Risk: పెట్టుబ‌డుల‌కు ముందు మీ రిస్క్ ప్రొఫైల్ తెలుసుకోండి.. 

యుక్త వ‌య‌సులో ఉండే వారు న‌ష్టం వ‌చ్చినా తిరిగి సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది.

Updated : 04 Jan 2022 16:37 IST

పెట్టుబడుల‌ అనుకూలతను నిర్ణయించడంలో పెట్టుబడిదారుడు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన ముఖ్య‌మైన అంశం రిస్క్ ప్రొఫైల్. 'రిస్క్' అనే పదాన్ని విన్న‌ప్పుడు కొంత మంది ముందుగా రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశాన్ని అంచ‌నా వేస్తె, కొంత‌మంది న‌ష్ట సంభావ్య‌త‌ను అంచ‌నా వేస్తారు. ఇది వారి వారి దృష్టి కోణం, పెట్టుబ‌డుల‌పై వారికి ఉన్న అవ‌గాహ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే రిస్క్ అనేది వేరు వేరు వ్య‌క్తుల‌కు వేర్వేరుగా ఉంటుంది.

రిస్క్ ప్రొఫైలింగ్.. పెట్టుబ‌డుల ప‌ట్ల వ్య‌క్తుల ఆమోద‌యోగ్య‌త‌తో పాటు ప్ర‌మాద కార‌కాన్ని అర్థం చేసుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది. పెట్టుబ‌డుల విష‌యంలో వారి సంసిద్ధ‌త‌ను తెలియ‌జేస్తుంది. అంటే పెట్టుబ‌డిదారునికి రిస్క్ తీసుక‌నే సామ‌ర్ధ్యం, సుముఖ‌త రెండూ ఉండాలి. రిస్క్ తీసుకునే సామర్థ్యం లెక్కించేందుకు పెట్టుబడిదారుడి వయసు, ఆదాయం, పెట్టుబడులతో ఉన్న అనుభవం, రాబడులను అర్థం చేసుకోవడం, సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన, సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు, భావోద్వేగాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకుంటారు.

భావోద్వేగాలు..
పెట్టుబ‌డులలో లాభ‌, న‌ష్టాల‌ను చూసి మీరు ఎంత భావోద్వేగాల‌కు లోనౌతున్నారో మీ పెట్టుబ‌డుల చ‌రిత్ర‌ను చూస్తే తెలుస్తుంది. మీ పెట్టుబ‌డులు 10 శాతం పెరిగిన‌ప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు...20శాతం తిరోగ‌మ‌నం ఉన్న‌ప్పుడు ఎలా స్పందిస్తున్నారు అనేది తెలుసుకోవ‌డం ముఖ్యం. మ‌రీ ముఖ్యంగా అస్థిర మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టే మ‌దుప‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా త‌మ‌కు తాము వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌లు ఇవి. మార్కెట్లు అనిశ్చితికి లోనై తిరోగ‌మ‌నంలో ఉన్న‌ప్పుడు కొంద‌రు మ‌దుప‌ర్లు భావోద్వేగాల‌కు లోనై డ‌బ్బు ఉప‌సంహ‌రించుకుంటారు. దీంతో న‌ష్టాలు చ‌విచూస్తారు. అలాకాకుండా కొంత స‌మ‌యం ఓర్పుతో వేచి చూస్తే మంచి ఫ‌లితాల‌ను చూడ‌గ‌ల‌రు. దీనికి కొంత స‌హ‌నంతో వేచి చూడ‌డం అవ‌స‌రం.  

సుముఖ‌త‌..
సాధారణంగా, సురక్షితమైన ఆదాయాన్ని కలిగి ఉన్న యువ పెట్టుబడిదారుడు దీర్ఘకాలిక లక్ష్యం కోసం ఎక్కువ రిస్క్ తీసుకోగలడు. అదే పెట్టుబడిదారుడు సమీపకాల లక్ష్యం కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. తదనుగుణంగా, పెట్టుబడి ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్క‌డ రిస్క్ తీసుకునే సుముఖతను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంద‌రు పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోగలిగినప్పటికీ కొన్ని సందర్భాలలో అధిక స్థాయి రిస్క్‌తో అసౌకర్యంగా ఉండవచ్చు. సాధారణంగా వయసు ఎక్కువ ఉన్న మదుపర్లు అధిక రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా ఉండరు.

రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం ఈ కింది అంశాల ఆధారంగా అంచ‌నా వేయ‌చ్చు..
ఆర్థిక స్థతి..

ఒక వ్య‌క్తి ఆర్థిక స్థితిపై కూడా రిస్క్ తీసుకునే సామ‌ర్ధ్యం ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన పెట్టుబడులు తాకకుండా తన నగదు ప్రవాహాన్ని కొనసాగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటే,  వారికి రిస్క్ తీసుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. అదే విధంగా, అవ‌స‌రాల కోసం పెట్టుబడుల నుంచి వ‌చ్చే ఆదాయంపై ఆధార‌ప‌డిన వారికి రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.  

వ‌య‌సు..
పెట్టుబ‌డుల విష‌యంలో మ‌దుప‌ర్ల వ‌య‌సు చాలా ముఖ్య‌మైన‌ది. న‌ష్టాన్ని భ‌రించ‌గ‌ల సామ‌ర్థ్యం వ‌య‌సుతో ముడిప‌డి ఉంటుంది. యుక్త వ‌య‌సులో ఉండే వారు కొంచెం రిస్క్‌ ఎక్కువున్న వాటిలో మ‌దుపుచేసినా ప‌ర్వాలేదు. ఎందుకంటే ఒక వేళ న‌ష్టం వ‌చ్చినా తిరిగి సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. అదే ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన‌ వారు లేదా మ‌ధ్య‌వ‌య‌స్కులు న‌ష్ట‌భ‌యం త‌క్కువున్న సాధానాలు ఎంచుకోవ‌డం మంచిది. వీరికి న‌ష్టం వ‌స్తే తిరిగి సంపాదించుకునే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

కుటుంబ బాధ్యతలు..
మదుపుచేసే ముందు కుటుంబ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ‌న‌పై ఆధార‌ప‌డే వారు ఉంటే న‌ష్ట భ‌యం త‌క్కువ‌గా ఉన్న సాధ‌నాల‌ను ఎంచుకోవాలి. పెళ్లి కాక ముందు యువ‌కులుగా ఉన్న‌పుడు , ఆర్థిక అవ‌స‌రాలు త‌క్కువ‌గా ఉన్న‌పుడు కొంత న‌ష్ట‌భ‌యం క‌లిగిన‌ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు.

కాల‌వ్య‌వ‌ధి..
పెట్టుబడి లక్ష్యాలు, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాన్ని సాధించే కాలవ్యవధి పెట్టుబడిదారుపై ప్రభావం చూపించే అంశాలు. కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే అంత నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. పెట్టుబడుల్లో ఒడిదుడుకులను సమన్వయం ప‌ర్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. పెట్టుబ‌డి చేసేముందు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పాటించ‌డం ద్వారా న‌ష్టం రాకుండా నివారించ‌వ‌చ్చు.

చివ‌రిగా..
మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి స‌రిపోయే పెట్టుబ‌డి సాధ‌నాన్ని ఎంచుకోవాలి. త‌క్కువ న‌ష్టభ‌యం ఉన్న వారు స్థిరాదాయ ప‌థ‌కాల్లో మ‌దుపుచేయ‌డం మంచిది. నష్టాన్ని త‌ట్టుకునే వారు ఈక్విటీ సంబంధిత ప‌థ‌కాల్లో మ‌దుపుచేయోచ్చు. స‌రైన పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోక‌పోతే న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని