పెట్టుబడి... సూచీ షేర్లలో సరిసమానంగా

ఎంతో కాలంగా పెట్టుబడి విధానాలు మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజ్‌ విధానం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక ఫ్రీ ఫ్లోట్‌ ‘మార్కెట్‌ కేపిటలైజేషన్‌’ ఉన్న షేర్లకు ఈ విధానంలో అధిక వెయిటేజీ లభిస్తుంది.

Updated : 26 May 2023 03:13 IST

ఎంతో కాలంగా పెట్టుబడి విధానాలు మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజ్‌ విధానం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక ఫ్రీ ఫ్లోట్‌ ‘మార్కెట్‌ కేపిటలైజేషన్‌’ ఉన్న షేర్లకు ఈ విధానంలో అధిక వెయిటేజీ లభిస్తుంది. కానీ ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు దీనికి భిన్నంగా సూచీల్లోని అన్ని షేర్లకు సమానమైన వెయిటేజీ ఇస్తాయి. తద్వారా స్ధిరమైన ప్రతిఫలాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది.

సూచీల్లోని (ఇండెక్స్‌) ప్రతి షేరుకూ సమాన ప్రాధాన్యం ఇవ్వటమనేది ఈక్వల్లీ వెయిటెడ్‌ విధానంలోని వినూత్నమైన అంశం. మనదేశంలోని అత్యంత ఆదరణీయమైన నిఫ్టీ 50 ఇండెక్స్‌కు వర్తింపచేస్తే పెట్టుబడులపై అనూహ్యమైన ప్రతిఫలం లభిస్తుంది. దీనివల్ల ఎన్నో పరీక్షలకు తట్టుకొని నిలిచిన ఎంతో బలమైన కంపెనీలపై పెట్టుబడి పెడితే లభించే ప్రయోజనాలను పొందటంతో పాటు, అధిక ఫ్రీ-ఫ్లోట్‌ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ ఉన్న కొన్ని అప్రధాన కంపెనీలకు అధికంగా పెట్టుబడులను మళ్లించి నష్టపోయే పరిస్థితిని నివారించినట్లు అవుతుంది. కొన్ని షేర్లలోనే పెట్టుబడులను కేంద్రీకరించటం లేదా రెండు మూడు రంగాలకు అధికంగా పెట్టుబడులు కేటాయించటాన్నీ అదుపు చేయవచ్చు.

రుజువైన విధానం..

ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ అనే పెట్టుబడి విధానం తొలిసారిగా యూఎస్‌లో ‘ఎస్‌అండ్‌పీ 500 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌’తో 2000 సంవత్సరంలో మొదలైంది. ఆ తర్వాత అన్ని దేశాల్లో దీన్ని అనుసరించారు. మనదేశంలో 2017లో నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఆధారంగా తొలి ఫండ్‌ వచ్చింది. గత కొన్నేళ్లుగా చూస్తే, ఎస్‌అండ్‌పీ 500 తో పాటు ఇతర ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌లు దీర్ఘకాలంలో మార్కెట్‌ కేపిటలైజేషన్‌ వెయిటేజ్‌ ఆధారిత ఫండ్ల కంటే మెరుగైన లాభాలు ఆర్జించాయి. అదే విధంగా నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిటెడ్‌ ఇండెక్స్‌ దీర్ఘకాలంలో, నిఫ్టీ 50 ఇండెక్స్‌ కంటే ఏటా సగటున 2 శాతం అధిక ప్రతిఫలాన్ని నమోదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. స్వల్పకాలిక ఫలితాలను విశ్లేషిస్తే, గత 23 ఏళ్ల కాలంలో 14 ఏళ్లలో నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ అధిక పనితీరును ప్రదర్శించింది. ఇంకా చూస్తే- స్టాక్‌మార్కెట్లో ‘డీపోలరైజేషన్‌’ ధోరణి ఉన్న కాలంలో ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఇంకా ఎక్కువ ప్రతిఫలాన్ని నమోదు చేసిన విషయం గమనార్హం. మార్కెట్లో కేంద్రీకృత ధోరణి ఉన్నప్పుడు, ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ ఉన్న షేర్లు లాభపడతాయి. కానీ డీపోలరైజేషన్‌ సమయంలో అన్ని షేర్ల ధరలు పెరుగుతాయి. అందువల్ల ‘డీపోలరైజేషన్‌’ సందర్భాల్లో ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ పథకాలు ఆకర్షణీయంగా మారతాయి. 2009లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆర్థిక మాంద్యం తర్వాత, తదుపరి 2020లో కొవిడ్‌- 19 తర్వాత స్టాక్‌ మార్కెట్లో వచ్చిన ర్యాలీల్లో ఇదే కనిపించింది.

మిశ్రమ పెట్టుబడులు...

మీరు మీ పెట్టుబడుల విలువను బహుముఖంగా పెంచుకోవాలనుకుంటే, రెండు ప్రాథమిక పెట్టుబడి సూత్రాలను అనుసరించాలి. అవి- ప్రధానమైన కంపెనీల షేర్లపై పెట్టుబడి పెట్టటం, వివిధ రంగాలకు చెందిన విభిన్నమైన కంపెనీలను ఎంచుకోవటం. ఈ విధానం, మార్కెట్‌ క్యాప్‌ ఇండిసిస్‌ ఆధారిత పెట్టుబడుల విధానం కంటే మేలైనది. అదే సమయంలో పెట్టుబడి వ్యయమూ తక్కువగా ఉంటుంది.

కార్పొరేట్‌ ట్రెజరీలు, ఎగ్జంప్ట్‌ పీఎఫ్‌ ట్రస్ట్‌లు వంటి సంస్థాగత మదుపరులకు ఈక్వల్‌ వెయిటెడ్‌ విధానమే మేలు. మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజ్‌ పద్ధతి కంటే తక్కువ రిస్కు, అధిక ప్రతిఫలం ఈ విధానంలో కనిపిస్తాయి. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యమూ ఉంటుంది. అంతేగాక ‘ఇండెక్స్‌ ఇన్వెస్టింగ్‌’ ఎంతో సులువు. ఎంతో మేలైన పెట్టుబడి విధానం. అందువల్ల ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్లు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండటం తప్పనిసరి అని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని మేం ఎన్నో సందర్భాల్లో, ‘లెట్స్‌ఇండెక్స్‌’ వంటి మదుపరులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో విశదీకరించాం.

ఈక్వల్‌ వెయిట్‌ విధానం, ఒకే ఒక మూల సూత్రాన్ని అనుసరిస్తుంది. మీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని షేర్ల ధరలు పెరగాలి, తద్వారా మీరు లాభ పడాలి, తద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలి- ఇదే ఈ విధానంలోని గొప్పతనం. ఈ సూత్రాన్ని పాటించటం, తద్వారా మీరు నిర్దేశించుకున్న పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోండి.


* ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు దీర్ఘకాలిక సంపద సృష్టించటమే లక్ష్యంగా పెట్టుబడుల్లో సమతౌల్యాన్ని పాటిస్తాయి. కేంద్రీకృత పెట్టుబడులను నివారిస్తాయి. ఒక ఇండెక్స్‌లోని అన్ని షేర్లకు సమానంగా ప్రాధాన్యాన్ని ఇస్తాయి. తద్వారా నష్టభయాన్ని తగ్గించుకుంటాయి.

* నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌, ఎన్నో ఏళ్లుగా నిఫ్టీ 50 ఇండెక్స్‌ను మించిన ప్రతిఫలాన్ని నమోదు చేస్తోంది. 1999 నుంచి 2022 వరకూ నిఫ్టీ 50 కంటే, నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌, సగటు 2 శాతం అధిక వార్షిక ప్రతిఫలాన్ని ఇచ్చింది.

* ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు, స్టాక్‌మార్కెట్‌ స్థితిగతుల ఆధారంగా వివిధ సందర్భాల్లో భిన్నమైన పనితీరును ప్రదర్శిస్తాయి.

* మదుపరుల పోర్ట్‌ఫోలియోలో ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు చేర్చటం వల్ల గరిష్ఠంగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్‌ ట్రెజరీలు, ఎగ్జంప్ట్‌ పీఎఫ్‌ ట్రస్ట్‌లు వంటి సంస్థాగత మదుపరులకు ఈ ఫండ్లు తప్పనిసరి. మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజీ ఆధారిత పెట్టుబడుల విధానం కంటే మెరుగైనది. రిస్కును తగ్గించుకోవటానికి, లాభాలు పెంచుకోవటానికి వీలుకల్పిస్తుంది.

* ‘ఇండెక్స్‌ ఇన్వెస్టింగ్‌’ ఎంతో సులువైన ప్రక్రియ. అదే సమయంలో ఎంతో మేలైన పెట్టుబడి విధానం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్లు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండటం తప్పనిసరి.

అనిల్‌ గెలాని, సీఎఫ్‌ఏ, హెడ్‌ ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రోడక్ట్స్‌ డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు