Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో రైతులు ఎంత రుణం పొందొచ్చు?

రైతుల పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు స్వల్పకాలిక రుణాన్ని అందిస్తుంది.

Updated : 11 Oct 2022 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా తక్కువ వడ్డీకే సమయానుసారంగా రుణాలు అందిస్తాయి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు. భారత ప్రభుత్వం రైతుల కోసం ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KCC) పథకాన్ని 1998లో స్వల్పకాలిక అధికారిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక రంగాల్లో రైతులు, అవసరమైన పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు స్వల్పకాలిక రుణాన్ని పొందొచ్చు. దీన్ని నాబార్డ్‌  (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలెప్‌మెంట్‌) రూపొందించింది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఫీచర్లు, ప్రయోజనాలు..

 • వ్యవసాయం, ఇతర అనుబంధ కార్యకలాపాలైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, దుక్కి దున్నడం, కూలీల ఖర్చు, పంటకోత, మార్కెటింగ్‌ ఖర్చులు, తదితర అవసరాల కోసం ఈ కార్డు ద్వారా రుణం తీసుకోవచ్చు. 
 • పాడి పశువులు, పంపుసెట్లు మొదలైన వ్యవసాయ అవసరాల పెట్టుబడి కోసం రుణం పొందొచ్చు. 
 • రైతులు ఈ కార్డు ద్వారా రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.
 • కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కార్డుదారులకు శాశ్వత వైకల్యం ఏర్పడినా, మరణించినా రూ.50 వేల వరకు, ఇతర రిస్క్‌లకు రూ. 25వేల వరకు బీమా కవరేజీ ఉంటుంది.
 • అర్హులైన రైతులకు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పొదుపు ఖాతాను, స్మార్ట్ కార్డు, డెబిట్ కార్డులను కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో పాటు అదనంగా జారీ చేస్తారు.
 • అవాంతరాలు లేకుండా రుణం అందించడంతో పాటు సౌకర్యవంతమైన చెల్లింపులు ఎంపిక చేసుకోవచ్చు.
 • అన్ని వ్యవసాయ, అనుబంధ అవసరాల కోసం సింగిల్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ/టర్మ్‌ లోన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 
 • ఎరువులు, విత్తనాలు మొదలైన వాటి కొనుగోలు అలాగే వ్యాపారులు/డీలర్ల నంచి నగదు రాయితీలను పొందడంలో సహాయపడుతుంది. 
 • 3 సంవత్సరాల వరకు క్రెడిట్‌ అందుబాటులో ఉంటుంది. పంటకాలం ముగిసిన తర్వాత తిరిగి చెల్లించవచ్చు. 
 • రూ. 1.60 లక్షల వరకు రుణాలకు ఎలాంటి పూచీకత్తూ అవసరం ఉండదు.

వడ్డీ, ఇతర ఛార్జీలు..

కేసీసీ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకులకూ ఒకే విధంగా ఉండవు. వినియోగదారునికి అందుబాటులో ఉన్న రుణ పరిమితిని అనుసరించి 2 నుంచి 4 శాతం వరకు వడ్డీ వర్తిస్తుంది. దీనికి తోడు వడ్డీ రేటుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు రాయితీలను అందిస్తోంది. ఇవి కార్డుదారుని చెల్లింపు చరిత్ర, క్రెడిట్‌ చరిత్రపై ఆధారపడి ఉంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజులు, బీమా ప్రీమియం (వర్తిస్తే), భూమి తనఖా దస్తావేజు ఛార్జీలు మొదలైన ఇతర రుసుములు ఉంటాయి. జారీ చేసే బ్యాంకులను బట్టి ఛార్జీలు మారొచ్చు. 

ఎవరు అర్హులు?

వ్యవసాయం చేసే రైతులతో  (సొంత భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు) పాటు, మత్స్య సంపద, పౌల్ట్రీ, పశువర్థకంతో సంబంధం ఉన్న రైతులు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 18 నుంచి 75 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకవేళ మీరు సీనియర్‌ సిటిజన్‌ అయితే చట్టబద్ధమైన వారసులు కో-బారోయర్‌గా ఉండాలి. 

KCC దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు..

 • దరఖాస్తు ఫారం
 • రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు
 • ఐడీ ఫ్రూఫ్‌ (ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, మొదలైన వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు)
 • డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు వంటివి చిరునామా ఫ్రూఫ్‌ కోసం ఇవ్వాలి. 
 • రెవెన్యూ అధికారులు సర్టిఫై చేసిన భూమి పత్రాలు
 • రుణ మొత్తం రూ.1.60 లక్షల నుంచి రూ. 3 లక్షలు వరకు ఉన్నప్పుడు, బ్యాంకు కోరితే పీడీసీ సెక్యూరిటీ వంటి ఇతర పత్రాలను ఇవ్వాలి.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం..

భారత ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి యోజన స్కీమ్‌ను 2019లో లాంచ్‌ చేసింది. ఈ స్కీమ్‌ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాదీ రూ. 6000ను ప్రభుత్వం అందజేస్తుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డును కూడా ఈ పథకం కిందకి తీసుకువచ్చారు. అందువల్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ కిందకి వచ్చే లబ్ధిదారులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డును పొందొచ్చు. 

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద కేసీసీకి దరఖాస్తు చేసుకునే విధానం..

 • పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైటు (https://pmkisan.gov.in/Documents/Kcc.pdf) నుంచి గానీ, మీ బ్యాంకు వెబ్‌సైటు నుంచి గానీ దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిచేయాలి.
 • మీ విత్తన పంట, భూమి రికార్డు వంటి ప్రాథమిక సమాచారాన్ని పూరించాలి. 
 • ఈ ఫారంను కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (సీఎస్‌సీ)కు సమర్పించాలి. వారు ఈ ఫారంలను అన్ని బ్యాంకులకు బదిలీ చేస్తారు. 

సందేహాలు ఉంటే..?

కేసీసీకి సంబంధించి ఏమైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే, కిసాన్ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌ని సంప్రదించవచ్చు. మీరు 1800115526 లేదా 011-24300606 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు స్కీమ్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలను తెలియజేయవచ్చు. సర్వీస్‌ ప్రొవైడైర్‌ను అనుసరించి కాల్‌ ఛార్జీలు వర్తిస్తాయి. pmkisan-ict@gov.in కు మెయిల్‌ కూడా చేయవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు