PPF ఖాతా తెరవాలనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఖాతాదారుడు నెల‌లో 1వ తేదీ నుంచి 4వ తేదీ లోపు డిపాజిట్ చేసిన‌ట్ల‌యితే ఆ నెలకు వడ్డీ పొందొచ్చు

Updated : 27 Sep 2022 17:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భార‌త్‌లో ఇప్ప‌టికీ చాలా మంది దీర్ఘకాల పొదుపు కోసం ప్ర‌భుత్వ హామీనిచ్చే ప‌థ‌కాల‌నే ఎంచుకుంటున్నారు. వీటిలో వడ్డీ ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉంటుంది. ఇత‌ర ప్ర‌భుత్వ హామీనిచ్చే పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీతో పోల్చి చుస్తే పీపీఎఫ్‌లో వ‌డ్డీ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ఈ పథకానికి సంబంధించి కొన్ని విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీపీఎఫ్ ప‌థ‌కాన్ని1968లో దేశంలో చిన్న మొత్తాల పొదుపుల‌ను పెట్టుబ‌డి రూపంలో స‌మీక‌రించే ల‌క్ష్యంతో ప్ర‌వేశ‌పెట్టారు. దీని కాల‌వ్య‌వ‌ధి 15 సంవ‌త్స‌రాలు. కాల‌వ్య‌వ‌ధి పూర్త‌యిన త‌ర్వాత ఖాతాను కొన‌సాగించాల‌నుకుంటే 5 సంవ‌త్స‌రాలు పొడిగించుకోవ‌చ్చు. మెచ్యూరిటీ తరువాత ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కొక‌సారి, ఎన్నిసార్ల‌యినా ఖాతాను పొడిగించుకోవ‌చ్చు.

పీపీఎఫ్ ఖాతాను ఎక్క‌డ తెర‌వొచ్చు?

పీపీఎఫ్ ఖాతాను మీ స‌మీప పోస్టాఫీసులో గానీ, ప్ర‌ముఖ ప్ర‌భుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో గానీ ప్రారంభించొచ్చు. ఆయా బ్యాంకుల శాఖ‌ల్లో స్వ‌యంగా వెళ్లి ద‌ర‌ఖాస్తుతో పాటు ఆధార్‌, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కేవైసీ ప‌త్రాలు స‌మ‌ర్పించి ఖాతాను తెర‌వొచ్చు. కొన్ని బ్యాంకుల్లో ఆన్‌లైన్‌లో కూడా ఖాతాను తెర‌వొచ్చు. చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చేయొచ్చు.

ఖాతా బ‌దిలీ

ఖాతాదారుడు నివాసం మారిన‌ప్పుడు ఖాతాను సంబంధిత ప్రాంతానికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు, పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు కూడా ఖాతాను మార్చొచ్చు.

ఖాతా తెర‌వ‌డానికి అర్హ‌త

18 సంవ‌త్స‌రాలు నిండిన భార‌తీయ పౌరులు ఎవ‌రైనా పీపీఎఫ్‌లో ఖాతాను తెరిచి పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా తెర‌వ‌డానికి గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు. ఒక వ్య‌క్తి ఒక ఖాతానే తెర‌వాలి. 2వ ఖాతాను మైన‌ర్ పేరు మీద ఆప‌రేట్ చేయొచ్చు. అది కూడా మైన‌ర్ మైనారిటీ తీరే వ‌ర‌కు మాత్ర‌మే. ఉమ్మ‌డి ఖాతా సౌక‌ర్యం లేదు. NRIలు, HUFలు పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌డానికి అర్హులు కాదు. అయితే, వారి పేరు మీద ఇప్ప‌టికే పీపీఎఫ్ ఖాతా ఉంటే కాల‌వ్య‌వ‌ధి (15 ఏళ్ల‌) వ‌ర‌కు అది అమ‌ల్లో ఉంటుంది. త‌ర్వాత ఖాతా పొడిగింపునకు వారికి అర్హ‌త ఉండ‌దు.

డిపాజిట్ ఎంత చేయాలి?

ప్రారంభంలో రూ.100తో ఖాతాను తెర‌వొచ్చు. సంవ‌త్స‌రానికి క‌నీస డిపాజిట్‌ రూ.500. గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల దాకా కూడా పెట్టుబ‌డి పెట్టొచ్చు. క‌నీస‌, గ‌రిష్ఠ  ప‌రిమితిని బ‌ట్టి ఇందులో డిపాజిట్‌ను ఏడాదికి 1-12 సార్లు దాకా కూడా చేయొచ్చు. గ‌రిష్ఠ డిపాజిట్‌గా సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌లకు మించి వేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఒక‌వేళ డిపాజిట్‌ చేసినా వడ్డీ రాదు. క‌నీస డిపాజిట్‌ను చెల్లించ‌క‌పోతే ఏడాదికి రూ. 50 చొప్పున జ‌రిమానా చెల్లించాలి.

పీపీఎఫ్ వ‌డ్డీ రేటు

ప్ర‌స్తుతం పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఈ వ‌డ్డీ నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. నెల‌లో 5వ తేదీ నుంచి చివ‌రి తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉన్న క‌నీస ఖాతా బ్యాలెన్స్‌పై వ‌డ్డీ ఇస్తారు. కాబ‌ట్టి ఖాతాదారుడు నెల‌లో 1వ తేదీ నుంచి 4వ తేదీ లోపు డిపాజిట్ చేసిన‌ట్ల‌యితే ఆ నెలకు వడ్డీ పొందొచ్చు. సంవ‌త్స‌రానికొక‌సారి డ‌బ్బులు క‌ట్టేవారు కూడా ఏప్రిల్ 1-4 లోపు డిపాజిట్ చేయ‌డం మంచిది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

పీపీఎఫ్‌లో పెట్టుబ‌డుల‌తో పాటు వడ్డీపై కూడా పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఈ ప‌థ‌కంలో చేసిన డిపాజిట్లకు ఆదాయ‌ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సి కింద మిన‌హాయింపు ఉంటుంది. పీపీఎఫ్ పెట్టుబడుల గురించి ఉద్యోగ సంస్థకు తెలపడం ద్వారా లేదా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ (ఐటీఆర్‌) ఫైల్ చేసినప్పుడు సెక్ష‌న్ 80సి కింద ఈ ప‌న్ను ప్ర‌యోజనాన్ని క్లెయిమ్ చేయొచ్చు. మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను వర్తించదు.

ఉద్యోగ విర‌మ‌ణ నిధిగా

ఉద్యోగ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ఎవ‌రికైనా నెల నెలా ఆదాయం అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఈ ఆదాయానికి భారీ నిధి అవ‌స‌రం. ఈ నిధి కోసం పీపీఎఫ్ పెట్టుబ‌డిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఉద్యోగ విర‌మ‌ణ చేసే 15 ఏళ్ల ముందు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి నెలా రూ. 10 వేల‌ను పీపీఎఫ్‌లో మదుపు చేశారనుకుందాం. దీనికి ప్ర‌స్తుత వ‌డ్డీ 7.10% లెక్క‌గా తీసుకుంటే మీకు లభించే వడ్డీ రూ.13,55,680. మొత్తం అస‌లు, వ‌డ్డీ కలిపి రూ. 31,55,680 అవుతుంది. దీన్ని ఎల్ఐసీ వయ వందన యోజన లేదా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లాంటి హామీ ఉండే ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టి నెల నెలా ఆదాయం పొందొచ్చు.

నామినీకి ప్ర‌యోజ‌నం

పీపీఎఫ్‌కు నామినీ సౌక‌ర్యం ఉంది. ఇది 15 ఏళ్ల దీర్ఘ‌కాల ప‌థ‌కం, ఖాతాదారుడు ప్ర‌త్యేక‌మైన ప‌రిస్థితుల్లో త‌ప్ప ఖాతాను మూసివేయ‌డానికి వీలుండ‌దు. కానీ, ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే.. నామినీ ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తం, అప్ప‌టి వ‌ర‌కు లభించిన వ‌డ్డీ తీసుకొని ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని