రుస్తోంజీ బ్రాండ్ పేరిట ప్రాపర్టీలను విక్రయించే కీస్టోన్‌ రియల్టర్స్‌ ఐపీఓ ధరల శ్రేణిని రూ.514- 541గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.635 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ నవంబరు 14న ప్రారంభమై నవంబరు 16న ముగియనుంది. రూ.560 కోట్లు తాజా షేర్ల విక్రయం ద్వారా.. మరో రూ.75 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచనున్నారు.

ప్రమోటర్లు బొమన్‌ రుస్తోం ఇరానీ రూ.37.5 కోట్లు విలువ చేసే షేర్లు, పెర్సీ సొరాబ్జీ చౌధరి, చంద్రేశ్‌ దినేశ్‌ మెహతా చెరో రూ.18.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్ని రూ.341.6 కోట్లను రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించనున్నారు. అలాగే మరికొన్ని నిధుల్ని ఫ్యూచర్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ కొనుగోలుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడుకోనున్నారు. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో సగం షేర్లు అర్హతగల సంస్థాగత మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు కేటాయించనున్నారు. కనీసం 27 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 

కీస్టోన్‌ రియల్టర్స్‌ను 1995లో స్థాపించారు. ఇప్పటి వరకు 32 ప్రాజెక్టులను పూర్తిచేశారు. 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 19 ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ ‘ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (MMR)’ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో ప్రీమియం గేటెడ్‌ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, కార్పొరేట్‌ పార్క్‌లు, రిటైల్‌ స్థలాలు, స్కూళ్లు, ఐకానిక్‌ ల్యాండ్‌మార్క్‌లు ఉన్నాయి.

* దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ముథూట్‌ మైక్రోఫిన్‌ ఐపీఓకి వచ్చే యోచనలో ఉందని కంపెనీ ఎండీ థామస్‌ ముథూట్‌ తెలిపారు. రూ.1,500- 1,800 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. 2023 మే నెలలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని