Investment Planning: పెట్టుబ‌డులు పెట్టేటప్పుడు చూడాల్సిన 5 రిస్క్‌లు!

పెట్టుబడులు వేరు వేరు చోట్ల పెడుతూ ఫోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవడం ద్వారా న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు.

Updated : 16 Feb 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ‌బ్బుతో డ‌బ్బును ఆర్జించాలంటే పెట్టుబ‌డులు పెట్టక తప్పదు. బంగారం, ఆస్తి కొనుగోళ్లు, డిపాజిట్లు, బాండ్లు, స్టాక్స్ ఇలా ఎవ‌రి ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లు వారు పెట్టుబ‌డుల‌ను ఎంచుకుంటారు. అయితే, మ‌నం చేసే ప్రతి పెట్టుబడిలోనూ ఎంతో కొంత నష్టభయం ఉంటుంది. కొన్నింటిలో ఎక్కువుంటే మ‌రికొన్నింటిలో త‌క్కువ‌గా ఉంటుంది. అయితే, నిధుల మొత్తాన్ని ఒకేచోట కాకుండా వేరు వేరు చోట్ల పెడుతూ పెట్టుబ‌డుల ఫోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవడం ద్వారా న‌ష్టభయం తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. పెట్టుబ‌డులు చేసేట‌ప్పుడు ఎలాంటి రిస్క్‌లు ఉంటాయో తెలుసుకుంటే.. ప్రమాదాన్ని ఏవిధంగా తగ్గించుకోవచ్చో తెలుస్తుంది. అందువ‌ల్ల పెట్టుబ‌డుల‌లో ఎలాంటి న‌ష్టభయాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ద్రవ్యోల్బణంతో వచ్చే రిస్క్‌: మదుపరులు ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదాల్లో ద్రవ్యోల్బణం ముఖ్యమైనది. ఇది కొనుగోలు శ‌క్తిని త‌గ్గిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ‌స్తువు ధ‌ర రూ.100 ఉంటే, వ‌చ్చే సంవ‌త్సరానికి ద్రవ్యోల్బణం రేటు 5 శాతం పెరిగితే.. అదే వస్తువును వ‌చ్చే సంవ‌త్సరం రూ.105కు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఖర్చు మ‌రో రూ.5 పెరిగిందన్నమాట. ఒకవేళ మీరు మూడేళ్ల తర్వాత బైక్ కొనాల‌నుకుంటున్నారు. దాని ధ‌ర ప్రస్తుతం రూ.లక్ష ఉంది కాబట్టి ఇంత మొత్తాన్ని సేక‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటారు. నెల ఖ‌ర్చులు పోగా కొంత మొత్తాన్ని పొదుపు చేసి మూడేళ్లలో ఆ మొత్తాన్ని పోగుచేశారనుకుందాం. కానీ మూడేళ్ల త‌ర్వాత అదే బైకు ధ‌ర రూ.1.30 లక్షలు అయ్యిందనుకుందాం. అప్పుడు బైక్ కొనాలంటే మ‌రో రూ.30 వేలు కావాలి. ఇదే ద్రవ్యోల్బణ ప్రభావం. పెట్టుబ‌డి పెట్టకుండా పొదుపు చేస్తూ ఉంటే కావాల్సిన వ‌స్తువును కొనుగోలు చేయ‌డం క‌ష్టం అవుతుంది. ఈ రోజు రూ. 1 ల‌క్ష ఉన్న బైక్ ధ‌ర మూడేళ్ల త‌ర్వాత ద్రవ్యోల్బణ ప్రభావంతో పెరుగుతుంది. కాబ‌ట్టి పొదుపు ఒక్కటే సరిపోదు. పెట్టుబ‌డులూ చేయాలి. ద్రవ్యోల్బణాన్ని అంచ‌నా వేసి,  దాన్ని అధిగ‌మించే రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు వంటివి సురక్షిత పెట్టుబడి మార్గాలు. అయితే, వీటి ద్వారా వచ్చే రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేకపోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్లు, లార్జ్‌క్యాప్‌ ఫండ్లు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించగలవు.

వ‌డ్డీ రేట్లతో వచ్చే రిస్క్‌: స్థిరాదాయ ప‌థ‌కాలపై వ‌చ్చే రాబ‌డి, అవి ఇచ్చే వ‌డ్డీరేట్లపై ఆధారపడి ఉంటాయి. ఎంత ఎక్కువ వ‌డ్డీ రేటు ఉంటే అంత ఎక్కువ రాబ‌డి ఉంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే, వ‌డ్డీ రేట్లలో వ‌చ్చే మార్పులు బాండ్లు, డిబెంచ‌ర్లు వంటి డెట్ సాధ‌నాల‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం మూలంగా బాండ్ల ధ‌రలు త‌గ్గుతాయ‌ని, వ‌డ్డీ రేట్లు త‌గ్గిన సంద‌ర్భంలో బాండ్ల ధ‌రలు పెరగ‌డాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా? వడ్డీరేట్లు పెరిగినప్పుడు బాండ్లు మార్కెట్లో ముఖ విలువ కంటే తక్కువ ధరకు, వ‌డ్డీరేట్లు త‌గ్గిన‌ప్పుడు ముఖ విలువ కంటే ఎక్కువ ధరకు ట్రేడ‌వ్వడం వ‌ల్ల ఇవి నేరుగా ప్రభావితం అవుతాయి. అలాగే, వ‌డ్డీ రేట్ల ప్రభావం స్టాక్స్, మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి ఈక్విటీ సాధ‌నాల‌పై ప‌రోక్షంగా ఉంటుంది. వ‌డ్డీ రేట్లు పెరిగితే, సంస్థ తీసుకున్న రుణ చెల్లింపు ఖ‌ర్చులు పెరిగి సంస్థ సామ‌ర్థ్యంపై ప్రభావం పడుతుంది. దీంతో స్టాక్ ధ‌ర త‌గ్గే అవ‌కాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్‌లో మదుపు చేస్తాయి కాబట్టి అవి కూడా తగ్గొచ్చు. మ‌రోవైపు స్థిరాస్తులపైనా దీని ప్రభావం ఉంటుంది. వ‌డ్డీ రేట్లు పెరిగితే ఈఎమ్ఐ చెల్లింపులు భారం అవుతాయి. కాబ‌ట్టి ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు కొనుగోలుదారులు సంశ‌యిస్తారు. దీంతో కొనుగోళ్లు నెమ్మదిస్తాయి. ఈ ప్రభావం డెవ‌ల‌ప‌ర్లపైనా పడుతుంది. సరిపడా నిధులు అందక నిర్మాణాలు నెమ్మదిస్తాయి.

క్రెడిట్ రిస్క్‌: ఏ విధంగా అయితే వ‌డ్డీ రేట్ల ప్రభావం రుణ గ్రహీతలపై ఉంటుందో అదే విధంగా క్రెడిట్ రిస్క్ రుణ‌దాత‌ల‌పై ఉంటుంది. రుణ దాత‌, రుణ గ్రహీతకు కొంత మొత్తాన్ని ఇచ్చి, అస‌లుతో పాటు వ‌డ్డీ రూపంలో కొంత‌ మొత్తాన్ని తీసుకుంటాడు. రుణ గ్రహీత తిరిగి చెల్లించ‌డంలో విఫ‌ల‌మ‌య్యే సంభావ్యత క్రెడిట్‌ రిస్క్ అంటారు. పెట్టుబ‌డిదారుల‌కు క్రెడిట్ రిస్క్ ఉంటుంది. ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ యూనిట్లు (పీఎస్‌యూలు) లేదా ప్రైవేట్ కంపెనీల్లో మ‌నం మ‌దుపు చేస్తుంటాం. అలాంట‌ప్పుడు ఆయా సంస్థలు గ్రహీతలు అవుతాయి. ప్రభుత్వం జారీ చేసే బ్యాంక్‌ సెక్యూరిటీలు, బాండ్లు, ఆర్‌బీఐ జారీ చేసే ట్రెజరీ బిల్లుల్లో క్రెడిట్‌ రిస్క్‌ తక్కువగా ఉంటుంది. ఆర్థిక ప‌త‌నం వంటివి చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. అలా జ‌రిగితే త‌ప్ప వీటికి రిస్క్ ఉండ‌దు. పీఎస్‌యూలు జారీ చేసే బాండ్లు, బ్యాంకు డిపాజిట్లకు కూడా క్రెడిట్ రిస్క్ త‌క్కువ‌గానే ఉంటుంది. కార‌ణం, వీటికి ప్రభుత్వం పూచీకత్తుతో పాటు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్‌ (డీఐసీజీసీ) ద్వారా రూ. 5 లక్షల బీమా ఉంటుంది. కాబ‌ట్టి, ఆర్థిక సంస్థ దివాళా తీసే ప‌రిస్థితి వ‌చ్చినా డిపాజిట్లకు రిస్క్‌ తక్కువే ఉంటుంది. ప్రైవేటు సంస్థలు జారీ చేసే డిబెంచ‌ర్లు, వాణిజ్య ప‌త్రాలకు వాటికి ఇచ్చిన క్రెడిట్ రేటింగ్ ఆధారంగా న‌ష్టభ‌యం వివిధ స్థాయిల‌లో ఉంటుంది. 

లిక్విడిటీ రిస్క్: లిక్విడిటీ అంటే నిధుల లభ్యత. అవ‌స‌ర‌మైన వెంట‌నే విలువ ఏ మాత్రం తగ్గకుండా ఆస్తులను నగదుగా మార్చుకోగ‌ల సామ‌ర్థాన్ని లిక్విడిటీ అంటారు. నగదు రూపంలోకి మార్చుకోదగిన ఆస్తులు లేదా షేర్లు కూడా ఇందులోకి వస్తాయి. నగదుకు అధిక లిక్విడిటీ ఉంటుంది. కొన్ని ర‌కాల పెట్టుబ‌డులకు లిక్విడిటీ స‌మ‌స్య ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు డబ్బు బ్యాంకు పొదుపు ఖాతాలో వేస్తే దాని విలువ ఏ మాత్రం త‌గ్గుకుండా ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి దీనికి లిక్విడిటీ ఎక్కువ‌. అలాగే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కొంత వ‌ర‌కు లిక్విడిటీ స‌దుపాయం ఉంటుంది. కానీ రిక‌రింగ్ డిపాజిట్లు, సీనియ‌ర్ సిటిజన్‌ సేవింగ్స్ స్కీమ్‌, సార్వభౌమ ప‌సిడి ప‌థ‌కాలు, పీపీఎఫ్ వంటి వాటికి కొన్ని సంవ‌త్సరాల లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. కాబ‌ట్టి, వీటికి లిక్విడిటీ రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే, ఈక్విటీ పెట్టుబ‌డుల‌కు లిక్విడిటీ రిస్క్ స్వల్పకాలంలో ఎక్కువగానూ, దీర్ఘకాలికంలో తక్కువగానూ ఉంటుంది.

మార్కెట్ రిస్క్‌: ఓపెన్ మార్కెట్‌లో ఏదైనా సెక్యూరిటీ ట్రేడ్ అవుతున్నప్పుడు దాని ధ‌ర హెచ్చుత‌గ్గుల‌కు గుర‌య్యే ప్రమాదం ఉంది. ఇది డిమాండ్‌, సప్లయ్‌ సూత్రంపై ఆధార‌ప‌డి ప‌నిచేస్తుంది. దీంతో సెక్యూరిటీ అస‌లు విలువ‌కు, మార్కెట్ విలువ‌కు మధ్య వ్యత్యాసం ఉంటుంది. కాబ‌ట్టి కంపెనీ షేర్లు, ట్రేడెడ్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఆర్ఈఐటీ యూనిట్లు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి.

చివ‌రిగా: పెట్టుబడిదారుడిగా, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పెట్టుబడి నష్టాలను అర్థం చేసుకుని, మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లు పోర్ట్‌ఫోలియోని నిర్మించాల‌ని నిపుణులు సూచిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని