Rs.2,000 Notes: ప్రారంభమైన నోట్ల మార్పిడి.. ఈ విషయాలు తెలుసా?

Rs.2,000 Notes: రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచి వాటి మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 30 వరకు మార్చుకునేందుకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం!

Updated : 23 May 2023 16:52 IST

దిల్లీ: నేటి నుంచి రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈ ప్రక్రియను 2016 నాటి నోట్ల రద్దుతో పోల్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

కంగారొద్దు..

నోట్ల రద్దు సమయంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) వాటా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) వాటా కేవలం 10.8 శాతం మాత్రమేనని ఆర్‌బీఐ సైతం తెలిపింది. మరోవైపు నోట్ల రద్దు తర్వాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటు కాలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రూ.2,000 నోట్లు (Rs.2,000 Notes) చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఎలాంటి లావాదేవీకైనా దీన్ని ఉపయోగించుకోవచ్చని సూచించింది. మార్పిడి కోసం విధించిన సెప్టెంబరు 30 గడువు తర్వాత కూడా చెల్లుబాటు ఆగిపోతుందని ఇప్పటి వరకు ఆర్‌బీఐ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో నోట్ల మార్పిడికి ప్రజల దగ్గర తగినంత సమయం ఉంది.

మార్చుకోవాలా? డిపాజిట్‌ చేయాలా?

రూ.2000 నోట్ల (Rs.2,000 Notes) ఉపసంహరణ నేపథ్యంలో వాటిని మార్చుకోవాలా? లేదా ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవాలా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఉన్న డబ్బుకు సరైన పత్రాలు, ఆధారాలు ఉంటే ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఒకసారి 10 నోట్లను మాత్రమే మార్చుకోవాలనే నిబంధన కేవలం నోట్ల మార్పిడికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. డిపాజిట్‌ విషయంలో ఈ నిబంధన అమలు కాదని పేర్కొన్నారు. కేవలం కొన్ని నోట్లు మాత్రమే ఉంటే మార్చుకోవడం మేలని చెబుతున్నారు. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే.. మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదు.

పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేస్తే..

రూ.2.5 లక్షల వరకు చేసే డిపాజిటర్లను ఎలాంటి ప్రశ్నలు అడగబోమని 2016లో నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వం తెలిపింది. ఈ పరిమితి మించిన వారికి ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) నోటీసులు పంపింది. కానీ, ఈసారి మాత్రం దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అయితే, ఆదాయ పన్ను (Income Tax) శ్లాబుల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్‌ చేస్తే ఎటువంటి నోటీసులు అందే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అలాగే డిపాజిట్‌ చేసిన మొత్తానికి.. ఐటీ రిటర్నుల్లో చూపిన ఆదాయానికి పొంతన ఉండాలి. లేదంటే నోటీసులు అందే అవకాశం ఉంది. అలాగే పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేసేవారు ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తప్పనిసరి కాకపోయినా.. అనుకోకుండా ఏదైనా ఇబ్బంది తలెత్తితే రక్షణగా ఉంటుందని చెబుతున్నారు.

ఎస్‌ఎఫ్‌టీ రూల్స్‌ తెలుసా?

ఖాతాదారులు కచ్చితంగా ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌’ (SFT rules) నిబంధనలను తెలుసుకోవాలి. కొన్ని లావాదేవీల విలువ నిర్దేశిత పరిమితి మించితే వాటిని బ్యాంకులు ఆదాయ పన్ను విభాగానికి నివేదిస్తాయి. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, చెక్కుల విలువ రూ.10 లక్షలు దాటితే వాటిని కూడా బ్యాంకులు ఐటీ అధికారులకు తెలియజేస్తాయి. పొదుపు ఖాతాల్లో డిపాజిట్ల విలువ రూ.10 లక్షలు దాటినా ఐటీకి తెలిసిపోతుంది. మరోవైపు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమ, ఉపసంహరణ విలువ రూ.20 లక్షలు దాటితే పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సి ఉంటుంది. అదే కరెంటు ఖాతా విషయంలోనైతే ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంది.

రూ.2 లక్షల పరిమితి..

నగల వ్యాపారులు లేదా బిల్డర్లు.. ఇలా ఎవరికైనా చెల్లించేటప్పుడు రూ.2 లక్షల పరిమితి ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఒక రోజులో ఒక వ్యక్తి లేదా సంస్థ రూ.2 లక్షల వరకు మాత్రమే నగదు రూపంలో స్వీకరించడానికి అనుమతి ఉంది. పెద్ద బిల్లులను రూ.2 లక్షల కింద విభజించి స్వీకరించడం కూడా నిబంధనలకు విరుద్ధం.

కేవైసీ పత్రాలు తీసుకెళితే మేలు..

నోట్ల మార్పిడికి పాన్‌, ఆధార్‌ వంటి పత్రాలను విధిగా సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అయితే, సాధారణంగా డిపాజిట్ల మొత్తం రూ.50 వేలు దాటితే పాన్‌ జత చేయాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉంది. అదే ఇప్పుడు కూడా వర్తిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం స్పష్టం చేశారు. అయినప్పటికీ.. డిపాజిట్‌ చేసే మొత్తంతో సంబంధం లేకుండా నోట్ల మార్పిడి కోసం వెళ్లే అందరూ కేవైసీ పత్రాలను వెంట తీసుకెళ్లడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తీసుకెళ్లడం తప్పనిసరి కాకపోయినప్పటికీ.. వెంట ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.

ఒకరోజులో ఎంత మొత్తం..

ఒకరోజులో ఎంత మొత్తం మార్చుకోవచ్చనే దానిపై ఆర్‌బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే, ఒక్క లావాదేవీలో 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. అలా ఎన్నిసార్లైనా లైన్‌లో నిలబడి నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, నగదు లభ్యత, బ్యాంకుల్లో రద్దీ.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు స్థానికంగా ఏమైనా పరిమితులు విధించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని