KFin Tech IPO: కెఫిన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు సెబీ అనుమతి

కెఫిన్‌ టెక్‌ త్వరలో ఐపీఓకి రానుంది. ఇందుకు మార్చి 31న సెబీకి దరఖాస్తు చేసుకోగా.. గురువారం మార్కెట్‌ నియంత్రణా సంస్థ ఆమోదం తెలిపింది.

Published : 10 Nov 2022 16:49 IST

దిల్లీ: ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ కెఫిన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2,400 కోట్ల సమీకరణకు మార్చి 31న కెఫిన్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో ఈ పబ్లిక్‌ ఇష్యూలో వచ్చే నిధులన్నీ షేర్లు విక్రయించనున్న ప్రమోటర్ల చేతికి వెళ్లనున్నాయి. ఆర్థిక సంస్థలకు కావాల్సిన సాంకేతిక సేవలను కెఫిన్‌ అందిస్తోంది. మలేషియా, ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌లోని ప్రైవేటు రిటైర్‌మెంట్‌ స్కీములకు కూడా పనిచేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, కొటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, జే.పీ.మోర్గాన్‌ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జెఫరీస్‌ ఇండియా ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

కెఫిన్‌ టెక్‌లో ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు 74.94 శాతం వాటాలున్నాయి. గతవారమే కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ 9.98 శాతం వాటాలను కొనుగోలు చేసింది. భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు సాంకేతికత సహకారం అందిస్తున్న అతిపెద్ద కంపెనీగా కెఫిన్‌ కొనసాగుతోంది. భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్లను నిర్వహిస్తున్న దాదాపు 42 ‘ఆస్తుల నిర్వహణ సంస్థ (AMC)’ల్లో దాదాపు 25 కంపెనీలకు కెఫిన్‌ తన సేవల్ని అందిస్తోంది. అంటే దాదాపు 60 శాతం మార్కెట్‌ షేర్‌ను కలిగి ఉంది. 2021 డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో కెఫిన్‌ ఆదాయం 35 శాతం పెరిగి రూ.458 కోట్లుగా నమోదైంది. నికర లాభాలు 313 శాతం పుంజుకొని రూ.97.6 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని