Updated : 10 Jun 2022 16:50 IST

Investments: పెట్టుబడులు ప్రారంభించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి


సంపదను సృష్టించడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మ‌దుపు చేయ‌డం అవ‌స‌రం. అయితే, ఒక ప్ర‌ణాళిక లేకుండా పెట్టుబ‌డులు పెట్టినా అవి స‌రైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌వు. అందువ‌ల్ల ఒక ప్రణాళిక ప్ర‌కారం పెట్టుబడులు చేయ‌డం చాలా అవసరం. అప్పుడే అనుకున్న స‌మ‌యానికి అవ‌స‌ర‌మైన డ‌బ్బును స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. 

ల‌క్ష్యం గురించి స్ప‌ష్ట‌త ఉండాలి..
మీరు డబ్బును ఎందుకోసం మ‌దుపు చేయాల‌నుకుంటున్నారో ముందుగా ఒక అవ‌గాహ‌న ఉండాలి. ఇల్లు, కారు కొనుగోలు డౌన్‌పేమెంట్ కోసం, విహార‌యాత్ర‌ల కోసం, పిల్ల‌ల చ‌దువుల కోసం, ప‌ద‌వీవిర‌మ‌ణ కోసం..ఇలా ఎందుకోసం నిధిని స‌మ‌కూర్చుకోవాలో తెలుసుకోవాలి. మీ లక్ష్యం గురించి మీకు స్పష్టమైన ఆలోచన వచ్చిన తర్వాత డబ్బును పెట్టుబడి పెట్టే విధానం చాలా సులభం అవుతుంది.

స‌మ‌యం..
మీ ఆర్థిక లక్ష్యం గురించి మీకు స్పష్టత‌ వచ్చిన తర్వాత, దాని కోసం డ‌బ్బు స‌మ‌కూర్చుకునేందుకు ఎంత స‌మ‌యం ఉందో అంచ‌నా వేయాలి. స్వల్పకాలిక, మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యమైనా స‌మ‌యాన్ని బ‌ట్టి పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు,  మీరు ఏడాది త‌ర్వాత విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకుంటున్నారు. ఇందుకు రూ. 2 ల‌క్ష‌లు అవ‌స‌రం అనుకుందాం. ల‌క్ష్య సాధాన‌కు ఏడాది స‌మ‌యం మాత్ర‌మే ఉంటే స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యం కింద‌కి తీసుకురండి. స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల కోసం బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్‌/రిక‌రింగ్ డిపాజిట్‌, లిక్విడ్ ఫండ్లు, ఫోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు, డెట్ సాధనాలు, కార్పొరేట్ డిపాజిట్లు వంటి వాటిని ఎంచుకోవచ్చు. మీరు నెల‌కు 18 వేల చొప్పున మ‌దుపు చేస్తే 6 శాతం రాబ‌డి అంచ‌నాతో ఒక ఏడాదిలో రూ. 2.23 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌మ‌కూర్చుకోగ‌ల‌రు. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం, అంటే ప‌ద‌వీవిర‌మ‌ణ వంటి వాటి కోసం 15 నుంచి 20 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటే ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్ వంటి ప‌థ‌కాల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. సిప్ ద్వారా మ్యూచ్‌వ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. 

ఎంత రిస్క్ తీసుకోగ‌ల‌రో తెలుసుకోండి..
వేగంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న ప‌థ‌కాల‌లో పెట్ట‌బడులకు సిద్ధం అవుతారు. తీరా మ‌దుపు చేయ‌డం ప్రారంభించ‌న త‌ర్వాత న‌ష్టం వ‌స్తే మ‌ధ్య‌లోనే పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల అన‌వ‌స‌ర‌మైన ఒత్తిడి త‌ప్ప అనుకున్న ల‌క్ష్యానికి కావల‌సిన నిధుల‌ను స‌మ‌కూర్చుకోలేరు. అందువ‌ల్ల ముందుగా మీ న‌ష్ట‌భ‌యాన్ని తెలుసుకోండి. దానికి త‌గిన‌ట్టే పెట్టుబ‌డులను ఎంచుకోవాలి. 

ల‌క్ష్యానికి త‌గిన పెట్ట‌బడిని ఎంచుకోండి..
పెట్టుబ‌డులు ఎప్పుడూ మీ ల‌క్ష్యం, అందుకు త‌గిన స‌మ‌యాన్ని బ‌ట్టి ఉండాలి. అంతేకానీ ల‌క్ష్యం ఒక‌టి అయితే పెట్టుబ‌డులు మ‌రోలా ఉండ‌కూడ‌దు. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు పిల్ల‌ల స్కూల్ ఫీజు కోసం పొదుపు చేస్తున్నారు అనుకుందాం. ఇందుకు ఒక సంవ‌త్స‌రం స‌మ‌యం ఉంది. ఇందుకోసం ఈఎల్ఎస్ఎస్ లో మ‌దుపు చేయ‌డం స‌రికాదు. ఎందుకంటే ఇందులో మూడు సంవ‌త్స‌రాల లాక్ - ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. అందువ‌ల్ల మీ ల‌క్ష్యం, అందుకు ఉన్న స‌మ‌యం ఆధారంగా పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి.

స్థిరంగా ఉండండి..
మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత, దానిని స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం. పెట్టుబడులకు ఒక క్రమశిక్షణా విధానాన్ని అనుసరించి, సరైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోండి. అలాగే, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రణాళిక కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు స్థిరత్వం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి సాధనాల్లో మదుపు చేసినపుడు రాబడులు స్థిరంగా, పరిమితంగా ఉంటాయి. అయితే, దీర్ఘకాలం పాటు మదుపుచేసేవారికి ఈక్విటీ పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చేందుకు వీలుంటుంది. వీటిలో నష్టభయం, అస్థిరత ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడిని మదుపర్లకు అందిస్తాయి.

ఓర్పు అవ‌స‌రం..
పెట్టుబడి పెట్టేటప్పుడు ఓర్పు అనేది చాలా అవ‌స‌రం. దీర్ఘకాలం, క్రమశిక్షణ, ఓర్పుతో పెట్టే పెట్టుబడులతో గొప్ప ఫలితాలను సాధించవచ్చు. ఓర్పు లేకపోవడం వల్ల‌ కొన్ని సందర్భాల్లో మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కోల్పోవచ్చు. మీ పెట్టుబడులు కాలక్రమేణా పెరిగి, గరిష్ట లాభాలను పొందేందుకు ఇది ఒక బలమైన పరిష్కారం చూపుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, హెచ్చుతగ్గులనేవి సాధారణమైనవి. మార్కెట్ అనుకూలంగా లేనప్పుడు మీరు బలహీనపడి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. వాటిని అధిగమించి మంచి రాబడులను పొందడానికి ప్రయత్నించండి.

చివ‌రిగా..
ఇవాళ పొదుపు చేసి మ‌దుపు చేసిన ఒక రూపాయి రేపు మరొక రూపాయిని సంపాదిస్తుంది. చిన్నగా మొద‌లు పెట్టినా సరే, పెట్టుబ‌డులు ప్రారంభించండి. చిన్న మొత్తంలో చేసే పెట్టుబ‌డులు స్వ‌ల్ప‌కాలంలో మిమ్మల్ని ప్రభావితం చేయకపోయినా, దీర్ఘకాలంలో కచ్చితంగా సహాయపడతాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts