Kia EV6: ఒక్క ఛార్జింగ్‌తో 528 కి.మీల ప్రయాణం.. కియా ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది..!

దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా (Kia India).. దేశీయ విద్యుత్‌ కార్ల విపణిలోకి అడుగుపెట్టింది. EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్‌ కారును గురువారం

Updated : 22 Nov 2022 14:14 IST

దిల్లీ: దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా (Kia India).. దేశీయ విద్యుత్తు కార్ల విపణిలోకి అడుగుపెట్టింది. EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్‌ కారును గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.59.95 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. రెండు ట్రిమ్‌ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. జీటీ ఆర్‌డబ్ల్యూడీ (రేర్‌ వీల్‌ డ్రైవ్‌) ధర రూ.59.95లక్షలు (ఎక్స్‌ షోరూం). ఏడబ్ల్యూడీ(ఆల్‌ వీల్‌ డ్రైవ్‌) వెర్షన్‌ ధర రూ.64.96లక్షలు (ఎక్స్‌ షోరూం)గా ఉంది.

ఈ సందర్భంగా కియా ఇండియా (Kia India) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ తే జిన్‌ పార్క్‌ మాట్లాడుతూ.. ‘‘విద్యుత్తు వాహనాల రంగంలో మా విస్తృతిని పెంచుకునేందుకు రానున్న రోజుల్లో మరిన్ని పెట్టబడులు పెట్టనున్నాం. 2025 నాటికి భారత్‌లోనే తయారుచేసిన విద్యుత్తు వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని 15 డీలర్‌షిప్‌ల ద్వారా ఈ EV6 వాహనాలను కియా విక్రయించనుంది. ఇందుకోసం డీలర్‌షిప్‌ల వద్ద 150 కిలోవాట్ల ఫాస్ట్‌ ఛార్జర్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనానికి ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 355 మంది ఈవీ6 (EV6) కోసం బుక్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. సెప్టెంబరు నుంచి ఈవీ6 (EV6) డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

EV6 ప్రత్యేకతలివే..

* ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.

* 350కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్‌ అవుతుంది. 150 కిలోవాట్‌ ఛార్జర్‌ అయితే 40 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్‌ అవుతుంది.

* ఆల్‌ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌, సన్‌రూఫ్‌, మల్టిపుల్‌ డ్రైవ్‌ మోడ్స్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ అవైడెన్స్‌ అసిస్ట్‌ వంటి 60కి పైగా ఫీచర్లున్నాయి.

* ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ముందు, వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ వంటి సదుపాయాలున్నాయి.

* దీనిలో 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది.

* ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌లో సింగిల్‌ మోటార్‌ ఉంటుంది. ఇది 226 హార్స్‌పవర్‌, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

* ఏడబ్ల్యూడీ వెర్షన్‌లో డ్యుయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంటుంది. ఇవి 320 బీహెచ్‌పీ పవర్‌, 650 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని