ఆన్‌లైన్ పాల‌సీల కొనుగోలుతో ప్ర‌యోజ‌నాలివే!

క్యూలైను త‌రిగిపోయి ఆన్‌లైన్ జోరు పెరుగుతోన్న ఈ త‌రుణంలో ఆన్‌లైన్ పాల‌సీలపై ఓ లుక్కేద్దాం!

Published : 20 Dec 2020 13:18 IST

ఆరోగ్య బీమా తీసుకోవడం అవసరం. అంత వరకు బాగానే ఉంటుంది. ఎక్కడ తీసుకోవాలి? ఎవరిని సంప్రదించాలి? ఏజెంటు మనకు సరైన సమాచారం ఇస్తాడా? చివరకు మన అవసరాలకు తగిన పాలసీని తీసుకోగలుగుతామా? ఇలాంటి సందేహాలు ఎన్నో… పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానంతో పనులు సులభతరంగా వేగవంతంగా జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా బట్టలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పుస్తకాల దగ్గర నుంచి మంచి భోజనం, ఆఖరకు తాజా పండ్లు, కూరగాయలను ఇంటి దగ్గర కూర్చునే కొనుగోలు చేస్తున్నాం. మరి మన ఆర్ధిక భరోసాకి ఎంతో ముఖ్యమైన బీమా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే? దీని వల్ల లాభాలేంటో చూద్దాం…

స‌మ‌యం ఆదా:

ఆన్‌లైన్‌ ఆరోగ్య బీమాతో ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. బీమా కంపెనీకి వెళ్లక్కర్లేకుండా సులువుగా ఇంట్లో కంప్యూటర్‌ ముందు కూర్చొని పాలసీని పొందేందుకు వీలుంది. అదే ఏజెంటు ద్వారా పాలసీ తీసుకోవాలనుకుంటే అతడి కోసం వేచిచూడాల్సి ఉంటుంది.

మారుతున్న జీవనశైలితో రోజువారీ పనులు చేసుకోవడమే కష్టమవుతోంది. అలాంటిది పాలసీ కొనేందుకు ఏజెంట్ల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే మొత్తం సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.

భ‌ద్రంగా పాల‌సీ డాక్యుమెంట్లు:

పాలసీకి సంబంధించిన దస్త్రాలు, ప్రీమియం రశీదు వంటివి భద్రపర్చుకోవడం కష్టం. ఏదైనా అగ్నిప్రమాదం లాంటివి జరిగితే ముఖ్యమైన పత్రాలు కాలిపోయే ప్రమాదం ఉంది. అదే ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకున్నట్టయితే పాలసీ నంబరు ఉంటే చాలు. మన బీమా సంబంధిత సమాచారం సురక్షితం.

ప్ర‌శ్న‌ల రూపంలో సులువుగా:

ఆన్‌లైన్‌లో మనకు సరిపోయే ఆరోగ్య పాలసీ కొనడం చాలా సులువు. కొన్ని వెబ్‌సైట్లు మన అవసరాలు ఎలాంటివో ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించి మనకు తగ్గ పాలసీలను మనముందుంచుతాయి. వాటిలో మనకు సరైన పాలసీని ఎంచుకునేందుకు వీలుంటుంది.

ఏజెంటు క‌మీష‌న్ ఆదా :

ఏజెంటు ద్వారా తీసుకునే పాలసీకి నిర్వహణ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలను బీమాదారుడి పైనే వేస్తారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి మధ్యవర్తిత్వానికి అవకాశం ఉండదు కనుక ప్రీమియం రేట్లు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఆఫ్‌లైన్‌ విధానంలో పొందే పాలసీ అయితే ఏజెంటు చెప్పిన పాలసీలకే మనం పరిమితమవుతాం. అంటే అవకాశాలను తక్కువ చేసుకున్నట్టే. అదే ఆన్‌లైన్‌లో విస్తారమైన అవకాశాలు మన ముందుంటాయి. అందులోంచి సరైన వాటిని నేర్పుతో ఎన్నుకోవడమే మనముందున్న పని.

పోల్చి చూసుకునేందుకు అవ‌కాశం:

ఆన్‌లైన్‌లో వివిధ ఆరోగ్య బీమా కంపెనీల పాలసీలను పోల్చి చూడవచ్చు. వాటి ప్రీమియం ధరల్లో తేడాలు, బీమా పరిధిలోకి వచ్చే అంశాలు, జరిగిన నష్టానికి ఎంత మేరకు చెల్లిస్తున్నాయి, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వివరాలు, బీమా పరిధిలోకి వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యలు, వెయిటింగ్‌ పీరియడ్‌ లాంటివెన్నో పోల్చుకొని చూసి మనకు సరైనదేదో ఎంచుకునే వీలుంటుంది.

కొనుగోలు దిశ‌కు దారి:

ఒకవేళ మనకేదైనా పాలసీ నచ్చితే దాన్ని కొనుగోలు చేసేందుకు ఆరోగ్య బీమా కంపెనీ వెబ్‌సైట్లు వినియోగదారులకు ‘కొనుగోలు దిశగా’ తీసుకెళ్తాయి (రీడైరెక్ట్‌). అక్కడ మనకు సంబంధించిన వివరాలన్నీ నింపితే మనకు తగ్గ పాలసీ ఎంచుకోమని సూచిస్తుంది. పాలసీ కాలవ్యవధి, ఎంత మేరకు బీమా రక్షణ అందించాలి, ఏయే సమస్యలకు పాలసీ అవసరమవుతుంది, ప్రీమియం ఎంత వ్యవధికి చెల్లించగలం అన్న వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన పేరు, చిరునామా ఫోన్‌ నంబరు లాంటి ప్రాథమిక సమచారం అందించాక ‘పేమెంట్‌ గేట్‌ వే’కు తీసుకెళుతుంది. అక్కడ మనం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాక మనకు పాలసీ సంఖ్య, ఆన్‌లైన్‌ పాలసీ పొందినట్టుగా పత్రం వస్తుంది. వాటిని ప్రింట్‌ తీసి భద్రపర్చుకోవడమో లేదా మెయిల్‌కు పంపించుకుంటే సరిపోతుంది.

ప్రీమియంల చెల్లింపు ఆన్‌లైన్‌లోనే:

ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకున్న తర్వాత ప్రీమియంలను సైతం ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు లేదా మనం ప్రీమియం చెల్లించే తేదీని మర్చిపోతామని భావించినట్టయితే నేరుగా మన ఖాతా నుంచే నిర్ణీత తేదీకి డెబిట్‌ అయ్యేలా స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చుకునే వీలును కూడా కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ముందుగా మన ఆరోగ్య అవసరాలు గుర్తించాలి. అందుకు తగిన వివరాలు నింపి బీమా వెబ్‌సైట్లు ఇచ్చే ‘కోట్‌’ను పొందాలి. అది మనకు సరైనదో కాదో పోల్చి చూసుకోవాలి.

  • ఇతర పాలసీలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కువ బీమా, తక్కువ ప్రీమియం మాత్రమే చూడకుండా తీవ్ర అనారోగ్యాలు, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మన పరిధిలో ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించాలి.

  • ఆన్‌లైన్‌లో మన వివరాలను నిజాయతీగా నింపాలి. ఉదాహరణకు పొగతాగే అలవాటు బాగా ఉందనుకోండి. అప్పుడప్పుడు పొగ తాగుతాను అని రాయకూడదు. ఎందుకంటే రక్తపరీక్ష చేసినప్పుడు నికోటిన్‌ శాతం తెలుసుకోవడం చాలా సులభం. కుటుంబ ఆరోగ్య చరిత్ర, వంశపారంపర్య జబ్బుల గురించి తప్పక వివరాలు అందించాలి. ఇది వరకు ఏమైనా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడితే ఆ వివరాలు కూడా అందించాలి.

  • కొన్ని వెబ్‌సైట్లు బీమా కాలవ్యవధి లేదా పరిమితి పెంచుకుంటే రాయితీల ప్రకటనలతో వూరిస్తుంటాయి. ఇది ఒక రకంగా ధర అధికంగా చెప్పి 1 + 1 ఆఫర్ల లాంటివి ఇవ్వడమే. ఒక్కోసారి మనకు అంత బీమా అవసరం అవ్వకపోవచ్చు. ఉదాహరణకు అయిదేళ్లకు ఆరోగ్య బీమా తీసుకుంటే రూ.5000 అవుతుంది. అదే పదేళ్లకు తీసుకుంటే రూ.9000 అవుతుందని బీమా కంపెనీలు వూరిస్తాయి. మనకవసరమయ్యేది కేవలం ఐదేళ్లకయినప్పుడు అదనంగా రూ.4వేలు చెల్లించాల్సి వస్తుంది.

  • ఆన్‌లైన్‌లో ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ నుంచి తీసుకోవడం శ్రేయస్కరం.

  • చెల్లింపు జరిపేటప్పుడు సురక్షితమైన వెబ్‌సైట్‌కి వెళుతున్నామా లేదా అని పరిశీలించాలి. ఇందుకు గుర్తుగా వెబ్‌ అడ్రసులో సెక్యూర్డ్‌ అన్నట్టు ఆకుపచ్చ రంగులో చిరునామా కన్పిస్తుంది.

  • పేమెంట్‌ గేట్‌వే దగ్గర కార్డు వివరాలు జాగ్రత్తగా నింపాలి. ధ్రువీకరించిన సైట్ల ద్వారానే చెల్లింపు జరుగుతుందన్న విషయాన్ని గమనించాకే ముందుకెళ్లాలి.

  • చెల్లింపు జరిపాక వచ్చే పాలసీ దస్త్రాలు భద్రంగా ‘సేవ్‌’ చేసుకోవడం మంచిది. వీలైతే ప్రింట్‌ తీసుకొని ఉంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని