Aadhaar: దగ్గర్లో ఆధార్‌ కేంద్రం ఎక్కడుందో ఇలా సులభంగా తెలుసుకోండి..!

Aadhaar: ఆధార్ కేంద్రాన్ని వెతకడం అంటే ఓ సవాలే. ఈ సమస్యను పరిష్కరించడం కోసమే భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోతో చేతులు కలిపింది. 

Updated : 15 Jul 2022 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌ (Aadhaar) ఆవశ్యకత గురించి చెప్పాల్సిన పనిలేదు. మరి అలాంటి కీలక పత్రంలో ఏదైనా పొరపాటు సరిచేయించుకోవాలంటే కచ్చితంగా ఆధార్ (Aadhaar) నమోదు కేంద్రానికి వెళ్లాల్సిందే. కానీ, చాలా సందర్భాల్లో అలాంటి కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం పెద్ద సమస్యే. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ఆధార్ (Aadhaar) కేంద్రాన్ని వెతకడం అంటే ఓ సవాలే. ఈ సమస్యను పరిష్కరించడం కోసమే భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోతో చేతులు కలిపింది.

ఇస్రో అనుబంధంగా పనిచేసే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC)తో కలిసి ‘భువన్‌ ఆధార్‌ (Bhuvan Aadhaar)’ అనే పోర్టల్‌ను ప్రారంభించారు. దీనిద్వారా ఆధార్‌ కార్డుహోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందొచ్చు. దగ్గర్లో ఉన్న ఆధార్‌ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు మార్గం, ఏ పరిసరాల్లో ఉందో మ్యాప్‌లో చూపే ఫీచర్లను ఈ పోర్టల్‌ అందిస్తోంది.

దగ్గర్లో ఆధార్‌ కేంద్రం ఎక్కడుందో ఇలా తెలుసుకోండి..

  • https://bhuvan.nrsc.gov.in/aadhaar/ పోర్టల్‌లోకి వెళ్లండి. స్క్రీన్‌కు ఎడమ వైపున మీకు నాలుగు డ్రాప్‌-డౌన్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.
  • దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో ‘సెంటర్స్‌ నియర్‌బై’ను ఎంపిక చేసుకోండి. వెంటనే మీకు దగ్గర్లోకి కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • మీకు ప్రత్యేకంగా ఒక ఆధార్‌ సేవా కేంద్రం పేరు తెలిస్తే ‘సెర్చ్‌ బై ఆధార్‌ సేవా కేంద్ర’ అనే ఆప్షన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
  • పిన్‌కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఆధార్‌ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు.
  • రాష్ట్రం, జిల్లా, మండలం.. వంటి వివరాలను ఎంటర్‌ చేసి ఆయా రాష్ట్రాల్లోని ఆధార్‌ కేంద్రాల వివరాలన్నింటినీ చూసుకోవచ్చు.
  • టూల్స్‌ అనే సెక్షన్‌పై క్లిక్‌ చేసి దగ్గర్లోని కేంద్రానికి మార్గాన్ని కూడా చూసుకోవచ్చు.

ముఖాన్ని స్కాన్‌ చేసి ధ్రువీకరణ..

మరోవైపు ఇప్పటి వరకు ఆధార్‌ (Aadhaar) వివరాల్ని ధ్రువీకరించడానికి ఐరిస్‌, వేలిముద్రల్ని కచ్చితంగా స్కాన్‌ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఉడాయ్‌ ఇటీవల ఆధార్‌ ఫేస్‌ఆర్‌డీ (Aadhaar FaceRD) యాప్‌ను తీసుకొచ్చింది. ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంట్లో నుంచే మీ ముఖాన్ని స్కాన్‌ చేయడం ద్వారా ఆధార్‌ వివరాల్ని ధ్రువీకరించొచ్చు. ప్రత్యేకంగా ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల రేషన్‌ షాపులు, కొవిన్‌ వ్యాక్సినేషన్‌, ఇతర ప్రభుత్వ పథకాల వినియోగం మరింత సులభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని