Adani: కిడ్నాపర్ల చెర నుంచి.. ముంబయి పేలుళ్లలో బయటపడ్డ అదానీకి ఇప్పుడు మరో పెద్ద సవాల్‌!

అదానీ గ్రూపుపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అపర కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయాడు.

Published : 30 Jan 2023 01:18 IST

దిల్లీ: కాలేజీ చదువుకు దూరమైనా.. చిన్నతనంలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే సంపన్న వ్యక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో కిడ్నాపర్లకు బందీగా మారి.. ముంబయి పేలుళ్ల నుంచీ తప్పించుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. మూడున్నర దశాబ్దాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకున్న ఆయన.. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డారు. ఇలా ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలోకి చేరుకున్న గౌతమ్‌ అదానీ.. ప్రస్తుతం మరోసారి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

3 నుంచి ఏడో స్థానానికి పడిపోయి..

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీకి హిండెన్‌బర్గ్‌ రూపంలో అతిపెద్ద సవాల్‌ ఎదురవుతోంది. షేర్ల విలువ పతనం కావడంతో వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఆయన కంపెనీలు చవిచూస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే సుమారు రూ.లక్షన్నర కోట్లకుపైగా అదానీ సంపద ఆవిరయ్యింది. దీంతో ప్రపంచంలోనే అపరకుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న ఆయన.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయారు.

వజ్రాల షాపులో పనిచేసి..

అహ్మదాబాద్‌లో ఓ జైన్‌ కుటుంబంలో జన్మించిన అదానీ.. కాలేజీ చదువును మధ్యలోనే మానేశారు. టీనేజర్‌గా ఉన్న సమయంలో ముంబయికు చేరుకున్న ఆయన.. వజ్రాల వ్యాపారి దగ్గర కొంతకాలం పనిచేశారు. అనంతరం 1981లో గుజరాత్‌కు తిరిగి చేరుకున్న అదానీ.. పీవీసీ ఫిల్మ్‌ ఫ్యాక్టరీని నడిపించారు. 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో విదేశాలకు ఎగుమతులు మొదలుపెట్టిన ఆయన.. 1994లో లిస్టెడ్‌ కంపెనీగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో అడుగుపెట్టి అదానీ ఎంటెర్‌ప్రైజెస్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

కిడ్నాపర్ల చెరలో బందీగా..

అదానీ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో ఆయనకు అనూహ్య పరిణామం ఎదురయ్యింది. అదానీతోపాటు సహచరుడు శాంతీలాల్‌ పటేల్‌ కారులో వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు వారిని అడ్డుకున్నారు. నుదుటన తుపాకీ పెట్టి వారిని అపహరించారు. ఫజ్లూ రెహ్మాన్‌, భోగీలాల్‌ డార్జీ (అలియాస్‌ మామా) అనే గ్యాంగ్‌స్టర్లు వారిని కిడ్నాప్‌ చేశారని.. సుమారు రూ.10కోట్లు డిమాండ్ చేసినట్లు చెబుతుంటారు. అయితే, వారికి ఆ నగదు చెల్లించారా లేదా అనే విషయం తెలియనప్పటికీ.. ఒకరోజు తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి వారిద్దరూ విడులయ్యారు.

ముంబయి పేలుళ్ల ఘటనలో బయటపడి..

కిడ్నాపర్ల చెరనుంచి బయటపడిన అదానీకి మరోసారి మృత్యువు ఎదురొచ్చింది. 2008 నవంబర్‌ 26న ముంబయిలో ఉగ్రదాడి సమయంలో తాజ్‌ హోటల్‌ల్లోనే ఉన్నారు. దుబాయ్‌ పోర్టు సీఈవో మొహమ్మద్‌ షరీఫ్‌తో భేటీ అయిన ఆయన.. బిల్లు చెల్లించి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో ఉగ్రవాదులు తాజ్‌ హోటల్‌పై దాడులకు తెగబడి వందల మందిపై  కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 160మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ రాత్రి మొత్తం హోటల్‌ బేస్‌మెంట్‌లోనే గడిపిన ఆయన.. కమాండోలు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మరుసటి రోజు ఉదయం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ చేరుకున్న అదానీ.. ‘మృత్యువుని 15 అడుగుల దూరంలో చూశాను’ అని విలేకరులతో పేర్కొన్నారు.

వ్యాపారంలో..

నిత్యావసర వస్తువుల నుంచి 1988లో పోర్టు వ్యాపారంలోకి వచ్చిన అదానీ.. మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. అనతికాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. విద్యుత్‌, మైనింగ్‌, గ్యాస్‌, వంట నూనెల రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అదానీ వ్యాపారం మరింత విస్తరణ జరిగిందనే విమర్శలు ఉన్నాయి.  అనేక రంగాల్లో పెట్టుబడులతో ముందుకెళ్లిన అదానీ.. ఎయిర్‌పోర్టులు, సిమెంటుతోపాటు తాజాగా మీడియా రంగంలోకి ప్రవేశించారు. ఇలా ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన అదానీ.. ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో మూడోస్థానానికి చేరుకున్నారు.

వివాదాలు కొత్త కాదు..

అదానీ గ్రూపునకు వివాదాలు కొత్తేమీ కాదనే తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గని ప్రాజెక్టుపై అక్కడి పర్యావరణవేత్తల నుంచి అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. కేరళలో 900 మిలియన్‌ డాలర్లతో అదానీ గ్రూపు నిర్మిస్తున్న నౌకాశ్రయంపైనా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. నాలుగు నెలలపాటు కొనసాగిన వ్యవహారం ఇటీవలే సమసిపోయింది.

తాజాగా హిండెన్‌బర్గ్‌ నివేదిక రూపంలో మరో భారీ సవాలును అదానీ గ్రూపు ఎదుర్కొంటోంది. షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ చేసిన ఆరోపణలు అదానీ గ్రూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.  అదానీ గ్రూపుతోపాటు స్టాక్‌ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపించింది. ఇటువంటి సమయంలో తాజా సవాలును అదానీ అధిగమించి మదుపర్లలో ఎలా విశ్వాసం నింపుతారనే విషయంపై మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు