Investments: పెట్టుబ‌డులు ప్రారంభిస్తున్నారా?మీ రిస్క్ సామ‌ర్థ్యం ఎంతో తెలుసుకోండి!

న‌ష్ట‌భ‌యం ఒక్కో మ‌దుప‌రికి ఒక్కోవిధంగా ఉంటుంది. ఇది వ్యక్తి వయసు, ఆదాయం త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. 

Updated : 31 Jan 2022 16:22 IST

మార్కెట్లు ఒడుదొడుకుల‌కు లోన‌వ‌గానే పెట్టుబ‌డుల‌ను విక్ర‌యించేస్తుంటారు కొంద‌రు. దీనికి కార‌ణం న‌ష్ట‌భ‌యాన్ని త‌ట్టుకోలోకపోవ‌డం. అందుకే పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియో త‌యారు చేసుకునేట‌ప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకోగ‌ల‌రు అని అంచ‌నా వేసుకొని ముంద‌డుగు వేయాలి. మ‌దుప‌ర్లు అంచ‌నా వేసుకున్న దానికంటే, త‌క్కువ రాబ‌డి వ‌చ్చే ప‌రిస్థితిని న‌ష్టభ‌యం అంటారు. ప్ర‌భుత్వ సెక్యురిటీల‌లో త‌ప్ప ప్ర‌తీ పెట్టుబ‌డి సాధ‌నంలో ఎంతోకొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది. న‌ష్ట‌భ‌య తీవ్ర‌త ఆయా పెట్టుబ‌డి సాధ‌నాలు ఇచ్చే రాబ‌డి పై ఆధార‌ప‌డి ఉంటుంది. రాబ‌డి, న‌ష్ట‌భ‌యం రెండూ ఒకే దిశలో పయనిస్తాయి. ఎక్కువ‌గా రిస్క్ ఉన్న పెట్టుబ‌డి సాధ‌నాల్లో ఎక్కువ రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న సాధ‌నాల్లో త‌క్కువ రాబ‌డి ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం వ్యక్తి వయసు, ఆదాయం త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇది ఒక్కో మ‌దుప‌రికి ఒక్కోవిధంగా ఉంటుంది. సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన క‌లిగి ఉండ‌టం ద్వారా సరైన నిర్ణయం తీసుకోగలరు. పెట్టుబ‌డి చేసేముందు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పాటించ‌డం ద్వారా న‌ష్టం రాకుండా నివారించ‌వ‌చ్చు. పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు ఎవ‌రికి వారు కొన్ని ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానాలు చెప్పుకోవాలి. ఒక‌వేళ ఏవైనా కార‌ణాల చేత‌ మార్కెట్లు 15 శాతం న‌ష్ట‌పోతే అప్పుడు ప‌రిస్థితి ఏంటి?ఇలాంటి ప్ర‌శ్న‌లు ముందే వేసుకోవాలి. రిస్క్ ప్రొఫైల‌ర్ లు వివిధ ఆర్థిక సంస్థ‌లు త‌మ వెబ్‌సైట్ ల‌లో ఉంచుతాయి. వాటిని పూరించి మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యాన్ని అంచనా వేసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు, మ‌ధ్య వయసులో ఉన్న‌ వ్య‌క్తికి, ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చేర‌వలో ఉన్న వ్య‌క్తికి రిస్క్ తీసుకునే విష‌యంలో చాలా తేడా ఉంటుంది. మ‌ధ్య వ‌య‌సు వ్య‌క్తి ఇంకా ఉద్యోగం చేసే వ‌య‌సు ఉంటుంది కాబ‌ట్టి అత‌డు కొంత ఎక్కువ రిస్క్ ఉన్న‌వాటిలో పెట్టుబ‌డులు చేసినా ఫ‌ర్వాలేదు. కానీ, ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న వ్య‌క్తి అయితే వ‌య‌సు, బాధ్య‌త‌లు, నెల‌వారిగా ఆదాయం లేని కార‌ణంగా అంత రిస్క్ తీసుకోలేడు. పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు మీరు ఎంత న‌ష్ట‌భ‌యానికి సిద్థంగా ఉన్నారనేది విశ్లేషించుకోవాలి. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు మార్కెట్ల ఒడుదొడుకుల‌ను అదిగ‌మించి రాబ‌డిని ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. రిస్క్ ఎక్కువ‌గా ఉండే ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో పెట్టే ముందు దీర్ఘ‌కాలం కొన‌సాగేందుకు సిద్ధం కావాలి. ఆర్థిక ల‌క్ష్యాల‌ను కూడా దానికి అనుగుణంగా ఏర్ప‌రుచుకోవాలి. ఆ విధంగా మీరు ఎంత వ‌ర‌కు న‌ష్ట‌భ‌యం త‌ట్టుకోగ‌ల‌రు, పెట్టుబ‌డుల ల‌క్ష్యం ఏమిటి, ఎంత‌కాలం కొన‌సాగిస్తారు వంటి వాటిపై స్ప‌ష్ట‌త ఉంటే న‌ష్టభ‌యం ఒత్తిడిని ఎదుర్కునే అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని