ప్రతీనెల రూ. 4950 ఖ‌చ్చిత‌మైన రాబడి.. ఎలా అంటే.. 

వ‌డ్డీ ఆదాయానికి ఆర్‌డీ ఖాతాను జ‌త‌చేయ‌డం ద్వారా మ‌రింత రాబ‌డిని పొంద‌వ‌చ్చు. 

Updated : 18 May 2021 11:49 IST

సురక్షితమైన పెట్టుబడి మార్గంలో నెలనెల మంచి రాబడి కోరుకునే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్(ఎమ్ఐపి) సరైనది. దీంట్లో ఉన్న ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. పెట్టుబడి పెట్టిన మొదటి నెల నుంచి ఈ పథకం ద్వారా వడ్డీ పొందవచ్చు.  అసలు మొత్తం.. అలానే ఉంటుంది. 

వ్య‌క్తులు.. సింగిల్‌గా, గానీ ఉమ్మ‌డిగా గానీ ఖాతా తెర‌వ‌చ్చు.  సింగ‌ల్‌గా ఖాతా తెరిస్తే.. గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకూ,  ఉమ్మడి (జాయింట్)గా ఖాతా తెరిచినట్లయితే, గరిష్ఠంగా రూ.9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తారు. ఉమ్మడిగా ఖాతా తెరిచే వారు రూ.9 లక్షల పెట్టుబడి పెట్టి, 6.6శాతం వడ్డీ రేటుతో ప్రతీ నెల రూ.4950 చొప్పున, అసలు మొత్తంపై ఏడాదికి రూ.59,400 వరకు వడ్డీ పొందవచ్చు. 

రూ.4950 వ‌డ్డీ మొత్తాన్ని ఏ నెల‌కు .. ఆనెల విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ విధంగా అస‌లు మొత్తం ప్ర‌భావితం కాకుండా వ‌డ్డీతో ప్ర‌తీ నెల‌ ఆదాయం పొందొచ్చు. అస‌లు మొత్తాన్ని మెచ్యూరిటి స‌మ‌యంలో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కంలో చిన్న మొత్తాల‌ను కూడా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. క‌నీసం రూ.1500తో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 

మూల‌ధ‌న భ‌ద్ర‌త‌.. 
ప్ర‌భుత్వ హామీ ఉన్న ప‌థ‌కం కాబ‌ట్టి మెచ్యూరిటి వ‌ర‌కు మీరు డిపాజిట్ చేసిన మొత్తం సుర‌క్షితంగా ఉంటుంది. 

మెచ్యూరిటి..
ఈ ప‌థ‌కానికి 5 సంవ‌త్స‌రాలు లాక్-ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. మెచ్యూరిటీ స‌మ‌యంలో పెట్టుబ‌డి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. లేదా తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. కాల‌ప‌రిమితి ముగిసిన త‌రువాత విత్‌డ్రా చేసుకునే వారు పూర్తి వివరాలతో నింపిన ఫారంతోపాటు, ఎంఐఎస్ పాస్‌బుక్‌ను పోస్టాఫీస్లో సమర్పించాలి.

వ‌డ్డీ..
ఈ ప‌థ‌కం ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 6.6 శాతం, పెట్టుబడి పెట్టిన రోజు నుంచి ఖాతాదారుకు నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ పోస్టాఫీసు నుంచి నేరుగా తీసుకోవచ్చు లేదా మన పొదుపు ఖాతాలో లేదా బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. లేదా ఆర్‌డీ ఖాతా ద్వారా తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వడ్డీ సొమ్ము విత్డ్రా చేసుకోకపోతే దానిపై అదనంగా వడ్డీ జమ అవ్వదు.

ఖాతా ప్రారంభించే పద్ధతి:
ఖాతాను నగదు/చెక్కు ద్వారా చెల్లించి ప్రారంభించవచ్చు. పూర్తి వివరాలతో నింపిన ఎంఐఎస్ ఫారంతో పాటు సంబంధిత చిరునామా, గుర్తింపు పత్రాలు, రెండు ఫొటోలు ఏదైనా పోస్టాఫీస్లో సమర్పించాలి. ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయ సంతకం అవసరమవుతుంది. ఓ ఖాతాదారు ఎన్ని ఎంఐఎస్ ఖాతాలైన తెరిచే అవకాశం ఉంది. అయితే అన్ని ఖాతాల మొత్తం రూ.4.5లక్షలకు మించరాదు. నెలవారీ ఆదాయ పథకం ఖాతాకు పాస్‌బుక్‌ అందజేస్తారు.

ఖాతా బదిలీ:
ఓ పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. గడువుకు ముందే ఖాతా మూసివేయడం, డిపాజిట్ చేసిన ఏడాది తర్వాత ఖాతాను మూసివేసి నగదును విత్డ్రా చేసుకోవచ్చు. అయితే, ఏడాది తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతా మూసివేస్తే డిపాజిట్ మొత్తం నుంచి 2శాతం, మూడేళ్లు నిండిన త‌ర్వాత‌ ఐదేళ్లు పూర్తి కాక మందు మూసివేస్తే, డిపాజిట్ మొత్తం నుంచి 1శాతం కోత విధిస్తారు.

నామినేషన్:
ఖాతా ప్రారంభ సమయంలో లేదా తర్వాత ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు. నామినీని ఎప్పుడైనా మార్చుకునే స‌దుపాయ‌మూ ఉంది. 

నెల‌వారి ఆదాయాన్ని ఇచ్చే ఇత‌ర ప‌థ‌కాల‌తో పోల్చి చూస్తే..


 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని